ఉపాధి విస్తృతం..! | Sakshi
Sakshi News home page

ఉపాధి విస్తృతం..!

Published Sat, Nov 18 2023 1:46 AM

చాగల్లు మండలంలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలు - Sakshi

29,240 పనుల గుర్తింపు

వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఉపాధి పథకం ద్వారా 29,240 పనులు చేపట్టాలని డ్వామా అధికారులు లక్ష్యాలు నిర్దేశించుకున్నారు. ఇప్పటికే ఆమృత్‌ సరోవర్‌లో భాగంగా 75 చెరువుల అభివృద్ధికి సంబంధించిన పనులు వంద శాతం పూర్తి చేశారు.

● గృహ నిర్మాణానికి 90 పనిదినాలకు సంబంధించిన పనులు చేపడుతున్నారు. నీటి పారుదలకు ఆటకం కలగకుండా చెరువుల్లో పూడికతీత, పంట, పిల్ల కాలువల పూడిక తీత, గ్రామీణ రహదారుల అనుసంధాన, హార్టికల్చర్‌, ఎవెన్యూ ప్లాంటేషన్‌, హౌసింగ్‌ కాలనీల్లో మ్యాజిక్‌ సోక్‌ పిట్స్‌, గ్రామీణ ప్రాంతాల్లో మురుగు నీరు బయటకు వెళ్లేలా కమ్యూనిటీ సోక్‌ పిట్స్‌ పనులు చేపడుతున్నారు.

● ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో నీటి సంరక్షణకోసం ‘రూఫ్‌ టాప్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ స్టక్చర్‌’ లాంటి వాటికి అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్నారు.

● జిల్లా భౌగోళికంగా డెల్టా, మెట్ట ప్రాంతాలు కలిసి ఉండటం వల్ల మెట్ట ప్రాంత మండలాల్లో నీటి సంరక్షణ, హార్టికల్చర్‌ ప్లాంటేషన్‌ ద్వారా ఉద్యాన పంటల సాగును ప్రోత్సహిస్తున్నారు.

● రైతులకు అధిక లాభాలు అందించే ‘డ్రాగాన్‌ ఫ్రూట్‌’ సాగును ప్రోత్సహిస్తున్నారు. నల్లజర్ల, గోపాలపురం, పెరవలి మండలాల్లో వీటి సాగును విస్తృతం చేస్తున్నారు.

జిల్లాలో జోరుగా సాగుతున్న పనులు

అడిగిన ప్రతి ఒక్కరికీ ఉపాధి

చూపుతున్న అధికారులు

ఈ ఏడాది రికార్డు స్థాయిలో

ఉపాధి కల్పన

2023–24 సంవత్సరానికి

58 లక్షల పనిదినాలు లక్ష్యం

సాక్షి, రాజమహేంద్రవరం: వలసలు నియంత్రించి ఉన్న ఊళ్లోనే పని కల్పించేందుకు ఉద్దేశించిన ఉపాధి పథకం జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా అమలవుతోంది. పని కావాలని అడిగిన ప్రతి ఒక్కరికీ రాష్ట్ర ప్రభుత్వం పనులు చూపుతోంది. పథకంలో వ్యవసాయ అనుబంధ, అభివృద్ధి పనులకు ప్రాధాన్యం కల్పిస్తోంది. కూలీలు చేపట్టే వాటికి మొదటి ప్రాధాన్యత కల్పిస్తోంది. మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులతో ప్రభుత్వ ప్రాధాన్యత భవనాల నిర్మాణం చేపడుతోంది. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రం, హెల్త్‌ క్లీనిక్‌, పాలకేంద్రం, డిజిటల్‌ లైబ్రరీలు, రోడ్లు, మురుగు కాలువల నిర్మాణ పనులు చేపడుతున్నారు. పండ్లతోటల అభివృద్ధికి అండగా ఈ పథకం నిలుస్తోంది. పనులు చేసిన వెంటనే బిల్లులు జమ అవుతుండటంతో కూలీల సంఖ్య పెరుగుతోంది. రోజూ 60 వేల మందికి పైగా ఉపాధి పొందుతున్నారంటే పరిస్థితి అర్థం అవుతోంది. సాధారణంగా వేసవిలో ఉపాధికి డిమాండ్‌ ఉంటుంది. ప్రస్తుతం వ్యవసాయ పనుల సీజన్‌ అయినా ఆదరణ తగ్గడం లేదు.

58 లక్షల పనిదినాలే లక్ష్యం:

జిల్లా వ్యాప్తంగా 2023–2024 సంవత్సరంలో 58 లక్షల పనిదినాలు కల్పించాలని డ్వామా అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇప్పటికే 39.91 లక్షలు పూర్తి చేశారు. 68.81 శాతం లక్ష్యాన్ని అధిగమించారు. మిగిలిన 18 లక్షల పనిదినాలు నిర్దేశించిన సమయం లోపు పూర్తి చేసేందుకు శ్రమిస్తున్నారు. రాబోయే ఐదు మాసాల్లో వంద శాతం అమలయ్యేలా

అడిగిన వారందరికీ పని కల్పించనున్నారు. 1,83,835 జాబ్‌కార్డులు జారీ చేశారు. రోజుకు ఒక్కో కూలీకి సగటు వేతనం రూ.236.75 అందజేస్తున్నారు. 1163 కుటుంబాలకు 100 రోజుల పని చూపారు. పథకంలో బడుగులకు అగ్రపీఠం వేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా పనులు చూపుతున్నారు. ఇప్పటి వరకు 66.26 శాతం ఎస్సీ కుటుంబాలకు, 69.31 శాతం ఎస్టీ కుటుంబాలకు ఉపాధి చూపినట్లు డ్వామా అధికారుల గణాంకాలు స్పష్టం చేస్తున్నారు.

రూ.152.13 కోట్లు వెచ్చింపు:

2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పనులు వేగవంతంగా జరుగుతున్నారు. కూలీలతో చేపట్టే పనులే కాకుండా, మెటీరియల్‌ కాంపొనెంట్‌ ద్వారా అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఇప్పటి వరకు రూ.152.13 కోట్లు వెచ్చించారు. వేతన ఖర్చు కింద కూలీలకు రూ.94.49 కోట్లు, మెటీరియల్‌ కాంపోనెంట్‌లో భాగంగా రూ.50.50 కోట్లు ఖర్చు చేశారు. రూ.7.14 కోట్లు పరిపాలన ఖర్చుకు వెచ్చించారు. మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులు వినియోగించి గ్రామాల్లో ప్రధాన్యత భవనాల నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఇప్పటికే ఇవి సింహభాగం తుదిరూపు దిద్దుకోగా.. మిగిలినవి యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

● ప్రతి మండలానికి రూ.60 లక్షల నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రహదారులు, మురుగు కాలువల నిర్మాణాలకు రూ.10.80 కోట్లు వెచ్చించనున్నారు. వెరసి చిన్న, సన్నకారు రైతులు సైతం ఉపాధి పొందుతున్నారు. గ్రామాల్లో మౌలిక వసతులు సమకూరుతున్నాయి.

అక్రమాలకు ఆస్కారం లేకుండా:

ఉపాధిలో అక్రమాలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు పథకంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పథకం ఇస్టానుసారంగా అమలయ్యేది. పనులకు 200 మంది హాజరైతే 400 మంది అని దొంగ మస్టర్లు వేసి మరీ నిధులు నొక్కేసిన సందర్భాలు అనేకం. మెటీరియల్‌ కాంపోనెంట్‌ పనుల్లో అడ్డగోలు దోపిడీకి తెర తీశారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటికి చెక్‌ పెట్టింది. నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ ద్వారా మస్టర్‌ వేస్తున్నారు. తద్వారా రోజుకు రెండు సార్లు హాజరు వేస్తుండటం, హాజరును లైవ్‌ టెలీకాస్ట్‌ చేస్తుండటంతో అక్రమాలకు అడ్డుకట్ట పడుతోంది. కూలీలకు వేతనాలు చెల్లించడంలోనూ పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నారు. జాబ్‌కార్డుకు ఆధార్‌, మొబైల్‌ నంబరు, బ్యాంకు ఖాతాను లింక్‌ చేస్తున్నారు. వెరసి నిధుల దోపిడీకి అడ్డుకట్ట పడింది.

జిల్లాలో (2023–24) పనిదినాల కల్పన లక్ష్యం : 58 లక్షలు

ఇప్పటి వరకు పూర్తయిన పనిదినాలు : 39.91 లక్షలు

(68.81 శాతం)

కుటుంబానికి సగటు పనిదినాలు : 43.27

కూలీకి రోజుకు సగటు వేతనం : రూ.236.75

100 రోజులు పూర్తయిన కుటుంబాలు : 1163

3 రోజుల్లో పేమెంట్‌ జనరేట్‌ శాతం : 100

మొత్తం ఖర్చు : రూ.152.13 కోట్లు

లక్ష్యాలను అధిగమిస్తాం

ఉపాధి పనులు జిల్లాలో చురుగ్గా జరుగుతున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో 58 లక్షల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నాం. అడిగిన ప్రతి ఒక్కరికీ పనులు కల్పిస్తుండటం, బిల్లులు సైతం సకాలంలో జమ చేస్తుండటంతో పథకానికి ఆదరణ పెరుగుతోంది. 68 శాతం లక్ష్యాన్ని అధిగమించాం. మిగిలిన వాటిని సైతం పూర్తి చేసి వంద శాతం లక్ష్యాన్ని సాధిస్తాం. కూలీలతో పాటు, మెటీరియల్‌ కంపోనెంట్‌ పనులు యుద్ధప్రాతిపదికన చేపడుతున్నాం.

పి.జగదాంబ, పీడీ డ్వామా

1/2

2/2

Advertisement
 
Advertisement