విధ్వంసకర క్లస్టర్‌ బాంబు | Iran uses cluster bombs in missile strikes | Sakshi
Sakshi News home page

విధ్వంసకర క్లస్టర్‌ బాంబు

Jun 21 2025 4:45 AM | Updated on Jun 21 2025 4:45 AM

Iran uses cluster bombs in missile strikes

యుద్ధం మొదలైనప్పటి నుంచి తమపై క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించి విధ్వంసం సృష్టించిన ఇరాన్‌ ఇప్పుడు ఏకంగా క్లస్టర్‌ బాంబులను ప్రయోగిస్తూ దారుణాలకు ఒడిగడుతోందని ఇజ్రాయెల్‌ ఆరోపించింది. ఎన్నో దేశాలు నిషేధం విధించిన క్లస్టర్‌ బాంబులను ఇరాన్‌ ఉద్దేశపూర్వకంగా భారీ పౌరనష్టం జరగాలని తమపై ప్రయోగిస్తోందని ఇజ్రాయెల్‌ శుక్రవారం ప్రకటించింది. గత వారం రోజులుగా కొనసాగుతున్న సమరంలో ఇరాన్‌ క్లస్టర్‌ బాంబులను వినియోగించడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. దీంతో డజన్లకొద్దీ దేశాల నుంచి నిషేధాన్ని ఎదు ర్కొంటున్న క్లస్టర్‌ బాంబులపై చర్చ మొదలైంది. 

ప్రత్యేకతలేంటి?
ఏదైనా బాంబును జారవిడిస్తే అది ఒకేసారి పూర్తిగా పేలిపోతుంది. మొత్తం మందుగుండు అయిపోతుంది. కానీ క్లస్టర్‌ బాంబు అలా కాదు. అందులో గోళాకృతిలో చిన్న చిన్న బాంబులుంటాయి. వాటిని మోస్తున్న కస్టర్‌ బాంబు వార్‌హెడ్‌ను ప్రయో గించాక లక్ష్యాన్ని ఢీకొట్టడానికి కొంతదూరంలో అంటే గాల్లోనే అది పేలిపోతుంది. దాంతో అందులోని గోళాకార చిన్నపా టి బాంబులన్నీ చెల్లాచెదురు గా నలుదిక్కులా పడి పేలిపో తాయి. దీంతో వినాశనం విస్తృతస్థాయిలో ఉంటుంది. జన సమూహంపై ఈ బాంబు పడితే ఈ చిన్న బాంబులు సృష్టించే విధ్వంసం అంతాఇంతా కాదు. 

ఇష్టమొచ్చినట్లు అన్ని వైపులకు దూసుకెళ్లడంతో నలుచెరుగులా ఉన్న వారంతా తీవ్రస్థాయిలో లేదా మధ్యస్థాయిలో గాయపడటం ఖాయం. ఇంతటి ప్రమాదకర బాంబు కావడంతోనే చాలా దేశాలు ఈ క్లస్టర్‌ బాంబు వినియోగానికి దూరంగా ఉండిపోయాయి. ఇంట్లో కొంత ఎత్తు నుంచి ఒక గాజుముక్కను నేలపై పడేస్తే అది ముక్కలుచెక్కలై ఎలాగైతే గది మొత్తం పరుచుకుంటుందో ఈ క్లస్టర్‌ బాంబులోని పేలని ముక్కలు పరిసరాల్లోకి దూసు కెళ్లి దారుణ నష్టానికి కారణమవుతాయి. 

శుక్రవారం ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ ప్రయోగించిన ఒక క్లస్టర్‌ బాంబు ఆకాశంలో ఏడు కిలోమీటర్ల ఎత్తులో పేలిపోయి పెద్దసంఖ్యలో చిన్నబాంబులుగా మారి 8 కిలో మీటర్ల పరిధిలో వేర్వేరుచోట్ల బద్ధలయ్యాయి. బా లిస్టిక్‌ క్షిపణితో పోలిస్తే ఈ బాంబు తీవ్రత ఎక్కువ గా ఉంటుందని ఇజ్రాయెల్‌ సైనికాధికారిది టైమ్స్‌ ఆఫ్‌ ఇజ్రాయెల్‌’ వార్తాసంస్థతో చెప్పారు.

పొంచి ఉన్న మరో ప్రమాదం
క్లస్టర్‌ బాంబు పేలాక అంతటా పడిపోయే చిన్న బాంబులు అన్నీ అదే సమయంలో పేలకపోవచ్చు. పేలని ఆ కొన్నింటిని నిర్వీర్యమైనట్లు భావించకూడదు. అవి కొంతకాలం తర్వాత పేలుతాయి. అంటే యుద్ధక్షేత్రంలో ఈ క్లస్టర్‌ బాంబును ప్రయోగిస్తే ఆ తర్వాతకూడా అక్కడికి జవాన్లు వెళ్లాలంటే జంకాల్సిందే. ఎక్కడ పడిన బాంబు ఎప్పుడు పేలుతుందో ఎవరూ ఊహించలేరు. 2008లో వందకుపైగా దేశాలు ఐక్యరాజ్యసమితి సారథ్యంలో ఈ బాంబు వినియోగంపై నిషేధాన్ని అమల్లోకి తెచ్చాయి. 

111 దేశాలు, 12 ఇతర సంస్థలు ఈ ఒప్పందంపై సంతకాలుచేశాయి. క్లస్టర్‌ బాంబుల ఉత్పత్తి, నిల్వ, రవాణా, వినియోగంపై నిషేధం విధించారు. అయితే ఆనాడు ఇరాన్, ఇజ్రాయెల్, రష్యా, ఉక్రెయిన్, అమెరికా ఈ ఒడంబడికకు కట్టుబడతామని ప్రకటించలేదు. ఈ లెక్కన అమెరికా సైతం ఇరాన్‌–ఇజ్రాయెల్‌ యుద్ధంలో దిగితే ఈ బాంబులను ఉపయోగించే వీలుంది. లేదంటే పరోక్షంగా ఇజ్రాయెల్‌కు సరఫరా చేసే అవకాశముంది. 

చాన్నాళ్ల క్రితం సిరియాను ఏలిన బషర్‌ అల్‌ అసద్‌ ప్రభుత్వం సైతం తాము అంటే గిట్టనివారిపై వీటిని విపరీతంగా వాడిందని ఆరోపణలున్నాయి. అఫ్గాన్‌లో అమెరికా సైతం ఇదే బాటలో పయనించిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. 2006 లెబనాన్‌ యుద్ధంలో ఇజ్రాయెల్‌ ఏకంగా 40 లక్షల క్లస్టర్‌ బాంబులను ప్రయోగించిందని ఐక్యరాజ్యసమితి గతంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. 19 ఏళ్ల క్రితం ప్రయోగించిన క్లస్టర్‌ బాంబుల్లో కొన్ని ఇప్పటికీ పేలుతూ లెబనాన్‌ పౌరుల ప్రాణాలు హరిస్తున్నాయని స్థానిక మీడియా గతంలో ఆరోపించింది.

రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధంలోనూ...
ఆనాడు ఒప్పందంలో భాగస్వామిగా లేని రష్యా నెలలతరబడి కొనసాగుతున్న ఉక్రెయిన్‌ యుద్ధంలో దానిపై విచ్చలవిడిగా వాడుతోందని తెలుస్తోంది. దీంతో రష్యాతో పోరాటంచేస్తున్న ఉక్రెయిన్‌కు తమ వద్ద పేరుకుపోయిన లక్షలాది క్లస్టర్‌ బాంబులను సరఫరాచేయాలని అమెరికా భావిస్తోంది. సమరసమయంలో పేలితే అది యుద్ధనీతిగా భావించవచ్చు. కానీ యుద్ధం ముగిశాక కూడా పేలుతూ ఇవి ఒకరకంగా పౌరహక్కులను కాలరాస్తున్నా యని మానవహక్కుల సంఘాలు సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement