‘కోరింగ’లో ‘స్పాట్‌–టెయిల్డ్‌ పిట్‌ వైపర్‌’ | - | Sakshi
Sakshi News home page

‘కోరింగ’లో ‘స్పాట్‌–టెయిల్డ్‌ పిట్‌ వైపర్‌’

Jun 5 2025 9:18 AM | Updated on Jun 5 2025 9:18 AM

‘కోరింగ’లో ‘స్పాట్‌–టెయిల్డ్‌ పిట్‌ వైపర్‌’

‘కోరింగ’లో ‘స్పాట్‌–టెయిల్డ్‌ పిట్‌ వైపర్‌’

సాక్షి ప్రతినిధి, కాకినాడ: భవిష్యత్‌లో అంతరించిపోయే జాతుల జాబితాలో ఉన్న స్పాట్‌–టెయిల్డ్‌ పిట్‌ వైపర్‌ జాతి పాము కాకినాడ సమీపాన గుర్తించారు. దేశంలోనే మూడో అతి పెద్ద కోరంగి అభయారణ్యంలో ఈ పాము తారసపడింది. దాదాపు 40 ఏళ్ల క్రితం జనవాసాల్లో కనిపించే ఈ అరుదైన జాతిపాము సమీప భవిష్యత్‌లో అంతరించిపోయే జాతుల్లో ఒకటిగా చేరింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1978 ప్రకారం ఈ పాము నాలుగో షెడ్యూల్‌లో ఉంది. అటువంటి ఈ జాతి పాము పరిరక్షణ కోసం తక్షణం ప్రయత్నించకుంటే అంతరించిపోతున్న జాతుల్లో చేరిపోతుందని వన్యప్రాణి సంరక్షణా విభాగం గుర్తించింది. ఈ నేపథ్యంలో స్పాట్‌–టెయిల్డ్‌ పిట్‌ వైపర్‌ పామును నాలుగో షెడ్యూల్‌ నుంచి ఒకటో షెడ్యూల్‌లోకి చేర్చారు. ఈ షెడ్యూల్‌ మార్పు ద్వారా అత్యంత జాగ్రత్తతో ఈ జాతి పామును రక్షించాలనే సందేశాన్ని ఇచ్చినట్టు వన్యప్రాణి విభాగం అధికారులు చెబుతున్నారు. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ముందుచూపుతోనే 2022లో షెడ్యూల్‌ మార్చారు.

పొడ పాము సంతతికి చెందిన ఈ పాము పచ్చరంగులో ఉంటుంది. ఈ జాతిలో రెండు రకాలు బాంబోపిట్‌ వైపర్‌, స్పాట్‌ వైల్డ్‌ పిట్‌వైపర్‌ ఉన్నాయి. బాంబో పిట్‌ వైపర్‌ సాధారణంగా అటవీ ప్రాంతమైన రంపచోడవరం ఏజెన్సీలోని మారేడుమిల్లి, వై.రామవరం, అడ్డతీగల తదితర ప్రాంతాల్లో ఉంటుంది. స్పాట్‌ వైల్డ్‌ పిట్‌ వైపర్‌ జాతి పాములు చిత్తడి నేలల్లో (మాంగ్రూవ్స్‌) మాత్రమే మనగలుగుతాయి. ఈ పాము మనిషిపై దాడి చేసినప్పుడు రక్తంలో బ్లడ్‌ క్లాట్స్‌ ఏర్పడతాయి. దీంతో బ్రెయిన్‌ డెడ్‌ కావడం, హార్ట్‌ అటాక్‌, కోమాలోకి వెళ్లడంతో ప్రాణానికే ప్రమాదం ఏర్పడతాయి. అయితే, ఇంతవరకూ ఈ జాతి పామువల్ల ఇలాంటి కేసులు ఎక్కడా నమోదు కాలేదు. ఈ పాములు పగలు నిద్రావస్థలో ఉండి, రాత్రి పూట మాత్రమే సంచరిస్తుండటంతో ప్రజల ప్రాణాలకు పెద్దగా ప్రమాదం ఎదురు కాలేదు. ఈ జాతి పాములు ఎక్కువగా దక్షిణ ఆసియా, మయన్మార్‌లలో మాత్రమే కనిపిస్తుంటాయి. దీనిని ఒక విషపూరితమైన పాము జాతిగా తేల్చారు. ఈ పాము విషం చాలా శక్తిమంతమైనదిగా నిర్ధారించారు. ఈ పాము కాటు వేసినప్పుడు సకాలంలో వైద్య అందకపోతే ప్రాణాంతకమే. ఆకుపచ్చ రంగులో ఉండి శరీరంపై చిన్న చిన్న ఎరుపు మచ్చలు కూడా కనిపిస్తుంటాయి. తల భాగం ఒకే రీతిలో చిలకాకుపచ్చ, వెనుక ప్రకాశవంతమైన ఆకుపచ్చ రంగు కలిగి ఉంటుంది. పచ్చని చెట్లపై సంచరిస్తూండటంతో ఈ పామును స్థానికులు పసర పాముగా భావించి ఉదాసీనంగా ఉంటే ప్రాణాలకే ప్రమాదం. జీవ వైవిధ్యంలో విశేషతను సంతరించుకుందని వన్యప్రాణి విభాగ అధికారులు చెబుతున్నారు. ఈ పాముకు ఉప జాతులేమీ ఇంతవరకూ గుర్తించ లేదు. ఇటువంటి లక్షణాలున్న పాము కోరంగి అభయారణ్యంలో రికార్డు కావడంతో దీని పరిరక్షణ కోసం వన్యప్రాణి విభాగం ప్రజలకు అవగాహన కల్పించేందుకు సమాయత్తమవుతోంది.

మగ పాము గరిష్టంగా 575 మిల్లీమీటర్లు (22.6 అంగుళాలు) పొడవున పెరుగుతాయని నిర్దారించారు. వీటి తోక పొడవు 120 మిల్లీమీటర్లు (4.7 అంగుళాలు) పైనే ఉంటుంది. ఆడ పాము అయితే గరిష్టంగా 1,045 మిల్లీమీటర్లు (41.1 అంగుళాలు) పొడవు, తోక చూస్తే 165 మిల్లీమీటర్లు (6.5అంగుళాలు) పొడవు ఉంటుంది. మగ పాము కంటే ఆడపాము పొడవు ఎక్కువగా ఉంటుంది.

పర్యాటకులకు

అవగాహన కల్పిస్తున్నాం

మడ అడవులకు వచ్చే పర్యాటకులకు ఈ విషయంలో ముందు జాగ్రత్తలు చెబుతాం. చెట్లు ఎక్కవద్దు, లోపలకు వెళ్ళవద్దంటూ హెచ్చరించి పంపిస్తాం. ఒకవేళ ఈ పాము కాటు వేస్తే వెంటనే వైద్య సహాయం పొందాలి. ఈ పాము కరవగానే విరుగుడుకు ఇంజక్షన్‌ చేయించాలి. ఈ ఇంజక్షన్‌ కోరంగి అభయారణ్యం సమీపాన తాళ్లరేవు పీహెచ్‌సీ లేదా కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రిలో ఉంటుంది. కాలు మీద కాటేస్తే ఎక్కువగా నడవకూడదు. కట్టుకట్టకుండా ఆస్పత్రికి తరలించాలి. ఈ విషయాలపై ముందుగా అవగాహన కల్పిస్తున్నాం.

– ఎస్‌ఎస్‌ఆర్‌ వరప్రసాద్‌, అటవీ రేంజర్‌,

వన్యప్రాణి విభాగం, కోరంగి అభయారణ్యం, కాకినాడ

ఫ అత్యంత విషపూరితం

ఫ కాటేస్తే ప్రాణానికే ప్రమాదం

ఫ పసర పాము అనుకునేరు

జాగ్రత్త సుమా!

ఫ భవిష్యత్తులో అంతరించిపోయే జాతిగా నిర్ధారణ

ఫ షెడ్యూల్‌ 4 నుంచి 1కి మార్పు

ఫ దేశంలో మూడో అతి పెద్ద కోరింగ అభయారణ్యంలో గుర్తింపు

ఫ పరిరక్షణకు నడుం బిగించిన వన్యప్రాణి విభాగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement