అభివృద్ధి చేసి చూపిస్తా | Sakshi
Sakshi News home page

అభివృద్ధి చేసి చూపిస్తా

Published Thu, Nov 30 2023 1:40 AM

అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ - Sakshi

● ‘సాక్షి’తో కాంగ్రెస్‌ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

గొల్లపల్లి:‘ధర్మపురి నుంచి ఇప్పటికి నాలుగుసార్లు పోటీచేసి ఓడిపోయిన. అయినా ప్రజలతో ఉన్న. ప్రజాసమస్యలపై పోరాడుతూనే ఉన్న. ఒక్క అవకాశమిచ్చి చూడండి.. అభివృద్ధి చేసి చూపిస్తా.. శ్రీ అని అన్నారు కాంగ్రెస్‌ ధర్మపురి ఎమ్మెల్యే అభ్యర్థి అడ్లూరి లక్ష్మ ణ్‌కుమార్‌. ‘సాక్షి’తో మరిన్ని విషయాలు వెల్లడించారు.

సాక్షి: నియోజకవర్గ అభివృద్ధికి మీ ప్రణాళిక?

అడ్లూరి: నేను ఇదే నియోజకవర్గంలోని ధర్మారం నుంచి జెడ్పీటీసీగా గెలిచి ఉమ్మడి కరీంనగర్‌ జెడ్పీ చైర్మన్‌గా పనిచేసిన. ఇక్కడి సమస్యలు చాలా తెలుసు. ధర్మపురి నృసింహాలయానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఆలయ అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ రూ.500 కోట్లు ఇస్తామని ప్రకటించినా.. ఇప్పటికీ హామీ నెరవేరలేదు. ఎమ్మెల్యేగా గెలిస్తే ఆలయాన్ని అభివృద్ధి చేస్తా. ఇక్కడ బస్‌ డిపో ఏర్పాటు చేయిస్తా. కొత్త మండలాల్లో వసతులే లేవు. పెగడపల్లిలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయిస్తా.

సాక్షి: రైతుల ఇబ్బందులపై..?

అడ్లూరి: ఇక్కడ ప్రధానంగా వ్యవసాయమే ఆధారం. పండించిన పంటలో కోతలు అధికం. రైతులు ధర్నా చేసినా.. ఎవరూ పట్టించుకోలే. ధాన్యం కొనుగోళ్లలోనూ ఇబ్బందులే. ఆ పరిస్థితి రానీయను. అలాగే ప్రతి ఎకరా సాగులోకి వచ్చేలా చూస్తా.

సాక్షి: కాళేశ్వరం లింక్‌–2 ప్రాజెక్ట్‌ గురించి..?

అడ్లూరి: కాళేశ్వరం లింక్‌–2 ప్రాజెక్ట్‌ నుంచి ఇక్కడి ప్రజలకు ప్రయోజనం శూన్యం. పెగడపల్లి, గొల్లపల్లి, వెల్గటూర్‌ రైతులకు తీరని అన్యాయం జరిగింది. రూ.30 లక్షలు విలువ చేసే భూములకు కేవలం రూ.7లక్షల నుంచి రూ.9లక్షల పరిహారం ఇచ్చారు. బాధితులకు న్యాయం చేస్తా.

సాక్షి: మహిళల కోసం..?

అడ్లూరి: మహిళల అభివృద్ధికి కుటీర పరిశ్రమలు తీసుకొస్తాను. వారి ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తా. కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించినట్లు వారికి అన్ని విధాలా న్యాయం చేస్తాం.

సాక్షి: జంగల్‌నాలా ప్రాజెక్టుపై మీ వైఖరి..?

అడ్లూరి: ఐదు వేల ఎకరాల ఆయకట్టు ఉన్న జంగల్‌నాలా పునరుద్ధరణను గత ప్రభుత్వం పట్టించుకోలేదు. రైతులు ఏటా ఇబ్బంది పడుతున్నారు. మా ప్రభుత్వం రాగానే ఈ ప్రాజెక్ట్‌కు కాళేశ్వరం లింక్‌–2 నుంచి పైప్‌లైన్‌ వేసి రైతుల కష్టాలు తీరుస్తా.

1/1

Advertisement
Advertisement