పండగ వెలుగు పంచి.. ఆరిపోయిన దీపాలు | Sakshi
Sakshi News home page

పండగ వెలుగు పంచి.. ఆరిపోయిన దీపాలు

Published Mon, Nov 13 2023 11:38 PM

జాతీయ రహదారి 216 యానాం బైపాస్‌ లచ్చిపాలెం వద్ద ప్రమాద స్థలంలో పడి ఉన్న యువకుల మృతదేహాలు   - Sakshi

తాళ్లరేవు: వారంతా రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేద కుటుంబాలకు చెందిన యువకులు. పెయింటింగ్‌ వర్క్‌ చేస్తూ వారి కుటుంబాలకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడ పని ఉంటే అక్కడకు వెళ్లి పనిచేస్తూ కుటుంబాలను పోషించుకుంటూ ఉంటారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో పనిచేస్తూ దీపావళి పండగ జరుపుకునేందుకు శనివారం వారి స్వగ్రామాలకు వచ్చారు. పండగను తమ వాళ్లతో ఉత్సాహంగా జరుపుకున్నారు. అంతలోనే వారి కుటుంబాలను విధి వెక్కిరించింది. సోమవారం తమ బంధువుల ఇంటి వద్ద కొద్దిపాటి పని ఉండడంతో నలుగురూ ఒకే బైక్‌పై అమలాపురం వైపు వెళ్లారు. పని ముగించుకుని తిరిగి వస్తుండగా జాతీయ రహదారి 216 యానాం బైపాస్‌ రహదారిలోని లచ్చిపాలెం వద్ద ఆగి ఉన్న ఇటుకల లోడు ట్రాక్టర్‌ను బలంగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో తాళ్లరేవు రచ్చవారిపేటకు చెందిన ఓలేటి శ్రీను(26), వైదాడి రాజు(24), పాలెపు ప్రసాద్‌(24) అక్కడికక్కడే మృతి చెందారు. పాలెపు ప్రసాద్‌ కుటుంబం రచ్చవారి పేటకు చెందినదైనప్పటికీ ఇటీవలే ఐ.పోలవరం మండలం రామాయంపేట జగనన్న కాలనీకి వెళ్లారు. కాగా మరొక యువకుడు రచ్చ శ్రీను తీవ్ర గాయాలపాలయ్యాడు. విషయం తెలుసుకున్న కోరంగి ఎస్సై రవికుమార్‌ హుటాహుటాన అక్కడకు చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. క్షతగాత్రుడు శ్రీనును తాళ్లరేవు బైపాస్‌ రహదారిలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. ఒకే గ్రామానికి చెందిన యువకులు మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యుల హాహాకారాలతో ఆ ప్రాంతం హృదయ విదారకంగా మారింది. చేతికందివచ్చిన యువకులు అర్ధాంతరంగా మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. విషయం తెలుసుకున్న ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌కుమార్‌ ప్రమాదానికి గల కారణాలను ఎస్సై రవికుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. రచ్చా శ్రీనుకు మెరుగైన వైద్యం అందేవిధంగా చర్యలు చేపట్టారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

రచ్చవారి పేటలో విషాద ఛాయలు

మృతులంతా తాళ్లరేవు మండలం రచ్చవారిపేట గ్రామానికి చెందినవారు కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడు ఓలేటి శ్రీను తండ్రి గతంలోనే మృతిచెందాడు. తల్లి, అతని భార్య, కుమార్తెకు అతనే ఆధారం. శ్రీను మృతితో కుటుంబానికి జీవనాధారం లేకుండా పోయిందని బోరున విలపిస్తున్నారు. వైదాడి ప్రసాద్‌ తండ్రి కూడా మృతి చెందడంతో కుటుంబాన్ని అతనే పోషిస్తున్నాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రచ్చా శ్రీనుకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఒకే గ్రామానికి చెందిన యువకులు మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు గుండెలవిసేలా విలపిస్తున్నారు.

ఆ పెయింటర్ల కుటుంబాల్లో

అమావాస్య చీకట్లు

ఇటుకుల లోడు ట్రాక్టర్‌ను ఢీకొన్న బైక్‌

ముగ్గురు యువకులను బలిగొన్న

రోడ్డు ప్రమాదం

మరొక వ్యక్తికి తీవ్ర గాయాలు

ఆయా కుటుంబాల్లో తీరని విషాదం

బోరున విలపిస్తున్న మృతుడు పాలెపు ప్రసాద్‌ తల్లి
1/5

బోరున విలపిస్తున్న మృతుడు పాలెపు ప్రసాద్‌ తల్లి

2/5

మృతులు ఓలేటి శ్రీను, వైదాడి రాజు, పాలెపు ప్రసాద్‌  (ఫైల్‌)
3/5

మృతులు ఓలేటి శ్రీను, వైదాడి రాజు, పాలెపు ప్రసాద్‌ (ఫైల్‌)

4/5

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రచ్చా శ్రీను
5/5

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రచ్చా శ్రీను

Advertisement

తప్పక చదవండి

Advertisement