‘స్కై లవ్స్‌ హర్‌’.. ఇక కనిపించదు.. ఎయిర్‌ హోస్టెస్‌ విషాదాంతం | Air India Crash Claims Life of Flight Attendant and Influencer Roshni Songhare | Sakshi
Sakshi News home page

‘స్కై లవ్స్‌ హర్‌’.. ఇక కనిపించదు.. ఎయిర్‌ హోస్టెస్‌ విషాదాంతం

Jun 14 2025 8:15 AM | Updated on Jun 14 2025 9:58 AM

Air India Crash Claims Life of Flight Attendant and Influencer Roshni Songhare

ఈమె పేరు రోశ్నీ రాజేంద్ర సొంఘారే! ఎయిర్‌ ఇండియాలో ఫ్లయిట్‌ అంటెండెంట్‌! ట్రావెల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ కూడా! మబ్బుల్లోంచి దూసుకెళ్లే విమానంలో ప్రపంచమంతా చుట్టేయాలని చిన్నప్పటి నుంచీ కలలు కంది!ఆమె చిన్నప్పడు అమ్మ గోరుముద్దలు పెడుతూ చెప్పే కథల్లో అంశాలేవైనా విమానాన్నే ఊహించుకునేది! చేయి పట్టుకుని నాన్న బజారుకు తీసుకెళ్తే.. విమానం బొమ్మ కనిపించిన షాప్‌ దగ్గరల్లా ఆగేది!అందుకే జ్ఞానం వచ్చాక ఆమె ఎయిర్‌ హోస్టెస్‌ అవుతాననే నిర్ణయాన్ని వినిపించినప్పుడు అమ్మానాన్నలు ఆశ్చర్యపోలేదు! సంతోషంగా దీవించారు! వాళ్లది ఆర్థికంగా ఉన్న కుటుంబమేమీ కాదు. సర్దుబాటు చేసుకోగల పరిస్థితులూ లేవు. 

అయినా కూతురి ఆశను తుంచేయలేదు. తమ రెక్కలు ముక్కలు చేసుకునైనా కూతురి కోరికకు రెక్కలు తొడగాలనుకున్నారు. అయితే.. వాళ్లను కష్టపడనివ్వలేదు రోశ్నీ! ఓ పక్క చదువుకుంటూనే మరోపక్క పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేసుకుంది. పైసా పైసా కూడబెట్టుకుంది. చిన్న చిన్న సరదాలు, సంతోషాలనూ దూరం పెట్టింది. తన కల కోసం అమ్మానాన్నల మీద భారం మోపద్దనేదే ఆమె తాపత్రయం. మొత్తానికి కూడబెట్టుకున్న డబ్బుతో ఫ్లయిట్‌ అటెండెంట్‌ ట్రైనింగ్‌ పూర్తి చేసింది. 

స్కై లవ్స్‌ హర్‌ 
నిన్న మొన్నటి (2025, జూన్‌ 12) దాకా ఎయిర్‌ ఇండియాలోనే ఎయిర్‌ హోస్టెస్‌గా పనిచేసింది. ఆమె కోరుకున్నట్టుగానే కొత్త ప్రదేశాలెన్నిటినో చుట్టొచ్చింది. చూసొచ్చిన ప్రతి ప్రాంతం దగ్గర ఓ ఫొటో తీసుకుని, ఆ ఫొటో సహా ఆ ప్రాంతపు ముచ్చట్లను ‘స్కై లవ్స్‌ హర్‌’అనే పేరుతో ఉన్న తన ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాండిల్‌లో పోస్ట్‌ చేసేది. రోశ్నీ పోస్ట్‌లు చూస్తే తెలిసిపోతుంది.. ప్రయాణాలంటే ఆమెకెంత ఇష్టమో! చాలా చురుకైన అమ్మాయి. ముంబైలో వాళ్లుండే డోంబివ్లీ ఈస్ట్‌లోని నవ్‌ ఉమియా క్రుపా సొసైటీలో ఏ చిన్న వేడుకైనా ఉత్సాహంగా పాల్గొనే  రోశ్నీని తలచుకుని బాధపడనివాళ్లు లేరు.  

 

Advertisement
 
Advertisement
Advertisement