జనవరి 5 నుంచి తెలుగు మహాసభలు | Sakshi
Sakshi News home page

జనవరి 5 నుంచి తెలుగు మహాసభలు

Published Mon, Nov 20 2023 1:44 AM

విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న  నిర్వాహకులు 
 - Sakshi

కాళ్ల: ఆంధ్ర సారస్వత పరిషత్‌, చైతన్య విద్యాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జనవరి 5, 6, 7 తేదీలలో రాజమహేంద్రవరంలో రాజరాజనరేంద్రుని పట్టాభిషేక సహస్రాబ్ది ఉత్సవాలలో భాగంగా రెండో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఆదివారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రమేవ జయతే అన్న నినాదంతో ఈ సభలు నిర్వహిస్తున్నామని, దీనిలో భాగంగా తెలుగు భాషలో ఉన్న వివిధ ప్రక్రియలకు సంబంధించిన 26 సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలుగు భాష కోసం విశేష కృషి చేసిన ఎందరో కవులు, పండితులు, కళాకారులు, సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతారన్నారు. ఆదికవి నన్నయ మహాభారత రచనకు శ్రీకారం చుట్టి వెయ్యి సంవత్సరాలైన సందర్భంగా వెయ్యి మంది కవులతో ఆదికవి నన్నయకు నీరాజనం ఇచ్చే కార్యక్రమం చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. పదివేల మంది విద్యార్థులతో వేమన శతక పద్యాలు వల్లె వేసే కార్యక్రమంతో పాటు తెలుగు భాషా పరిరక్షణ కార్యక్రమాలపై ఒక ప్రత్యేక సదస్సు నిర్వహిస్తామన్నారు. వీటిలో పాల్గొనదలచినవారు పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. ఇందుకోసం ఆంధ్ర సారస్వత పరిషత్‌ అధ్యక్షుడు గజల్‌ శ్రీనివాస్‌, ఈ సంస్థ ముఖ్య సంచాలకుడు కేశరాజు రాంప్రసాద్‌లతో ఉండి నియోజకవర్గ ఆంధ్ర సారస్వత పరిషత్‌ ఉత్సవ కమిటీని నియమించామన్నారు. దీనికి సంచాలకులుగా కోపల్లెకు చెందిన పెనుమత్స విశ్వనాథరాజు, సహ సంచాలకులుగా పెంకి విజయ్‌కుమార్‌, సభ్యులుగా కొత్తపల్లి మణి త్రినాథరాజు, ముదునూరి శివరామరాజు, కళ్లేపల్లి సతీష్‌రాజు, దాసరి సత్యనారాయణ అగ్నిహోత్రం ఫణిప్రసాద్‌, ఆకివీడు ఆదిత్య స్కూల్‌ సాంబశివరావు, డ్రాయింగ్‌ టీచర్‌ ఆచారి, కవి రంగరాజు, నటులు వెంకటేశ్వరరావు తెలుగు పండిట్‌ కే శ్రీనివాస్‌ అప్పన్న, చల్లా సాయిలతో కమిటీ ఏర్పాటు చేసినట్లు వివరించారు.

Advertisement
Advertisement