ఎంపవర్మెంట్
కొన్ని నెలల క్రితం... కనీస సౌకర్యాలు లేని దక్షిణ కశ్మీర్‌లోని మారుమూల గ్రామంలో క్రికెట్ ఆడుతున్న బాలిక ఫొటో వైరల్ అయింది. ఆ పాపకు ఎలాంటి కోచింగ్ లేదు. సరిౖయెన బ్యాట్ కూడా లేదు. అయితే గట్టి కల మాత్రం ఉంది. ‘నేను స్మృతి మంధాన అవుతాను’ అనేది ఆ కల. ‘చిట్టితల్లీ... నీకు నేను అండగా ఉంటాను’ అని ప్రకటించింది స్మృతి మంధాన. యునిసెఫ్ గర్ల్స్ ఎంపవర్మెంట్ అడ్వకేట్‌గా లక్షలాది మంది చిన్నారులకు స్మృతి అండగా నిలవాల్సిన టైమ్ వచ్చేసింది. బాలికలకు సమాన అవకాశాలు, ఆరోగ్యం, శ్రేయస్సుకు సంబంధించి సెలబ్రిటీ అడ్వకేట్‌గా భారత మహిళా క్రికెట్ జట్టు కొత్త కెప్టెన్ స్మృతి మంధానను యూనిసెఫ్ నియమించింది...
బాలికలకు సాధికారత కల్పించడం, ఆరోగ్యం, శ్రేయస్సును మెరుగుపరచడం, నాయకత్వ స్థానాలలోకి ఎదగడంలో సహాయపడడం... మొదలైన వాటికి సంబంధించి యూనిసెఫ్ ఇండియా కృషికి స్మృతి మంధాన తన వంతు సహకారం అందించనుంది.
ప్రతి కల... ఒక అవకాశంతోనే...
‘యునిసెఫ్ ఇండియాలో సెలబ్రిటీ అడ్వకేట్‌గా చేరడం నాకు ఎంతో గౌరవంగా ఉంది. ప్రతి కల ఒక అవకాశంతోనే మొదలవుతుంది. క్రికెట్ ఆడుతూ పెరగడం వల్ల ఈ విషయాన్ని తెలుసుకోగలిగాను. కృషి, పట్టుదల, ప్రోత్సాహం తోడైతే వచ్చిన అవకాశం అద్భుతమైన ఫలితంగా మారుతుంది. ప్రతి బిడ్డకు కలలు కనే అవకాశం రావాలి. పూర్తి ఫలితాన్ని అందుకునే అవకాశం దక్కాలి’ అంటుంది స్మృతి మంధాన.
స్వాగతం... సుస్వాగతం...
యూనిసెఫ్‌కు దక్షిణాసియా ప్రాంతీయ రాయబారి గా ఆ సంస్థతో దీర్ఘకాల అనుబంధం ఉన్న క్రికెట్ ఐకాన్ సచిన్ టెండుల్కర్ ఆమె నియామకం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ.. ‘యునిసెఫ్ ఇండియా కుటుంబంలోకి స్వాగతం పలుకుతున్నాను. మీరు మైదానంలో లక్షలాది మందికి స్ఫూర్తిని ఇచ్చారు. మైదానం బయట బాలల హక్కుల కోసం అద్భుత గళంగా నిలుస్తారని నాకు తెలుసు’ అని ట్వీట్ చేశారు.
‘యూనిసెఫ్ ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్‌గా స్మృతి మంధానకు స్వాగతం పలకడం మాకు సంతోషంగా ఉంది. ఆశావహ యువ క్రీడాకారిణి నుండి ప్రపంచ క్రికెట్ ఐకాన్‌గా ఎదిగిన స్మృతి ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది. ప్రతిభకు అవకాశం తోడైతే జరిగేది ఏమిటో ఆమె ప్రయాణం సూచిస్తుంది. ప్రతి బాలికకు నేర్చుకోవడానికి, ఆడుకోవడానికి, నాయకత్వం వహించడానికి, తమ సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి అవకాశం కల్పించేందుకు, స్మృతితో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాం’ అన్నారు యునిసెఫ్ ఇండియా ప్రతినిధి సింథియా మెక్‌కాఫ్రే.
ప్రతిభకు ప్రోత్సాహం తోడైతే...
మహారాష్ట్రలోని ముంబైలో జన్మించి సాంగ్లీలో పెరిగిన స్మృతి మంధానకు చిన్న వయసులోనే క్రికెట్ అంటే ఇష్టం ఏర్పడింది. తండ్రి, సోదరుడు క్రికెట్ బాగా ఆడేవారు. దీంతో ఇంటినిండా క్రికెట్ కబుర్లే.
బాలికల కలలకు ప్రతిభ తోడైతే, ఆ ప్రతిభకు ప్రోత్సాహం చేరువైతే పూర్తి స్థాయిలో సామర్థ్యాన్ని వినియోగించుకోవచ్చు అని చెప్పడానికి స్మృతి మంధాన బలమైన ఉదాహరణ. తొమ్మిదేళ్ల వయసులో అండర్–15 జట్టులోకి ప్రవేశించి, 11 ఏళ్ల వయసులో అండర్–19 జట్టుకు చేరుకుంది మంధాన. ‘నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి తల్లిదండ్రుల ప్రోత్సాహమే కారణం’ అంటుంది. చాలా చిన్న వయసులోనే ‘నేను వరల్డ్ ఛాంపియన్ కావాలి’ అని కలలు కనేది.
అలాంటి కలలు దేశవ్యాప్తంగా ఎంతోమంది బాలికలకు కచ్చితంగా ఉంటాయి. ఆ కలలు సాకారం కావాలంటే సమాజానికి స్మృతి మంధాన లాంటి గర్ల్స్ ఎంపవర్మెంట్ అడ్వకేట్లు అవసరం. వారి స్ఫూర్తిదాయకమైన చరిత్ర మరింత అవసరం.
అండగా నిలిచేలా...
దక్షిణ కశ్మీర్లో అందమైన గ్రామం అది. ఆ గ్రామానికి చెందిన మూడవ తరగతి విద్యార్థిని అమీనా అందమైన కల కంటోంది. క్రికెటర్ కావాలనేది ఆమె కల. ఈ చిన్నారికి స్ఫూర్తి... స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన. ఈ అమ్మాయి గురించి తన ΄ోస్ట్ ద్వారా లోకానికి పరిచయం చేశాడు సినీ దర్శకుడు కబీర్‌ఖాన్. కనీస సౌకర్యాలు లేని మారుమూల ప్రాంతాలలో కూడా చిన్నారులలో కలలు ఉంటాయని ఈ ΄ోస్ట్ మరోసారి గుర్తుచేసింది. పిల్లలు అరు లోయలో కొండల మధ్య, ఎగుడు దిగుడు మైదానాలపై క్రికెట్ ఆడుతుంటారు. ప్రకృతి కూడా మౌనంగా ఆటలో భాగం అవుతుంది. కబీర్‌ఖాన్ ΄ోస్ట్కు స్మృతి మంధాన ఇలా స్పందించింది...‘అరులోని ఆ లిటిల్ ఛాంపియన్‌కు దయచేసి నా తరఫున హగ్ ఇవ్వండి. నేను ఆమెకు స΄ోర్ట్‌గా ఉంటానని చెప్పండి’
- స్మృతి మంధాన
ఇదీ చదవండి: "ఆమె నా కూతురు": తండ్రిగా గర్వించే క్షణం..


