డేటింగ్‌ యాప్‌లో పరిచయం; టెకీ ఇంటికి వచ్చి.. | Sakshi
Sakshi News home page

డేటింగ్‌ యాప్‌ ద్వారా‌ పరిచయం.. ఇంటికి వచ్చి

Published Thu, Mar 18 2021 3:57 PM

Man Steals Girlfriend Gold Jewellery Arrested In Mumbai - Sakshi

ముంబై: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిని ప్రేమిస్తున్నట్లు నటించి, నమ్మించి నగలతో ఉడాయించాడో వ్యక్తి. ఎవరూ లేని సమయంలో వాళ్ల ఇంటికి వెళ్లి, ఆమె తల్లి నగలను కాజేశాడు. యువతి ఫిర్యాదుతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాలు.. ఘట్కోపర్‌కు చెందిన టెకీకి డేటింగ్‌ యాప్‌లో గతేడాది సౌరభ్‌ ఠాకూర్‌(35) అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తాను డాక్టర్‌నని నమ్మించాడు. కొన్నాళ్లపాటు స్నేహం చేసిన తర్వాత ఇద్దరి అభిరుచులు కలవడంతో వివాహం చేసుకోవాలని భావించారు. ఈ క్రమంలో ప్రియురాలి తల్లిదండ్రులను కలిసి, వారిని పెళ్లికి ఒప్పిస్తానంటూ కొన్ని రోజుల క్రితం ఆమె ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో యువతి ఒంటరిగా ఉండటాన్ని గమనించి తన ప్లాన్‌ అమలు చేశాడు.

తన కోసం తీసుకువచ్చిన బహుమతి కారులో మర్చిపోయానని, దానిని తీసుకురావాలంటూ ఆమెను బయటకు పంపించాడు. వెంటనే బీరువా దగ్గరికి వెళ్లి, బాధితురాలి తల్లికి సంబంధించిన, సంప్రదాయంగా వస్తున్న నగలను తీసుకుని, ఏమీ ఎరగనట్టు కూర్చున్నాడు. ఆ తర్వాత యువతితో కాసేపు మాట్లాడి వెళ్లిపోయాడు. ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత యువతి నగల కోసం వెదకగా అసలు విషయం బయటపడింది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. యువతి చెప్పిన వివరాల ఆధారంగా సౌరభ్‌ను గుర్తించి పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

అతడు కాజేసిన నగల విలువ ఆరున్నర లక్షలు ఉంటుందని, వాటిని రికవరీ చేయనున్నట్లు పోలీసులు వెల్లడించారు. బాధితురాలికి డాక్టర్‌ను అని చెప్పుకొన్న సౌరభ్‌, బయట పోలీసుగా, హోం మంత్రి కార్యాలయంలో పనిచేసే ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు ఫేక్‌ ఐడీ క్రియేట్‌ చేసి పలువురిని తప్పుదోవ పట్టించినట్లు గుర్తించారు. ఖరీదైన కారులో తిరుగుతూ, ధనవంతుడినని నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా భారత వైద్య పరిశోధన మండలిలో డాక్టర్‌గా నమోదు చేసుకున్నానని అతడు విచారణలో చెప్పాడని, ఇందుకు సంబంధించి నిజాలు నిర్ధారించే పనిలో ఉన్నట్లు వెల్లడించారు. 

చదవండి: రాసలీలల కేసు: ప్రైవేటు ఉద్యోగిని.. వారితో పరిచయాలు!?

Advertisement
Advertisement