అటు ప్రమాణం.. ఇటు విధ్వంసం | The TDP ranks are agitated across the state | Sakshi
Sakshi News home page

అటు ప్రమాణం.. ఇటు విధ్వంసం

Published Thu, Jun 13 2024 6:10 AM | Last Updated on Thu, Jun 13 2024 6:10 AM

The TDP ranks are agitated across the state

రాష్ట్రవ్యాప్తంగా రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు

ప్రభుత్వ భవనాల పేరు మార్పు  

శిలాఫలకాల ధ్వంసం.. విగ్రహాల కూల్చివేత  

ప్రభుత్వ ఆఫీసులపై టీడీపీ జెండాలు 

వైఎస్సార్‌సీపీ జెండాదిమ్మెల ధ్వంసం  

నెల్లూరు జిల్లా శంకరనగరం సర్పంచ్‌పై మారణాయుధాలతో టీడీపీ దాడి 

సర్పంచ్‌ సహా ఆరుగురికి గాయాలు  

వీరిలో ముగ్గురికి తీవ్రగాయాలు 

సర్పంచ్‌ ఇంట్లో సామగ్రి ధ్వంసం  

సాక్షి నెట్‌వర్క్‌: ఒకవైపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ, జనసేన, కూటమి శ్రేణులు మరింత రెచ్చిపోయి విధ్వంసా­లకు దిగాయి. పలు ప్రభుత్వ కార్యాలయాల పేర్లు మార్చేశారు. ప్రగతి పనుల శిలాఫలకాలను ధ్వంసం చేశారు. విగ్రహాలను నేలకూల్చారు. కొన్ని ప్రభుత్వ కార్యాలయాల భవనాలపై టీడీపీ జెండాలు కట్టారు. వైఎస్సార్‌సీపీ జెండాదిమ్మెల్ని ధ్వంసం చేశారు. అనంతపురం రూరల్‌ మండలం కాటిగానికాలువ గ్రామంలో రైతుభరోసా కేంద్రం (ఆర్బీకే) శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో కొందరు టీడీపీ కార్యకర్తలు కాటిగానికాలువ రైతుభరోసా కేంద్రంలోకి కేక్‌ తీసుకొచ్చి కట్‌ చేశారు. అనంతరం బయటకు వచ్చి అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఒక మహిళ చేతికి సుత్తి ఇచ్చి పగులగొట్టించారు. తర్వాత ఇద్దరు కార్యకర్తలు ఆ శిలాఫలకాన్ని బయటకు తీసుకెళ్లి పూర్తిస్థాయిలో ధ్వంసం చేశారు. సచివాలయ భవనంపైకెక్కి టీడీపీ జెండా కట్టారు. సమాచారం అందుకున్న రూరల్‌ పోలీసులు అక్కడికి చేరుకుని ప్రభుత్వ కార్యాలయ భవనంపై కట్టిన టీడీపీ జెండాను పీకేయించారు. 

ఈ ఘటనపై మహిళా పోలీసు మౌనిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన కేసులో వీడియో ఆధారంగా అదే గ్రామానికి చెందిన లక్ష్మీదేవి, రామాంజనేయులు, చంద్రమౌళినాయుడుపై కేసు నమోదు చేసినట్లు సీఐ రామకృష్ణారెడ్డి తెలిపారు. అలాగే కొందరు బెదిరింపులకు దిగుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. ఎవరైనా బెదిరిస్తే బాధితులు నేరుగా పోలీసులను సంప్రదించాలని సూచించారు. బెదిరించేవారిపట్ల పోలీసు­శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. 

»  కాకినాడ జిల్లాలోని పెద్దాపురం మండలం ఉలిమేశ్వరం గ్రామంలో విధ్వంసానికి పాల్ప­డ్డారు. మంత్రివర్గ ప్రమాణస్వీకారాన్ని ప్రజలు చూసేందుకు పంచాయతీ అధికారులు రైతు­భరోసా కేంద్రంలో ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ మాజీ సభ్యుడు పేకేటి దొర­బాబు, తదితరులు అక్కడున్న ఆర్‌బీకే ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. 

కార్యా­లయంలోని కరపత్రాలు, అధికారిక పత్రాలను తగులబెట్టారు. ఇదెక్కడి దౌర్జన్యం అంటూ సర్పంచ్‌ భర్త ఆకుల వీరబాబు నిలదీశారు. దీంతో దొరబాబు, వీరబాబు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సీఐ రవికుమార్, ఎస్‌ఐ వెలుగుల సురేష్‌ అక్కడికి చేరుకుని రెండు వర్గాలను చెదరగొట్టారు. పోలీస్‌ పికెట్‌ను ఏర్పాటు చేశారు. 

»   చిత్తూరు జిల్లా నిండ్ర మండలంలోని అగరం గ్రామ పంచాయతీలో సచివాలయం భవనం ప్రారంభోత్సవం నాడు ఏర్పాటు చేసిన శిలాఫల­కాన్ని ధ్వంసం చేశారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, అప్పటి మంత్రి రోజా పేరిట ఉన్న శిలాఫలకాన్ని పగులగొట్టారు. ఈ విషయమై బుధవారం స్థానికులు అధికారులకు ఫిర్వాదు చేశారు. 

»  తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) కార్యాల­యానికి ఉన్న డాక్టర్‌ వైఎస్సార్‌ పేరును దౌర్జన్యంగా తొలగించారు. ఆ స్థానంలో ఎన్టీఆర్‌ పేరు ఏర్పా­టు చేశారు. కార్యాలయం లోపల ఉన్న వైఎస్సార్‌ ఫొటో అక్కడి నుంచి తొలగించారు. 

» కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని ఈడేపల్లిలో శిశు విద్యామందిర్‌ వద్ద ఉన్న 45వ డివిజన్‌ సచివాలయానికి పసుపు పచ్చని నూతన బోర్డు ఏర్పాటు చేశారు. ఆ డివిజన్‌ టీడీపీ నాయకుడు పి.వి.ఫణికుమార్‌తో కలిసి నాయకులు, కార్యకర్తలు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి పవన్‌కళ్యాణ్, ఎంపీ వల్లభనేని బాలశౌరి చిత్రాలతో తయారు చేసిన సచివాలయం బోర్డు ఏర్పాటు చేశారు. బోర్డు ఏర్పాటుకు సచివాలయ సిబ్బంది సహకరించారు. ఫణికుమార్‌ కేక్‌ కట్‌ చేశారు. 

» శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం నెల్లూరులోని 54వ డివిజన్‌ జనార్దన్‌రెడ్డికాలనీలో వైఎస్సార్‌సీపీ జెండాను, స్థూపాన్ని, శిలాఫల­కాన్ని ధ్వంసం చేశారు. ఘటనా స్థలాన్ని నెల్లూరు మున్సిపల్‌ కో ఆప్షన్‌ సభ్యుడు, వైఎస్సార్‌సీపీ నాయకుడు ఎస్‌కే జమీర్‌అహ్మద్, పలువురు పార్టీ నాయకులు పరిశీలించారు. 

» చిత్తూరు జిల్లా కుప్పం మండలం కొత్తయిండ్లు గ్రామంలో వైఎస్సార్‌సీపీ జెండాను ధ్వంసం చేశారు. మొదటి నుంచి టీడీపీకి పట్టున్న గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలను గెల్చుకున్న వైఎస్సార్‌సీపీ వర్గీయులు జెండా ఎగురవేసారు. అప్పటి నుంచి వైఎస్సార్‌­సీపీపై అక్కసు వ్యక్తంచేస్తున్న టీడీపీ నాయకులు మంగళవారం రాత్రి జెండా పీకేసి స్థూపాన్ని ధ్వంసం చేశారని స్థానికులు తెలిపారు. 

»  శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం ఆర్‌.­హెచ్‌.పురంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని మంగళవారం రాత్రి కూల్చివేశారు. గ్రామంలో టీడీపీ విజయో­త్సవ ర్యాలీ నిర్వహించిన అనంతరం విద్యుత్‌ సర­ఫరా నిలిపేసి సుమారు 15 మంది టీడీపీ కార్య­కర్తలు వైఎస్సార్‌ విగ్రహాన్ని తొలగించి పొద­ల్లో పడేశారు. దీనిపై కలెక్టర్‌కు, ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు వైఎస్సార్‌సీపీ నేత­లు తెలిపా­రు.

»  ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం గ్రామంలో తెలుగుదేశం, జనసేన నాయకులు బుధవారం గ్రామంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు కార్యకర్తలు సచివాలయం–2 భవనం ప్రారంభ సమయంలో ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్య­కర్తల ఇళ్ల వద్ద బాణసంచా కాలుస్తూ భయభ్రాంతులకు గురిచేశారు. దీనిపై వైఎస్సార్‌సీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామంలో పోలీసు పికెట్‌ ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఐ మణికుమార్‌ చెప్పారు. 

» తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడి­య­పుసావరం గ్రామంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతల విజయోత్సవ ర్యాలీ శృతితప్పింది. మోటారు సైకిళ్లపై ర్యాలీలో పాల్గొన్న కార్యకర్తలు గ్రామంలోని జక్కంపూడి గ్రామ మోహ­న్‌రావు మల్టీపర్పస్‌ సెంటర్‌ గేట్లు తెరుచు­కుని గ్రౌండ్‌లోకి ప్రవేశించారు. అక్కడున్న ఫ్లెక్సీ­లను చించేశారు. కళ్యాణ మంటపం గోడపై మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు, జిల్లా వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా తదితరుల పేర్లున్న శిలాఫలకాన్ని లక్ష్యంగా చేసుకుని కొందరు రాళ్లు విసిరారు. దీంతో పలు కిటికీల అద్దా­లు ధ్వంసమ­య్యాయి. శిలాఫలకం పాక్షికంగా దెబ్బ­తింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement