గెలుపోటములపై సమీక్ష | Sakshi
Sakshi News home page

గెలుపోటములపై సమీక్ష

Published Mon, Nov 20 2023 4:32 AM

- - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: నవంబర్‌ 30 తరుముకొస్తోంది. ఎన్నికల ప్రచారానికి ఇక మిగిలింది ఎనిమిది రోజులే. ఇంచుమించు ఈ వారంలోనే ఓటర్లకు మరింత చేరువ కావాలి. ఇప్పటి వరకు ఏ ఓటరు ఏ పార్టీకి జై కొడతాడో తెలియని పరిస్థితి. డబ్బులు, మద్యం, కానుకలు పంపిణీ చేసినా చివరి నిమిషంలో ఓటరు మహాశయుడు ఏ గుర్తుపై మీట నొక్కుతాడో తెలియదు. బరిలో నిలిచిన నేతలు రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇరవై నాలుగు గంటల పాటు వెంట నడిచే అనుచరులు, కార్యకర్తలు, నాయకుల బలాన్ని చూస్తే గెలిచి తీరుతామనే భరోసా కలుగుతోంది. కానీ అంతిమంగా తీర్పు చెప్పాల్సిన ఓటరు మదిలో ఏముందో తెలియదు. ఇదీ కొద్ది రోజులుగా అభ్యర్థులు పడుతున్న అంతర్మథనం. గెలుపోటములపై అన్ని పార్టీల్లో సమీక్షలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు ప్రచారం నిర్వహించిన తీరు, రానున్న వారం రోజుల పాటు చేపట్టాల్సిన ప్రచారం వంటి అంశాలపై నాయకులు దృష్టి సారించారు. నవంబర్‌ 30న జరగనున్న ఎన్నికలకు గడువు సమీపిస్తున్న దృష్ట్యా అన్ని పార్టీల అభ్యర్థుల పోల్‌ మేనేజ్‌మెంట్‌పై ఆశలు పెట్టుకున్నాయి. సాధారణంగా ఎన్నికల ప్రకటన విడుదలైనప్పటి నుంచి అన్ని పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తాయి. విస్తృతంగా సభలు, సమావేశాలు నిర్వహిస్తాయి. ఈసారి ప్రచార కార్యక్రమాలకు తోడు సోషల్‌ మీడియాపై ప్రధానంగా దృష్టి సారించారు. ముఖ్యంగా ఎక్కడికక్కడ వాట్సప్‌ గ్రూపులను ఏర్పాటు చేసి ఓటు బ్యాంకులను సుస్థిరం చేసుకొనేందుకు చర్యలు చేపట్టారు. ఈ వాట్సప్‌ గ్రూపులు ఈసారి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వనున్నాయనేది డిసెంబర్‌ 3న తేలనుంది.

పోల్‌ మేనేజ్‌మెంట్‌పైన గురి..

● నియోజకవర్గాలు, డివిజన్‌ల స్థాయిలో ఎన్నికల ప్రచారం ఒక స్థాయికి చేరడంతో ప్రస్తుతం పోల్‌ ‘మేనేజ్‌మెంట్‌’ కోసం అభ్యర్థులు కసరత్తు చేపట్టారు. ఇప్పటికే అన్ని చోట్ల తాయిలాల పంపిణీ మొదలుపెట్టారు. ప్రలోభాలను మరింత ఉద్ధృతం చేసి ఓటర్ల నుంచి గట్టి హామీ పొందేందుకు పోల్‌ మేనేజ్‌మెంట్‌ చేపట్టారు. కాలనీలు, బస్తీలు, అపార్ట్‌మెంట్‌ల వారీగా ఓటర్ల సంఖ్యను లెక్కలు వేసి ఏ ఓటరును ఎలా తమ వైపు తిప్పుకోవాలనే దిశగా పోల్‌ మేనేజ్‌మెంట్‌ సాగుతోంది. కొన్ని చోట్ల మహిళలను ఆకట్టుకొనేందుకు కానుకలను సమర్పిస్తుండగా.. మరికొన్ని కొన్ని చోట్ల మద్యం, డబ్బుల పంపిణీ జోరుగా సాగుతోంది.

● ‘ప్రచార రథాలు ఏర్పాటు చేసుకొని, కండువాలు కప్పుకొని, జెండాలు ఎగరరేసి ఎంత ఉద్ధృతంగా ప్రచారం చేసినా అంతిమంగా తేలాల్సింది ఓటరు దగ్గరే. ఏ ఓటరు ఎటు వైపు ఆలోచిస్తున్నాడనే అంశం ఆధారంగానే పోల్‌ మేనేజ్‌మెంట్‌ ఉంటుంది’ అని ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు ఒకరు అభిప్రాయపడ్డారు. తటస్థులను, విపక్షాలకు దగ్గరయ్యే వారిని తమవైపు తిప్పుకొనేందుకు ఇది ఎంతో కీలకమని చెప్పారు. ప్రతి అభ్యర్థీ తన నియోజకవర్గంలో ఉన్న మొత్తం ఓట్లలో కాలనీలు, బస్తీలవారీగా తమకు పట్టున్న ప్రాంతాలను, ఎక్కువ ఓట్లు పడేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలను అంచనా వేస్తున్నారు.బాగా ఆదరణ, పట్టున్న ప్రాంతాలపైనే ఎక్కువ దృష్టి సారించి ప్రచారం కొనసాగిస్తున్నారు.

గుంభనంగా ఓటర్లు..

ఒకవైపు రాజకీయ పార్టీల ప్రచారం, అభ్యర్థుల అంతర్మథనం, గెలుపు ఓటములపై అంచనాల తీరు ఇలా ఉంటే.. ఓటర్లు మాత్రం గుంభనంగా ఉన్నారు. అన్నిచోట్ల ఎన్నికలే ప్రధానంగా చర్చలు జరుగుతున్నాయి. ఏ నలుగురు కలిసినా పార్టీల ప్రచారం పై, అభ్యర్ధుల వ్యక్తిత్వాలపై మాట్లాడుకుంటున్నారు. కానీ ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతున్నారనే అంశం మాత్రం ఇంకా అస్పష్టంగానే ఉంది. ఎన్నికలకు ఇంకా కొన్ని రోజులు మిగిలి ఉండడంతో ఓటర్లు పార్టీల ప్రచారం పైన తామరాకుమీద నీటి బొట్టులా పారదర్శకంగానే స్పందిస్తున్నారు. బాహాటంగా అభిప్రాయాలను వెల్లడించేందుకు వెనకడుగు వేస్తున్నారు. మరోవైపు మరో నాలుగు రోజులు గడిస్తే తప్ప ఓటర్ల నాడి పట్టుకోవడం సాధ్యం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు.

తరుముకొస్తున్న నవంబర్‌ 30

ఓటరు నాడిపై తంటాలు

పోల్‌ మేనేజ్‌మెంట్‌పైనే ఆశలు

వచ్చే వారం రోజులూ ఉత్కంఠే

Advertisement

తప్పక చదవండి

Advertisement