అబ్బే.. నాకొద్దు..

- - Sakshi

అన్నవరం: శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి(ఈఓ)గా డెప్యూటేషన్‌పై జాయిన్‌ అయ్యేందుకు దేవదాయ శాఖ కమిషనర్‌ కార్యాలయంలో అడిషనల్‌ కమిషనర్‌గా పని చేస్తున్న కె.రామచంద్ర మోహన్‌ అంతగా ఆసక్తి చూపడం లేదని సమాచారం. అన్నవరం దేవస్థానం ఈఓగా పని చేస్తున్న ఎస్‌ఎస్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ను శ్రీకాళహస్తి దేవస్థానానికి బదిలీ చేసి, ఆయన స్థానంలో రామచంద్ర మోహన్‌ను నియమించిన విషయం విదితమే. అన్నవరం దేవస్థానం ఈఓ పోస్టు జాయింట్‌ కమిషనర్‌ హోదా కలిగినది. దీనికంటే రామచంద్ర మోహన్‌ హోదా ఎక్కువ. దీనికి వ్యక్తిగత కారణాలు కూడా తోడవడంతో ఇక్కడ చేరేందుకు ఆయన ఇష్టపడటం లేదని అంటున్నారు.

దీంతో అన్నవరం దేవస్థానం ఈఓ పోస్టును అడిషనల్‌ కమిషనర్‌ స్థాయికి అప్‌గ్రేడ్‌ చేయాలా లేక మరో అధికారిని నియమించాలా అని ఉన్నతాధికారులు యోచిస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా శ్రీకాళహస్తి ఈఓగా నియమితులైన ఎస్‌ఎస్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ గురువారం ఉదయం అన్నవరం దేవస్థానంలో రిలీవ్‌ అయి, విజయవాడ బయలుదేరి వెళ్లిపోయారు.

రిలీవ్‌ అవడానికి అవసరమైన ఫైళ్లపై సంతకాలు చేసిన ఆయన.. మిగిలిన ఫార్మాలిటీస్‌ పూర్తి చేయడానికి అవసరమైన ఫైళ్లను విజయవాడ తీసుకురావాల్సిందిగా సిబ్బందిని ఆదేశించారు. కార్తిక మాసం ఏర్పాట్లను వెంటనే పూర్తి చేయాలని ఇంజినీరింగ్‌ సిబ్బందిని ఆదేశించారు. ఆదిశంకర మార్గ్‌, మల్టీ లెవెల్‌ పార్కింగ్‌, వనదుర్గ గుడికి నిర్మించిన రోడ్డుపై ప్రయాణించే వాహనాలకు రక్షణగా రోడ్డు అంచున బారికేడ్‌లు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. పలువురు సిబ్బంది ఆయనకు వీడ్కోలు పలికారు.

Read latest East Godavari News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top