ధర్మపురి పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులు

పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం
 - Sakshi

ధర్మపురి: ధర్మపురి పుణ్యక్షేత్రానికి త్వరలో ప్రత్యేక బస్సులు నడిపించే ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. నృసింహస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరైన ఆయన మాట్లాడుతూ.. ధర్మపురికి బస్సుల కొరత ఉందని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారని తెలిపారు. రాత్రి 11.30గంటలకు ధర్మపురి నుంచి వయా జగిత్యాల, కరీంనగర్‌ మీదుగా హైదరాబాద్‌ వెళ్లేందుకు ఏసీ బస్సు, రాత్రి 10 గంటలకు కరీంనగర్‌ నుంచి రాయపట్నం మీదుగా ధర్మపురికి బస్సు నడిపిస్తామన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఇబ్బంది రానీయొద్దన్నారు. భక్తులకు ప్రతిరోజూ సన్నబియ్యంతో భోజనం పెడుతున్నామని, నాణ్యతలోపం ఉండొద్దని సూచించారు.

27 నుంచి పొలాసలో శాస్త్రవేత్తల సమావేశం

జగిత్యాలఅగ్రికల్చర్‌: జగిత్యాలరూరల్‌ మండలంలోని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానంలో ఈనెల 27, 28న వ్యవసాయ శాస్త్రవేత్తల సమావేశాలు జరగనున్నాయి. సమావేశాలకు ఉమ్మడి కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లోని వ్యవసాయ పరిశోధన స్థానాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, డాట్‌సెంటర్‌ శాస్త్రవేత్తలు, ఆయా జిల్లాల వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు, అభ్యుదయ రైతులు పాల్గొననున్నారు. రానున్న వానాకాలం సీజన్‌లో రైతులు అనుసరించాల్సిన సాగు పద్ధతులపై ఫొటో ప్రెజెంటేషన్‌ ఉంటుంది. ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రీసెర్చ్‌ డైరెక్టర్‌ పి.రఘురామిరెడ్డి, ఎక్స్‌టెన్షన్‌ డైరెక్టర్‌ సుధారాణి పాల్గొంటారు. ఏర్పాట్లు చేసినట్లు పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం డైరెక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు.

జగిత్యాల చిన్నారులకు స్వర్ణ నంది పురస్కారం

జగిత్యాల: హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో భారత్‌ ఆర్ట్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో శివరాత్రి స్వర్ణనంది పురస్కార వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో జిల్లాలోని మేదిని లలిత కళాక్షేత్రానికి చెందిన చిన్నారులు నృత్య ప్రదర్శనలో పాల్గొన్నారు. అద్భుత ప్రదర్శన కనబర్చారు. దీనికి భారత్‌ ఆర్ట్స్‌ అకాడమీ న్యాటకళాకారిణి జ్యోతిరెడ్డి చేతులమీదుగా స్వర్ణనంది పురస్కారాలు అందించింది. చిన్నారులను గురువులు బొమ్మిడి నరేశ్‌కుమార్‌, మేదిని లలిత కళాక్షేత్రం అధ్యక్షుడు భుజంగరావు అభినందించారు.

బాధ్యతలు స్వీకరించిన ఈవో చంద్రశేఖర్‌

కొండగట్టు(చొప్పదండి): కొండగట్టు ఈవోగా కరీంనగర్‌ ఎండోమెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఈవోగా పనిచేసిన వెంకటేశ్‌ను పలు ఆరోపణల నేపథ్యంలో రెండు రోజుల క్రితం సస్పెండ్‌ చేసిన విషయం తెల్సిందే. ఆయన స్థానంలో చంద్రశేఖర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. అనంతరం చంద్రశేఖర్‌ గుట్టపైనున్న కోనేరు, అన్నదానం, లడ్డూ తయారీ కేంద్రం విభాగాలను తనిఖీ చేశారు. ఆయన వెంట ఏఈవో అంజయ్య, అధికారులు చందు, జమున, శ్రీనివాస్‌ సిబ్బంది ఉన్నారు.

Election 2024

Read latest Jagtial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top