లూజ్‌ పెట్రోల్‌ విక్రయాలు వద్దు | Sakshi
Sakshi News home page

లూజ్‌ పెట్రోల్‌ విక్రయాలు వద్దు

Published Thu, May 23 2024 12:45 AM

లూజ్‌ పెట్రోల్‌ విక్రయాలు వద్దు

అమలాపురం రూరల్‌: ఎన్నికల పోలింగ్‌ అనంతరం హింసాత్మక సంఘటనల నేపథ్యంలో జిల్లాలోని బంకులు, బహిరంగ మార్కెట్‌లో లూజ్‌ పెట్రోల్‌ విక్రయాలు, మందుగుండు సామగ్రి తయారీ, అమ్మకాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.నూపుర్‌ అజయ్‌ సూచించారు. ఈ విషయమై బుధవారం అమలాపురం కలెక్టరేట్‌లో వర్తకులు, పోలీసు, అగ్నిమాపక విపత్తుల స్పందన విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ యంత్రాంగం ముందుకు సాగాలన్నారు. వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపు సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఎక్కడా అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా లూజ్‌ పెట్రోలు విక్రయాలను, మందుగుండు తయారీ, అమ్మకాలను 15 రోజుల పాటు నిషేధించామని స్పష్టం చేశారు. జిల్లా అడ్మిన్‌ ఎస్పీ ఎస్‌.ఖాదర్‌ బాషా మాట్లాడుతూ ప్రస్తుతం గోదాములలో నిల్వ ఉన్న క్రాకర్స్‌ను నమోదు చేసి సీళ్లు వేయించాలని డీఎస్పీలను ఆదేశించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

మందుగుండు విక్రయాలు, నిల్వలు నిషిద్ధం

అమలాపురం టౌన్‌: జిల్లాలో జూన్‌ 10వ తేదీ వరకూ బాణసంచా విక్రయాలు, నిల్వలు నిషిద్ధమని వాటి తయారీ కేంద్రాల నిర్వాహకులకు జిల్లా ఎస్పీ సుసరాపు శ్రీధర్‌ తెలిపారు. ఈ ఆంక్షలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాట్రేనికోన మండలం చెయ్యేరు శ్రీనివాస ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈవీఎంల స్ట్రాంగ్‌ రూమ్‌లను, ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను ఆయన బుధవారం పర్యవేక్షించారు. అక్కడ ఏర్పాట్లపై డీఎస్పీలు, సీఐలకు పలు సూచనలు చేశారు. ఇదిలా ఉంటే జిల్లాలో అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా క్యాసో తనిఖీలు కొనసాగాయి. ఐ.పోలవరం, కాట్రేనికోన మండలాల్లోని సమస్యాత్మక గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి లైసెన్స్‌లు లేని 24 మోటారు సైకిళ్లు, ఒక ఆటోను సీజ్‌ చేశారు. అమలాపురం తాలూకా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నల్లమిల్లి గ్రామంలోని రాజీవ్‌ గృహకల్ప కాలనీ వద్ద తనిఖీలు నిర్వహించి లైసెన్స్‌లు లేని 10 మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఉప్పలగుప్తం పోలీస్‌ స్టేషన్‌ పరిఽధి వాసాలతిప్పలో లైసెన్స్‌లు లేని 14 మోటారు సైకిళ్లు, పి.గన్నవరం పోలీస్‌ స్టేషన్‌ పరిధి గాజులగుంట తదితర గ్రామాల్లో రెండు, రామచంద్రపురం పోలీస్‌ స్టేషన్‌ పరిఽధి రాజబాబు నగర్‌లో 20, మండపేట రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి చిన ద్వారపూడి తదితర సమస్యాత్మక గ్రామాల్లో ఆరు మోటారు సైకిళ్లు సీజ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement