Trump: సాయం కోసం ఇంత ఏడుపులు దేనికి? | Trump Rule: Did World Really Need Americas Foreign Aid | Sakshi
Sakshi News home page

Trump: సాయం కోసం ఇంత ఏడుపులు దేనికి?

Jan 30 2025 5:29 PM | Updated on Jan 30 2025 6:05 PM

Trump Rule: Did World Really Need Americas Foreign Aid

‘‘అది మీ ప్రభుత్వం కాదు. మీ దేశం అంతకన్నా కాదు. మీరేం అక్కడ పన్నులూ కట్టడం లేదు. ఏదైనా సాయం అందించడానికి వాళ్లకు కారణాలు అక్కర్లేదు కదా. అలాంటప్పుడు ఈ ఏడుపులు దేనికి? ముమ్మాటికీ ఇది మనకు ఓ మేలుకొలుపే..’’ అని ఓ సదస్సులో ఆఫ్రికా దేశాలను ఉద్దేశించి కెన్యా మాజీ అధ్యక్షుడు ఉహురు కెన్యట్టా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న ఫెడరల్‌ గ్రాంట్లు, రుణాల నిలిపివేత నిర్ణయమే ఆయన అలా మాట్లాడటానికి కారణం. సాయాన్ని నిలిపివేస్తానని ట్రంప్‌ ప్రకటించడంతో ప్రపంచమంతా ఆగమాగమైంది. పలువురు దేశాధినేతలు ట్రంప్‌ను బహిరంగంగానే తిట్టిపోశారు. మరీ ముఖ్యంగా అగ్రరాజ్యం ఇచ్చే సాయం మీద ఆధారపడి బతుకుతున్న చిన్న దేశాల తీవ్ర ఆందోళనకు గురయ్యాయి.

అమెరికా నుంచి వెళ్తున్న అన్ని గ్రాంట్లపై సమీక్ష జరపాలని ట్రంప్‌ ప్రభుత్వం భావించింది. దీంతో ఈజిప్ట్‌, ఇజ్రాయెల్‌ మిలిటరీ ఎయిడ్‌ మినహా అమెరికా అందిస్తున్న అన్ని సాయాలు  ఆపేద్దామనుకుంది. ఈ విధానం అమెరికాకు ప్రయోజకారిగా లేకపోగా.. విలువలకు విరుద్ధంగా ఉందని ట్రంప్‌ ఈ ఆదేశాలను జారీ చేశారు. అందుకే మూడు నెలలపాటు వాటిని సమీక్షించాలనుకున్నారు. ఈజిప్ట్‌, ఇజ్రాయెల్‌ మిలిటరీ ఎయిడ్‌కు మాత్రం మినహాయింపు ఇచ్చారు. అయితే ఈ నిర్ణయం వెలువడిన కాసేపటికే.. మ్యాటర్‌ కోర్టు గడప తొక్కింది. దీంతో విచారణ వేళ ఆ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది. అయితే కెన్యా మాజీ అధ్యక్షుడు చెబుతున్నట్లు అమెరికా సాయం నిజంగా ఈ ప్రపంచానికి అవసరమా?.

కిందటి ఏడాది అమెరికా నుంచి వివిధ దేశాలకు వెళ్లిన సాయం పరిశీలిస్తే.. 

  • ఉక్రెయిన్‌కు 16.5 బిలియన్ల డాలర్ల సాయానికిగానూ.. 16.2 బిలియన్‌ డాలర్లు పంపిణీ చేసింది.

  • ఇథియోపియాకు 1.6 బిలియన్‌ డాలర్ల సాయం ప్రకటించి.. 2 బిలియన్‌ డాలర్లు పంపిణీ చేసింది.

  • జోర్దాన్‌కు 1.2 బిలియన్‌ డాలర్ల సాయం ప్రకటించి.. అందజేసింది.

  • డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో.. 1 బిలియన్‌ డాలర్‌ సాయం ప్రకటించి, 982 మిలియన్‌ డాలర్లు ఇచ్చింది

  • సోమాలియాకు 1 బిలియన్‌ డాలర్ల సాయం ప్రకటించి, 1.1 బిలియన్‌ డాలర్లను పంపిణీ చేసింది

  • యెమెన్‌కు 939 మిలియన్‌ డాలర్ల సాయం ప్రకటించి.. 1.1 బిలియన్‌ డాలర్లు అందజేసింది.

  • నైజీరియాకు 904 మిలియన్‌ డాలర్ల సాయం ప్రకటించి.. 886 మిలియన్‌ డాలర్లు ఇచ్చింది

  • అఫ్గనిస్థాన్‌కు 815 మిలియన్‌ డాలర్ల సాయానికిగానూ.. 1.2 బిలియన్‌ డాలర్ల సాయం అందజేసింది

  • దక్షిణ సూడాన్‌కు 794 మిలియన్‌ డాలర్ల సాయానికిగానూ 891 మిలియన్‌ డాలర్లు అందజేసింది

  • సిరియాకు 748 మిలియన్‌ డాలర్లకుగానూ.. 894 మిలియన్‌ డాలర్ల సాయం అందించింది

మానవతా కోణంలో సాయం అందించడం, ఆయా దేశాల అభివృద్ధిలో భాగంగా అమెరికా ఈ సాయం అందించింది. అయితే అమెరికాతో పాటు వివిధ దేశాలకు ఎంత గ్రాంట్లు కేటాయించాలన్నది మాత్రం అక్కడి చట్ట సభలే నిర్ణయిస్తాయి. ఈ అమెరికాకు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చని ఈ పద్ధతి మారాలని ట్రంప్‌ అనుకుంటున్నారు.

