ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డ రష్యా | Massive strikes hit Kyiv hours after Putin agrees to fresh peace talks | Sakshi
Sakshi News home page

ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డ రష్యా

Oct 23 2026 3:40 AM | Updated on Oct 23 2026 3:40 AM

Massive strikes hit Kyiv hours after Putin agrees to fresh peace talks

త్రైపాక్షిక చర్చలకు ఓకే అంటూనే దాడులు 

808 ఉక్రెయిన్‌ డ్రోన్లు అడ్డుకున్నామన్న రష్యా 

రష్యా వైఖరి మారలేదన్న జెలెన్‌స్కీ

కీవ్‌: రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధానికి తెరపడుతుందన్న ఆశలు మరోసారి నీరుగారిపోయాయి. యుద్ధ విరమణకు సంబంధించి త్రైపాక్షిక చర్చలకు ఒకే అని ప్రకటించి కొన్ని గంటలు కూడా కాకుండానే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై క్షిపణులతో విరుచుకుపడ్డారు. కొన్ని గంటలపాటు జరిగిన ఈ దాడులతో కీవ్‌ నగరం తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలస్తోంది. మరోవైపు ఉక్రెయిన్‌ ప్రయోగించిన దాదాపు 808 డ్రోన్లను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నాయని రష్యా గురువారం ప్రకటించింది. రష్యా దాడుల్లో ఇద్దరు మరణించినట్లు, పలువురు గాయపడినట్లు ఉక్రెయిన్‌ తెలిపింది. 
 
రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య సుమారు ఐదేళ్లుగా తీవ్రస్థాయి యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ యుద్ధాన్ని నిలిపివేసేందుకు ఇటీవలి కాలంలో అమెరికా చొరవ తీసుకుంటోంది. ట్రంప్‌ తరఫున దౌత్యవేత్త స్టీవ్‌ విట్‌కాఫ్‌ బుధవారమే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో సెయింట్‌ పీటర్స్‌బెర్గ్‌లో విస్తృత చర్చలు కూడా జరిపారు. అంతకుముందు నార్వేలోని ఓస్లోలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతోనూ విట్‌కాఫ్‌ సమావేశమై యుద్ధ విరమణకు సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించారు.

 ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిల్లో అమెరికా, రష్యా, ఉక్రెయిన్‌లు అబూదాబీ, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరైట్స్‌లలో రెండుసార్లు, జెనీవాలో ఫిబ్రవరిలోనే మరోసారి యుద్ధ విరమణపై చర్చలు జరిపాయి. అయితే వీటిల్లో చెప్పుకోదగ్గ పురోగతి ఏదీ కనిపించలేదు. ఖైదీల మారి్పడికి మాత్రం అంగీకారం కుదిరింది. భీకరమైన దాడులు కొనసాగాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం పుతిన్‌ త్రైపాక్షిక చర్చలకు సూత్రప్రాయంగా అంగీకరించడం, ఆ వెంటనే ఉక్రెయిన్‌పై దాడులకు దిగడానికి ప్రాధాన్యం ఏర్పడింది. 

ఇదిలా ఉంటే ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వాదన మరోలా ఉంది. ఇరుదేశాల నేతలు ముఖాముఖి చర్చలు జరిపితేనే శాంతికి ఆస్కారముంటుందని, దౌత్యబృందాల చర్చలు సాంకేతిక అంశాలకు మాత్రమే పరిమితమని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాకుండా.. రష్యా వైఖరిలో మార్పేమీ లేదన్నది బుధవారం రాత్రి ఉక్రెయిన్‌లోని పన్నెండు ప్రాంతాలపై జరిగిన క్షిపణి దాడులు స్పష్టం చేస్తున్నాయని ఆయన అంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఆయన ఒక పోస్టు చేస్తూ రష్యా క్షిపణి దాడుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని, ఐదుగురు పిల్లలతోపాటు 34 మంది గాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

 బుధవారం రాత్రి మూడు దశల్లో జరిగిన 21 క్షిపణుల దాడులతో కీవ్‌ నగరం మొత్తం భీకర శబ్దాలతో నిండిపోయిందని, భవనాలు, విద్యుచ్ఛక్తి వ్యవస్థలు దెబ్బతిన్నాయని వివరించారు. కీవ్‌లో ఒకరు, ఖార్కివ్‌ పరిసర ప్రాంతాల్లో మరొకరు మరణించినట్లు తెలిపారు. రష్యా దాడులను ఎదుర్కొనేందుకు మరిన్ని పాట్రియట్‌ ఆయుధ వ్యవస్థలు పంపించాలని, రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించాలని జెలెన్‌స్కీ అమెరికాను ఇప్పటికే పలుమార్లు కోరిన విషయం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవలి కాలంలో ఉక్రెయిన్‌కు దూరంగా, రష్యాకు దగ్గరగా మారిపోతున్నారు. ఆంక్షలపై తాత్కాలిక నిషేధం విధించి రష్యా డీజిల్‌ కొనుగోలుకు సై అనడం ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య శాంతి అన్నది ఎప్పటికి సాధ్యమవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement