రత్నగిరికి భక్తుల తాకిడి | Sakshi
Sakshi News home page

రత్నగిరికి భక్తుల తాకిడి

Published Mon, Nov 20 2023 2:44 AM

నిత్యకల్యాణ మండపంలో  స్వామివారి వ్రతాలాచరిస్తున్న భక్తులు - Sakshi

అన్నవరం: కార్తిక మాస తొలి ఆదివారం సందర్భంగా రత్నగిరి సత్యదేవుని సన్నిధికి వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. ఆదివారం సెలవుదినం కావడం, ఉదయం 7–30 గంటల నుంచి సప్తమి పర్వదినం రావడంతో ఈ రద్దీ ఏర్పడింది. భక్తుల రాకతో దేవస్థానం ఘాట్‌రోడ్లు, పార్కింగ్‌ ప్రదేశాలు కిక్కిరిసి ట్రాఫిక్‌ స్తంభించింది. సత్యదేవుని ఆలయం, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణం, ఎక్కడ చూసినా భక్తజనమే దర్శనమిచ్చారు. సుమారు 60 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించారని అధికారులు అంచనా వేశారు. సత్యదేవుని వ్రతాలు సాయంత్రం ఐదు గంటల సమయానికి సుమారు 5,200 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.60 లక్షలు ఆదాయం వచ్చినట్లు అధికార్లు తెలిపారు. దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్‌, ఈఓ రామచంద్రమోహన్‌ దేవస్థానంలో పలు విభాగాలు సందర్శించి ఏర్పాట్లు పర్యవేక్షించారు. కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో సీసీ టీవీలలో భక్తుల రద్దీ దృశ్యాలను పరిశీలించిన ఈఓ సిబ్బందికి తగిన ఆదేశాలిచ్చారు.

తెల్లవారుజాము ఒంటి గంట నుంచి వ్రతాలు, దర్శనాలు

శనివారం రాత్రికే సుమారు పది వేల మంది భక్తులు రత్నగిరికి చేరుకోవడంతో ఆలయాన్ని ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు తెరిచి వ్రతాలు ప్రారంభించి, స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించారు. అప్పటి నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు రద్దీ కొనసాగింది. స్వామివారి వ్రతమండపాలు, నిత్య కల్యాణ మండపం, పాత కల్యాణ మండపాలు, వ్రతాలు ఆచరించే భక్తులతో నిండిపోయాయి. దీంతో స్వామివారి నిత్య కల్యాణమండపం, పాత కల్యాణ మండపంలోనూ నిర్వహించారు. స్వామివారిని దర్శించిన భక్తులు సప్త గోకులంలో గోవులకు ప్రదక్షిణ చేశారు. తూర్పు రాజగోపురం ఎదురుగా ఉన్న రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి పూజలు చేశారు.

సుమారు పది వేల మంది భక్తులకు పులిహోర దధ్యోజనం పంపిణీ చేశారు. సుమారు 60 వేల ప్రసాదం ప్యాకెట్లు విక్రయించారు. వ్రతాల ద్వారా రూ.30 లక్షలు, ప్రసాదం విక్రయాల ద్వారా రూ.12 లక్షలు ఆదాయం రాగా, మిగిలిన విభాగాల ద్వారా రూ.20 లక్షల ఆదాయం వచ్చిందని అంచనా వేశారు.

క్యూ లైన్లు కంపార్ట్‌మెంట్లలో తోపులాట, తొక్కిసలాట, భక్తుల ఆగ్రహం

నూతనంగా నిర్మించిన క్యూ లైన్‌ కంపార్ట్‌మెంట్లలో భక్తులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. వాటిలో మంచినీటితో సహా సరైన వసతులు లేకపోవడం, ఎక్కువ సేపు వేచి ఉండాల్సి రావడంతో భక్తుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దేవస్థానం అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉదయం 11.30 నుంచి ఒంటి గంట వరకు ఈ పరిస్థితి నెలకొంది. దీంతో అంతరాలయ దర్శనాన్ని కొంత సేపు నిలిపివేసి భక్తులకు బయట నుంచే దర్శనానికి అనుమతించారు.

నేడు కూడా తీవ్ర రద్దీ!

కార్తిక సోమవారం పర్వదినం సందర్భంగా రత్నగిరిపై తీవ్ర రద్దీ నెల కొనే అవకాశం ఉంది. సుమారు 80 వేలకు పైగా భక్తులు స్వామివారి ఆలయానికి వచ్చే అవకాశం ఉంది. దీంతో తెల్లవారుజామున ఒంటి గంటకే స్వామివారి వ్రతాలు ప్రారంభిస్తారు. స్వామివారి దర్శనాలు తెల్లవారుజామున మూడు గంటల నుంచి ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు.

60 వేలకు పైగా దర్శించుకున్న భక్తులు

5,200 వ్రతాలు, రూ.60 లక్షల ఆదాయం

క్యూ కంపార్ట్‌మెంట్లలో భక్తుల ఇబ్బందులు

1/2

 దర్శనం క్యూ కంపార్ట మెంట్‌ లో  వేచి యున్న భక్తులు
2/2

దర్శనం క్యూ కంపార్ట మెంట్‌ లో వేచి యున్న భక్తులు

Advertisement
Advertisement