ట్రంప్‌ నిర్ణయంతో విదేశాలకు, స్వచ్ఛంద సంస్థలకు చేసే ఆర్థిక సాయం ఆగిపోవడంతోపాటు విద్య, ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు, నిర్మాణ, విపత్తు నిర్వహణ కార్యక్రమాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఆహారం, ఆశ్రయం, వైద్య సేవల్లాంటి మానవతా సాయం ఆగిపోతుంది. ఇది నేరుగా ఉద్యోగాల తొలగింపు.. అవసరమైతే ఆ వ్యవస్థల రద్దుకు దారి తీయొచ్చు. పౌష్టికాహార లోపం, రకరకాల జబ్బుల.. వైరస్‌లతో బాధపడుతున్న ఆఫ్రికన్‌ దేశాలకు ఇది ముప్పుగా మారచ్చు. మరికొన్ని దేశాల్లో సంక్షోభాలు ముదిరేలా చేయొచ్చు. అయితే సామాజిక భద్రత, మెడికేర్‌ చెల్లింపులు, వ్యక్తులకు నేరుగా అందించే ఆర్థికసాయంపై ప్రభావం చూపదని వైట్‌హౌస్‌ వర్గాలు చెబుతున్నా.. ఎక్కడా రాతపూర్వకంగా ఆ విషయాన్ని ప్రస్తావించకపోవడం గమనార్హం. 

అమెరికాలోనే మాత్రం కాదు.. ఆ దేశం నుంచి సాయం పొందుతున్న దేశాలకూ వర్తించనుంది. ఆర్థికంగా, సామాజికంగా ఆ దేశాలు సవాళ్లను ఎదుర్కొనే అవకాశాలు ఎదురుకానున్నాయి. అందుకే ఐక్యరాజ్య సమితి సహా ప్రపంచ దేశాలు.. ప్రత్యేకించి ఆఫ్రికన్‌ దేశాలు ట్రంప్‌ నిర్ణయాన్ని తప్పుబడుతున్నాయి.

నిజంగా అమెరికా ఈ సాయం చేయడం అవసరమా? అంటే.. లేదు. కానీ, ఈ తరహా సాయంతో అమెరికాకు ఎంతో మేలు చేకూరుతుంది. దౌత్యపరమైన సంబంధాలు మెరుగుపర్చుకోవడం, వ్యాపార రంగంలో కీలక ఒప్పందాలు, అంతర్యుద్ధాలు-సంక్షోభాల నివారణ.. ఉగ్రవాద అంతం.. తద్వారా ఆ దేశాల్లో జాతీయ భద్రతను పెంపొందించడం ద్వారా మిత్రపక్షాలుగా మార్చుకోవడం, జబ్బుల నివారణకు మానవతా కోణంలో సాయం.. అందుకోసం పరిశోధనలకు భారీగా నిధులు వెచ్చించడం, ఇలా ఇతరత్రా సాయాలతో ప్రపంచదేశాలకు పెద్దన్నగా వ్యవహరిస్తూ వస్తోంది అమెరికా. 

అయితే.. ప్రపంచవ్యాప్తంగా వైద్య సాయాన్ని కూడా నిలిపివేయాలనుకున్న ట్రంప్‌  నిర్ణయం.. తూర్పు ఆఫ్రికా దేశాల  ఐకమత్యానికి, పరస్పర సాయానికి ఓ పిలుపులాంటిదని ఉహురు కెన్యట్టా అభిప్రాయపడ్డారు. అమెరికాను, ట్రంప్‌ను విమర్శించడం కన్నా స్వీయ సమీక్ష చేసుకోవాలని నేతలకు పిలుపు ఇచ్చారు.  ఇతరుల సాయంపై ఆధారపడే బదులు.. ఉన్న వనరులతోనే ఇక్కడి దేశాలు ఒకరికొకరు సాయం చేసుకోవడం, తద్వారా ఆర్థిక పురోగతికి దోహదపడడం ఏనాటికైనా మంచిదని అంటున్నారాయన. 

మానవతా సాయం విషయంలో భారత్‌ కూడా ఏం తీసిపోలేదు. 2021-2022లో 2.1 బిలియన్‌ డాలర్ల(రూ.18,154 కోట్లు) సాయాన్ని పొరుగుదేశాలైన భూటాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక, అప్ఘనిస్థాన్‌ల అభివృద్ధికి భారత్‌ అందజేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement