స్కూటీపై కన్నేసిన ఎద్దు : ఇది టెస్ట్‌ రైడ్‌ బ్రో..! | Rishikesh: bull takes scooter for test ride video goes viral | Sakshi
Sakshi News home page

స్కూటీపై కన్నేసిన ఎద్దు : ఇది టెస్ట్‌ రైడ్‌ బ్రో..!

May 3 2025 1:01 PM | Updated on May 3 2025 5:23 PM

Rishikesh: bull takes scooter for  test ride video goes viral

సోషల్‌ మీడియా (Social media) విశేషాల  పుట్ట.  తాజాగా ఒకవిచిత్రమైన వీడియో తెగ సందడి చేస్తోంది. ‘‘రిమ్‌జిమ్‌.. రిమ్‌జిమ్‌.. స్కూటీ వాలా జిందాబాద్‌ అంటూ  ఒక  ఎద్దు (bull) స్కూటీని ఎంచక్కా రైడ్‌ చేస్తోంది. అదేంటి ఎద్దుల బండి చూశాం కానీ.. ఎద్దేంటి, స్కూటీ ఏంటి అనుకుంటున్నారా? అయితే మీరీ కథనం చదవాల్సిందే. సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తోన్న వీడియో చూసి తీరాల్సిందే.

ఈ విచిత్రమైన సంఘటన ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో  చోటు చేసుకుంది. ఒక వీధిలో తిరిగే ఎద్దు స్కూటీని నడుపుతున్న దృశ్యం CCTV ఫుటేజీలో రికార్డైంది. ఇది సోషల్‌ మీడియాలో పోస్ట్‌ కావడంతో తెగ వైరల్ అవుతోంది. బుల్‌గారి జాయ్‌రైడ్‌ వీడియో ఆరు లక్షలకు పైగా వీక్షణలను,  వేలాది కామెంట్లను సొంతం చేసుకుంది.

శుక్రవారం (మే 2) శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో, రిషికేశ్‌లో ఒక వీధిలో తిరిగే ఎద్దు కన్ను పార్క్ చేసిన తెల్లటి స్కూటర్‌పై పడింది. అంతే.. చలో టెస్ట్‌ రైడ్’ అంటూ రంగంలోకి దిగిపోయింది. ఎద్దు స్కూటర్‌ సీటుపై ముందు కాళ్లు, వెనుక కాళ్లను నేలపై ఉంచగానే అది జర్రున ముందుకు దూకింది. ఎక్కాక ఆగేదే లే అన్నట్టు  ముందుకు సాగింది. అలా వెడుతూ..  వెడతూ.. మొత్తానికి ఒకచోట ఆగిపోయింది. దీంతో  ఇది చూసిన వారంతా అవాక్కయ్యారు. ఆనక.. తప్పుకోండి రా బాబోయ్‌.. అక్కడినుంచి పరుగు తీశారు. స్కూల్ యూనిఫాంలో, చిన్న పిల్లవాడితో నడుస్తున్న సమీపంలోని ఒక మహిళ వెంటనే ఆ పిల్లవాడిని చంకనెత్తుకొని పరుగుదీసింది. అయితే అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. 

దీనికి సంబంధించిన వీడియోను   'భూపి పన్వర్'  అనే  ఎక్స్‌ యూజర్‌  "మీరు స్కూటీలను దొంగిలించే వ్యక్తులను చూసి ఉంటారు..కానీ రిషికేశ్‌లో  వెరైటీగా స్కూటీ దొంగతనం జరిగింది. ఇక్కడ వీధుల్లో తిరుగుతున్న విచ్చలవిడి ఎద్దులు కూడా బైక్‌లు , స్కూటీలపై మనసు పడుతున్నాయ’’ అనే క్యాప్షన్‌తో దీన్ని పోస్ట్‌ చేశారు. దీంతో నెటిజనుల  చమక్కులు, కామెడీకామెంట్ల్స్‌ వెల్లువెత్తాయి. 

ఇదీ చదవండి: వాటర్‌ ఫిల్టర్‌ నీరు వృథా కాకూడదంటే..ఇలా చేయండి!

ఒక వినియోగదారు, "cctv లేకుండా దీన్ని బీమా కంపెనీలకు ఎలా వివరించాలి" అని, మరొక వినియోగదారు,  భాయ్ ఆజ్ మే భీ సవారీ కర్ హీ లేతా హూన్” (“బ్రో, ఈ రోజు నేను కూడా రైడ్‌కి వెళ్తాను.”).” అంటూ హాస్యంగా  కామెంట్‌ చేశారు.అలాగే పాపం,  స్కూటర్‌పై ముచ్చట పడ్డాక దాని కొమ్ములు హ్యాండిల్ మధ్యలో ఇరుక్కుపోయి ఉండొచ్చని, దాంతో అది విడిపించుకునేందుకు ప్రయత్నంలో అలా ముందుకు కదిలి ఉండొచ్చని మరికొందరు అభిప్రాయ పడ్డారు. 

చదవండి: హల్దీ వేడుకలో వధువు చేసిన పనికి దెబ్బకి అందరూ షాక్‌!

Advertisement
 
Advertisement
Advertisement