'వేర్‌ ఈజ్‌ మై హజ్బెండ్‌?' సంగీత ప్రపంచంలో సరికొత్త రికార్డు! | RAYE Wins Mercury Prize-2026 | Sakshi
Sakshi News home page

'వేర్‌ ఈజ్‌ మై హజ్బెండ్‌?' సంగీత ప్రపంచంలో సరికొత్త రికార్డు!

Oct 23 2026 11:56 AM | Updated on Oct 23 2026 12:41 PM

RAYE Wins Mercury Prize-2026

పాటతో మనసును తాకడం ఒక ఎత్తు.. అదే పాటతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడం మరో ఎత్తు! ఇప్పుడు ఈ రెండింటినీ సాధించి సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది ప్రముఖ పాప్‌ సింగర్‌ రాచల్‌ అగాథా కీన్‌ (రేయ్‌). తన రెండో ఆల్బమ్‌ ‘దిస్‌ మ్యూజిక్‌ మే కంటెయిన్‌ హోప్‌’తో 2026 మెర్క్యురీ ప్రైజ్‌ను గెలుచుకుంది. అంతేకాదు.. ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్న తొలి పాప్‌ ఆల్బమ్‌గా రికార్డు సృష్టించింది. ఈ విజయంతో ఆమెకు 25 వేల పౌండ్ల నగదు బహుమతి కూడా దక్కింది.

హాలీవుడ్‌ స్వర్ణయుగపు వైభవాన్ని గుర్తు చేసే సంగీతం.. భావోద్వేగాలతో సాగే కథనం ఈ ఆల్బమ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మొత్తం 17 పాటలు.. 73 నిమిషాల నిడివితో రూపొందిన ఈ ఆల్బమ్‌లో ప్రేమ, విరహం, బాధను అధిగమించి మళ్లీ జీవితాన్ని కొత్తగా ప్రారంభించే ప్రయాణాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది. అలాగే, ఇందులోని ‘వేర్‌ ఈజ్‌ మై హజ్బెండ్‌?’ పాట ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. నాలుగు ఆర్కెస్ట్రాలు, 100 మందికి పైగా సంగీత కళాకారులు ఈ ఆల్బమ్‌ కోసం పనిచేయడం మరో విశేషం.

అయితే, ఈ విజయానికి ముందు తాను ఎన్నో ఇబ్బందులు దాటాల్సి వచ్చిందని చెప్పింది. రెండేళ్ల క్రితం 'నా కారు దొంగతనానికి గురైంది. అందులో పాటలు రాసుకునే నోట్‌బుక్‌లు, డెమో రికార్డింగ్‌లు కూడా ఉండటంతో ఆల్బమ్‌ పనులు దాదాపు ఏడాది ఆలస్యమయ్యాయి. ఆ సమయంలో నేను తీవ్ర ఆందోళనకు గురైనప్పటికీ.. ఆ అనుభవాలే నా ప్రయాణంలో భాగమని ఇప్పుడు భావిస్తున్నాను. వాణిజ్య విజయాన్ని మాత్రమే లక్ష్యంగా పెట్టుకోకుండా, మనసుకు నచ్చినట్లు పాటలను రూపొందించానని' రేయ్‌ తన ఆనందాన్ని పంచుకుంది.

మార్చిలో విడుదలైన ఈ ఆల్బమ్‌ బ్రిటన్‌ మ్యూజిక్‌ చార్టుల్లో అగ్రస్థానానికి చేరుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సర్‌ పాల్‌ మెక్‌కార్ట్నీ, ఒలివియా డీన్‌, జేడ్‌ వంటి ప్రముఖుల ఆల్బమ్‌లతో పోటీపడి మెర్క్యురీ ప్రైజ్‌ను సొంతం చేసుకుంది. అలాగే, 1992 నుంచి అందిస్తున్న ఈ అవార్డు.. బ్రిటన్‌, ఐర్లాండ్‌ సంగీత కళాకారుల ఉత్తమ ఆల్బమ్‌లకు గుర్తింపుగా నిలుస్తోంది. ఈ ఏడాది ఒలివియా డీన్‌, కొజీ రాడికల్‌, నాట్స్‌, జేడ్‌ వంటి కళాకారులు కూడా పోటీలో నిలిచారు.

రేయ్‌ అవార్డు అందుకున్న సందర్భంగా ఆనందంతో భావోద్వేగానికి గురైంది. 'నా కష్టానికి దక్కిన గుర్తింపుగా ఈ విజయాన్ని భావిస్తున్నాను. అలాగే, నా జీవితంలో ఎదురయ్యే ప్రతి చిన్న సంఘటన, ఊహించని మలుపు మన ప్రయాణాన్ని కొత్త దిశగా నడిపిస్తాయని ఆమె చెప్పుకొచ్చింది. ఒకప్పుడు కన్నీళ్లు తెప్పించిన అనుభవాలనే నేడు అద్భుతమైన సంగీతంగా మలిచి.. ప్రపంచ వేదికపై సత్తా చాటిన రేయ్‌ ప్రయాణం నిజంగా ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమనే చెప్పవచ్చు.

ఇదీ చదవండి: థర్మాకోల్ బాక్స్‌తో ఏసీ..! ఆ స్టూడెంట్‌ ఆవిష్కరణకు హర్ష్ గోయెంకా ఫిదా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement