కిడ్నీ బాధితులకు అండగా.. | Sakshi
Sakshi News home page

కిడ్నీ బాధితులకు అండగా..

Published Mon, Apr 8 2024 12:45 AM

నగరి ఏరియా ఆస్పత్రిలో డయాలసిస్‌ చేయించుకుంటున్న రోగులు  - Sakshi

కిడ్నీ రోగులకు సరైన వైద్యం అందక,

చికిత్స కోసం దూర ప్రాంతాలకు ప్రయాణం చేయలేక, ఆర్థిక స్తోమతతో ఇబ్బంది పడే కిడ్నీ బాధితుల యాతన అంతాఇంతా కాదు. వారి దీనస్థితిని చూసి చలించిన మంత్రి ఆర్కేరోజా నగరిలోనే డయాలసిస్‌ వార్డు ఏర్పాటు చేయించాలని సంకల్పించారు. 2019లో

వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడంతో

ఆ దిశగా అవిశ్రాంత కృషి చేస్తూ వచ్చారు. ప్రస్తుతం నగరి ఏరియా ఆస్పత్రిలో

డయాలసిస్‌ అందుబాటులోకి వచ్చింది.

నగరి : రాష్ట్రవ్యాప్తంగా డయాలసిస్‌ రోగులను ఆదుకోవడానికి డయాలసిస్‌ సెంటర్లు పెంచేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికను రచించింది. రాష్ట్రవ్యాప్తంగా 61 డయాలసిస్‌ సెంటర్లు పెట్టి వాటి ద్వారా 515 డయాలసిస్‌ పరికరాలు అందుబాటులోకి తెచ్చి రాష్ట్రంలో పది వేలకు పైగా కిడ్నీ బాధితుకు లబ్ధి చేకూర్చే పనులను వేగంగా మొదలుపెట్టింది. ఇందులో భాగంగా నగరి ఏరియా ఆస్పత్రికి డయాలసిస్‌ సెంటర్‌ను తీసుకురావడంతో మంత్రి ఆర్కే రోజా సఫలీకృతులయ్యారు. రూ.50 లక్షల వ్యయంతో ఐదు డయాలసిస్‌ యంత్రాలతో నగరిలో డయాలసిస్‌ సెంటర్‌ను ఏర్పాటుచేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో నగరి రాజకీయ చరిత్రలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మంత్రి ఆర్‌కే రోజా డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటుతో మరోమెట్టు పైకెక్కారు. నగరి నియోజకవర్గంతో పాటు పరిసర నియోజకవర్గాల నుంచి సుమారు 500 రోగులు డయాలసిస్‌ వార్డులో ప్రస్తుతం సేవలు అందుకుంటున్నారు. ఇదివరలో స్థానికంగా డయాలసిస్‌ వార్డు లేకపోవడంతో పేషంట్లు చైన్నె, తిరుపతి, చిత్తూరు, శ్రీకాళహస్తి తదితర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. డయాలసిస్‌ అనేది నిరంతర ప్రక్రియ కావడంతో ప్రైవేటు వాహనాలకు బాడుగల చెల్లింపు రూపంలో అధిక మొత్తంలో ఖర్చుచేయాల్సి రావడం, అలా వాహనాల్లో వెళ్లి తిరిగి వచ్చేసరికి అలసిపోయేవారు.

వ్యయప్రయాసలకు ఓర్చి..

కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారు వారానికి మూడు లేదా నాలుగుసార్లు డయాలసిస్‌ చేసుకోవాల్సి వస్తుండగా ఇందుకు రూ.10 వేల నుంచి రూ.12వేలు ఖర్చు పెట్టుకునేవారు కూడా ఉన్నారు. నగరిలోనే డయాలసిస్‌ ఏర్పాటు చేస్తుండడంతో కిడ్నీ బాధితుల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. నేడు వారు స్థానిక ఏరియా ఆస్పత్రిలో ఉచితంగా డయాలసిస్‌ చేసుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

నగరిలో డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటు

ఫలించిన మంత్రి ఆర్‌కే రోజా కృషి

కిడ్నీ బాధితులకు సీఎం జగన్‌ సర్కారు అండ

రూ.10 వేల పింఛన్‌ ఇచ్చి

ఆదుకుంటున్న ప్రభుత్వం

వ్యయ, ప్రయాసలు తగ్గడంతో ఆనందం వ్యక్తం చేస్తున్న కిడ్నీ బాధితులు

Advertisement
Advertisement