ట్రంప్‌ సంచలన నిర్ణయం.. లక్షలాది మందికి మరణశాసనం | Donlad Trump administration food aid cuts millions at risk | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ సంచలన నిర్ణయం.. లక్షలాది మందికి మరణశాసనం

Apr 9 2025 7:11 AM | Updated on Apr 9 2025 8:51 AM

Donlad Trump administration food aid cuts millions at risk

రోమ్‌: లక్షలాది మందికి ఆహార సాయాన్ని నిలిపేస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రాం (డబ్ల్యూఎఫ్‌పీ) తీవ్రంగా తప్పుబట్టింది. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆకలితో అలమటిస్తున్న లక్షలాది మంది పాలిన మరణశాసనంగా అభివర్ణించింది. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సోమవారం విజ్ఞప్తి చేసింది. ప్రాణాలను కాపాడే కార్యక్రమాలకు నిరంతరం మద్దతివ్వాలని కోరేందుకు ట్రంప్‌ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు వెల్లడించింది.

అఫ్గానిస్తాన్, సిరియా, యెమన్, మరో 11 పేద దేశాల్లో లక్షలాది మంది అన్నార్తులకు సాయపడే యూఎస్‌ వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రాం అత్యవసర కార్యక్రమాలకు ట్రంప్‌ ప్రభుత్వం నిధులను నిలిపేయడం తెలిసిందే. ఎలాన్‌ మస్క్‌ డోజ్‌లో టాప్‌ లెఫ్టినెంట్‌ జెరెమీ లెవిన్‌ ఆదేశాల మేరకు వాటికి నిధుల కేటాయింపును రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. అత్యవసర ఆహార కార్యక్రమాలకు సాయాన్ని కోతల నుంచి మినహాయిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఇతర ఉన్నతాధికారులు హామీ ఇచ్చినా లాభం లేకపోయింది.

ట్రంప్‌ టార్గెట్‌ చేసిన కార్యక్రమాలు 
13 ఏళ్ల అంతర్యుద్ధం, ఇస్లామిక్‌ స్టేట్‌ గ్రూపు తిరుగుబాటు తర్వాత సిరియా పేదరికం, ఆకలి, అభద్రతతో సతమతమవుతోంది. ఆ దేశానికి తాజాగా 23 కోట్ల డాలర్ల ఒప్పందాలను అమెరికా రద్దు చేసింది. ఇక ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన మానవీయ విపత్తును ఎదుర్కొంటున్న యెమన్‌లో డబ్ల్యూఎఫ్‌పీ ఆహార కార్యక్రమాలకు సాయం నిలిపేసింది. సిరియా శరణార్థులు తీవ్రంగా ప్రభావితమయ్యే లెబనాన్, జోర్డాన్లలో కార్యక్రమాలూ పడకేశాయి.

సోమాలియా, అఫ్గాన్, జింబాబ్వేల్లో యుద్ధాలతో నిరాశ్రయులైన వారికి జలకు ఆహారం, నీరు, వైద్య సంరక్షణ, ఆశ్రయం వంటి కార్యక్రమాలు కూడా ప్రభావితమయ్యాయి. అఫ్గాన్‌కు మానవతా సహాయంలో అమెరికా 56 కోట్ల డాలర్లు కోత పెట్టింది. తాలిబన్‌ ఆంక్షల వల్ల విదేశాల్లో చదువుతున్న అఫ్గాన్‌ యువతులకు అందించే సాయాన్ని శుక్రవారం నిలిపేసింది. అమెరికా కోతలతో ప్రపంచవ్యాప్తంగా ఇలా సుమారు 1,000కి పైగా కార్యక్రమాలు నిలిచిపోయాయి. 5,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించారు. డబ్ల్యూఎఫ్‌పీకి గతేడాది అందిన 980 కోట్ల డాలర్ల విరాళాల్లో 450 కోట్లు అమెరికా ఇచ్చినవే!   

వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ​్‌(డబ్ల్యూఎఫ్‌పీ) 2025 లెక్కల ప్రకారం పలు దేశాల సాయం ఇలా ఉంది. అమెరికా.. మూడు బిలియన్ డాలర్లు కాగా, జర్మనీ.. ఒక్క బిలియన్‌ డాలర్లు. యూకే, యూరోపియన్‌ కమిషన్‌, ప్రైవేటు డోనార్స్‌ ఉన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement