ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ | Sakshi
Sakshi News home page

ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌

Published Tue, Nov 21 2023 1:44 AM

మాట్లాడుతున్న కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌  - Sakshi

హనుమకొండ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

హన్మకొండ అర్బన్‌: ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటుహక్కును వినియోగించుకోవాలని హనుమకొండ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు. సోమవారం నగరంలోని ఆర్డీఓ కార్యాలయంలో జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ విధానాన్ని, వాటి పూర్తి వివరాలను ఆర్డీఓ రమేశ్‌ను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద సీసీ కెమెరాల నిఽఘా, లైవ్‌ వెబ్‌ టెలికాస్ట్‌ అయ్యేలా ఏర్పాట్లు చేయాలని సూ చించారు. సమావేశంలో డీఆర్డీఓ శ్రీనివాస్‌కుమార్‌, కాజీపేట తహసీల్దార్‌ బావుసింగ్‌ పాల్గొన్నారు.

హోం ఓటింగ్‌కు ఏర్పాట్లు

ఈనెల 21, 22, 23 తేదీల్లో ఫారం–12 (డి) ద్వారా దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులు, 80 ఏళ్ల వయస్సుపై బడిన వృద్ధులకు హోం ఓటింగ్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హోం ఓటింగ్‌కు వరంగల్‌ పశ్చిమలో 363, పరకాలలో 302 ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ఓటింగ్‌ ప్రక్రియంతా ఈసీ సూచనల మేరకు వీడియో తీస్తున్నట్లు తెలిపారు. ఓటర్ల తమ ఓటును రహస్యంగా వేయాల్సి ఉంటుందన్నారు. ఇందుకు వరంగల్‌ పశ్చిమలో 11, పరకాలలో 6 బృందాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. కాగా.. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి సీడీసీలో రెండు ఫెసిలిటేషన్‌ సెంటర్లు, పరకాల నియోజకవర్గానికి సంబంధించి పరకాల పాలిటెక్నిక్‌ కాలేజీలో రెండు ఫెసిలిటేషన్‌ సెంటర్లలో ఓటు వేసుకునే ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ తెలిపారు.

Advertisement
Advertisement