నాడు కత్రినా.. నేడు ఇసాయాస్‌.. అమెరికన్లకు కునుకు లేకుండా.. | without power as Hurricane Isaias batters southeast US | Sakshi
Sakshi News home page

నాడు కత్రినా.. నేడు ఇసాయాస్‌.. అమెరికన్లకు కునుకు లేకుండా..

Oct 11 2026 12:00 PM | Updated on Oct 11 2026 12:33 PM

without power as Hurricane Isaias batters southeast US

అమెరికా తీరాన్ని మరోసారి హరికేన్‌ వణికించింది. బలమైన గాలులు.. ఇళ్లపై కూలిన చెట్లు.. దెబ్బతిన్న భవనాలు.. నిలిచిపోయిన విద్యుత్‌ సరఫరా.. తాగునీటి కొరత.. ఇలా హరికేన్‌ ఇసాయాస్‌ ప్రభావంతో ఫ్లోరిడా సహా పలు రాష్ట్రాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ తుపాను కారణంగా నలుగురు మరణించగా, లక్షలాది మంది విద్యుత్‌ లేక అంధకారంలో చిక్కుకున్నారు. తుపాను బలహీనపడినా.. వరదలు, టోర్నడోల ముప్పు మాత్రం వెంటాడుతోంది. గతంలో అమెరికాను అతలాకుతలం చేసిన ఇయాన్‌, కత్రినా వంటి హరికేన్లను గుర్తుచేస్తూ తాజా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

2026 అట్లాంటిక్‌ తుపాను సీజన్‌లో తొలి హరికేన్‌గా నమోదైన ఇసాయాస్‌.. ఫ్లోరిడా తీరాన్ని రెండో కేటగిరీ హరికేన్‌గా తాకింది. తీరాన్ని తాకిన తర్వాత బలహీనపడినప్పటికీ, దాని ప్రభావం విస్తృత ప్రాంతాల్లో కనిపించింది. ఫ్లోరిడా, అలబామా, జార్జియా, మిసిసిపీ రాష్ట్రాల్లో సుమారు 6.7 లక్షల మంది విద్యుత్‌ సరఫరా కోల్పోయినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడించింది. మరోవైపు, తుపాను ప్రభావం మొదలైన తొలి గంటల్లో దాదాపు 9 లక్షల మంది వినియోగదారులకు విద్యుత్‌ అంతరాయం ఏర్పడినట్లు అసోసియేటెడ్‌ ప్రెస్‌ నివేదించింది. తుపాను గాలులకు పెన్సకోలాలోని ఓ హోటల్‌ పైకప్పు దెబ్బతింది. పనామా సిటీ బీచ్‌లో ఎత్తైన భవనం దాదాపు కూలిపోయింది. డెస్టిన్‌లో పడవల షెడ్‌ ధ్వంసమైంది. చెట్లు ఇళ్లపై కూలడంతో ప్రాణనష్టం సంభవించింది. పెన్సకోలా విమానాశ్రయం దెబ్బతినడంతో వాణిజ్య విమానాల రాకపోకలను నిలిపివేశారు. అలబామాలో చెట్లు, విద్యుత్‌ లైన్లు రహదారులపై పడటంతో ప్రయాణాలపైనా ఆంక్షలు విధించారు.

గతంలోనూ ఇసాయాస్‌ బీభత్సం.. 
ఇసాయాస్‌ అనే పేరు అమెరికాకు కొత్త కాదు. 2020లోనూ ఇదే పేరుతో వచ్చిన హరికేన్‌ అమెరికా తూర్పు తీరాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. అప్పట్లో అది నార్త్‌ కరోలినా తీరాన్ని గంటకు సుమారు 85 మైళ్ల వేగంతో వీచే గాలులతో తాకింది. ఆ తుపాను కారణంగా అమెరికా వ్యాప్తంగా దాదాపు 30 లక్షల మంది వినియోగదారులు విద్యుత్‌ కోల్పోయారు. 39 టోర్నడోలు ఏర్పడగా, అమెరికా సహా ప్రభావిత ప్రాంతాల్లో పది మృతి చెందారు. నష్టం సుమారు 4.8 బిలియన్‌ డాలర్లుగా అంచనా వేశారు. అయితే, 2020 ఇసాయాస్‌, 2026 ఇసాయాస్‌ వేర్వేరు తుపానులు. అయినప్పటికీ, గత అనుభవాలు తుపాను బలహీనపడిన తర్వాత కూడా విద్యుత్‌ అంతరాయాలు, వరదలు, టోర్నడోలు ఎంతటి నష్టాన్ని కలిగించగలవో గుర్తుచేస్తున్నాయి.

ఇయాన్‌.. కత్రినా.. 
అమెరికా చరిత్రలో అత్యంత భయానక తుపానుల్లో 2022లో వచ్చిన హరికేన్‌ ఇయాన్‌ ఒకటి. అది నాలుగో కేటగిరీ స్థాయిలో ఫ్లోరిడాను తాకి భారీ విధ్వంసం సృష్టించింది. దాని వల్ల జరిగిన నష్టం సుమారు 119.6 బిలియన్‌ డాలర్లుగా అంచనా వేశారు. ఫోర్ట్‌ మైయర్స్‌ బీచ్‌ ప్రాంతంలో సముద్రపు అలల ఉద్ధృతి సుమారు 15 అడుగుల ఎత్తు వరకు చేరింది. ఇక 2005లో వచ్చిన కత్రినా హరికేన్‌ అమెరికా చరిత్రలో అత్యంత వినాశకరమైన తుపానుల్లో ఒకటిగా నిలిచింది. మిసిసిపీ తీరంలో సముద్రపు అలల ఉద్ధృతి సాధారణ అలల స్థాయికి మించి సుమారు 24 అడుగులకు చేరగా, అమెరికాలో నమోదైన అత్యధిక తుపాను అలల ఉద్ధృతి రికార్డుల్లో కత్రినా 25 నుంచి 28 అడుగుల స్థాయితో నిలిచింది.

చమురు ఉత్పత్తికి దెబ్బ.. 
హరికేన్‌ ప్రభావంతో గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికోలో చమురు, సహజ వాయువు ఉత్పత్తి నిలిచిపోయింది. షెల్‌, చెవ్రాన్‌ సంస్థలు తమ ఉత్పత్తి కేంద్రాలకు సిబ్బందిని తిరిగి పంపించే ప్రక్రియను ప్రారంభించినప్పటికీ.. శనివారం నాటికి చమురు ఉత్పత్తిలో సుమారు 69 శాతం, సహజ వాయువు ఉత్పత్తిలో 57 శాతం నిలిచిపోయాయి. ఇంధన సరఫరాలో అంతరాయాన్ని ఎదుర్కొనేందుకు అమెరికా వ్యూహాత్మక చమురు నిల్వల నుంచి గరిష్ఠంగా 40 లక్షల బ్యారెళ్ల ముడిచమురును అత్యవసర మార్పిడి పద్ధతిలో అందించేందుకు ఇంధన శాఖ అనుమతించింది. 

ఇదీ చదవండి: పెను సంక్షోభం దిశగా ప్రపంచం.. భారత్‌కూ తప్పని సెగ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement