స్ట్రాంగ్‌ రూముల్లో ఈవీఎంలు భద్రం | Sakshi
Sakshi News home page

స్ట్రాంగ్‌ రూముల్లో ఈవీఎంలు భద్రం

Published Wed, May 15 2024 7:10 AM

స్ట్రాంగ్‌ రూముల్లో ఈవీఎంలు భద్రం

ఏలూరు (మెట్రో): ఏలూరు జిల్లాలో పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో ముగిసిందని, ఈవీఎంలను మూడంచెల భద్రత వ్యవస్థల మధ్య భద్రపరచామని కలెక్టర్‌ వె.ప్రసన్న వెంకటేష్‌ చెప్పారు. జిల్లాలో సోమవారం ఏలూరు పార్లమెంట్‌, 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్‌ ప్రక్రియ ముగించుకుని ఏలూరులోని సర్‌ సీఆర్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలోని స్ట్రాంగ్‌ రూమ్‌లలో ఈవీఎంలను భద్రపరిచే కార్యక్రమాన్ని మంగళవారం ఉదయం కలెక్టర్‌ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం తీసుకున్న పటిష్టమైన చర్యల కారణంగా జిల్లాలో పోలింగ్‌ ప్రక్రియ సజావుగా జరిగిందన్నారు. జిల్లాలో 83.4 శాతం పోలింగ్‌ నమోదైందన్నారు. జిల్లాలో కొన్ని ప్రాంతాలలో సోమవారం సాయంత్రం 6 లోపున పోలింగ్‌ స్టేషన్‌లో ఉన్న ఓటర్లందరికీ ఓటు హక్కు కల్పించామని, రాత్రి వరకు పోలింగ్‌ కొనసాగిందన్నారు. అనంతరం ఆయా ప్రాంతాల నుంచి సిబ్బంది ఈవీఎంలను తీసుకుని వచ్చి స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపరిచే కార్యక్రమం మంగళవారం ఉదయం వరకు జరిగిందన్నారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద కేంద్ర పారా మిలట్రీ భద్రతా బలగాల పహారాలో ఉంటాయన్నారు. రెండో అంచెలో రాష్ట్ర రిజర్వ్‌ భద్రతా దళాలు, మూడో అంచెలో స్థానిక పోలీస్‌ ఫోర్స్‌ భద్రత అందిస్తాయన్నారు. ఈవీఎంలను పోలింగ్‌ సిబ్బంది, పోలింగ్‌ ఏజెంట్లు, వివిధ రాజకీయ ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరచి, వారి సమక్షంలో స్ట్రాంగ్‌ రూంలకు సీళ్లు వేసి కేంద్ర భద్రతా బలగాలకు అప్పగించామన్నారు. ఈవీఎంల భద్రతను, స్ట్రాంగ్‌ రూమ్‌ల సీళ్లను తాను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటామన్నారు. అదేవిధంగా వివిధ పార్టీల ప్రతినిధులు కూడా పరిశీలించవచ్చన్నారు. జూన్‌ 4వ తేదీన ఏలూరులోని సీఆర్‌రెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో ఓట్ల లెక్కింపు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర ఎన్నికల సాధారణ పరిశీలకులు కృష్ణకాంత్‌ పాఠక్‌, ఎస్‌ఏ రామన్‌, ఎస్పీ డి.మేరీ ప్రశాంతి, జాయింట్‌ కలెక్టర్‌ బి.లావణ్య వేణి, ఐటీడీఏ పీఓ ఎం.సూర్యతేజ, ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement