
మనీ మేనేజ్‌మెంట్ ఒక కళ. జీవితంలో సరైన సమయంలో సరైన ఆర్థిక పరమైన నిర్ణయం తీసుకోకపోతే చాలా నష్టపోవాల్సి వస్తుంది. అలాంటి సబ్జెక్టును పిల్లలకు దురదృష్టవశాత్తు పాఠశాలల్లో చాలా అరుదుగా నేర్పిస్తారు. పిల్లలు కూడా మనకెందుకులే ఇప్పుడే నేర్చుకోవడం అనే ధోరణితో ఉన్నారు. కానీ అది సరికాదు. పాఠశాలల్లో వీలుకాని ఆర్థిక పాఠాల్ని ఇంట్లోనే నేర్చుకోవాలి. ఈ విషయాలపై పిల్లలకు ఎంత తొందరగా అవగాహన కలిగి ఉంటే అంత మంచిది. ఈ క్రమంలో ఎలాంటి ప్రతికూల ఆలోచనలు రాకుండా జాగ్రత్త పడాలి. చిన్న వయసులో పిల్లలు నేర్చుకోవాల్సిన కొన్ని ఆర్థిక అంశాల గురించి తెలుసుకుందాం.
డబ్బు సంపాదనపై స్పష్టత
జీవితంలో డబ్బు పాత్ర ఎమిటో వివరంగా తెలుసుకోవాలి. భవిష్యత్తులో ఎలా ఈ డబ్బు సంపాదిస్తారో స్పష్టత ఏర్పరుచుకోవాలి. అందుకు ఎలాంటి మార్గాలను ఎంచుకుంటారో ముందే అవగాహన కల్పించుకోవాలి. ