రీల్స్‌ మోజులో ప్రాణం పోయింది | Youth dies while doing bike stunts for reels | Sakshi
Sakshi News home page

రీల్స్‌ మోజులో ప్రాణం పోయింది

Jul 22 2024 2:38 AM | Updated on Jul 22 2024 2:38 AM

Youth dies while doing bike stunts for reels

బైక్‌ అదుపుతప్పి యువకుడి దుర్మరణం  

లింగోజిగూడ/వర్ధన్నపేట: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ కోసం బైక్‌పై చేసిన స్టంట్‌ అదుపుతప్పి ఒక యువకుడు ప్రాణాలు కోల్పోగా, మరో యువకుడు ఆసుపత్రి పాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు కోనాపురానికి చెందిన మేడ రాజు, మహబూబీ దంపతులు బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వలస వచ్చారు. ఎల్‌బీనగర్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ కాలనీలో నివాసముంటున్నారు.

మేడ రాజు కుమారుడు శివ (19) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శనివారం సాయంత్రం తన స్నేహితులు సంపత్, పవన్, విజయ్‌తో కలిసి బైక్‌లపై ఎల్‌బీనగర్‌ పెద్దఅంబర్‌పేట వైపు బయల్దేరారు. కేటీయం బైక్‌ ను శివ నడుపుతుండగా సంపత్‌ వెనుక కూర్చున్నాడు. శివ తన బైక్‌తో రీల్స్‌ కోసం స్టంట్లు చేస్తుండగా, మరో బైక్‌పై ఉన్న పవన్, విజయ్‌లు వీడియో తీస్తున్నారు. హయత్‌నగర్‌ లక్ష్మారెడ్డిపాలెం వద్ద శివ నడుపుతున్న బైక్‌.. స్కూటర్‌ను ఢీ కొట్టడంతో అదుపుతప్పి కిందపడ్డారు.

శివ, సంపత్‌లకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. శివ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. తీవ్రగాయాలతో సంపత్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శివ మృతదేహాన్ని ఆదివారం రాత్రి స్వగ్రామం కోనాపురానికి తరలించారు. హయత్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement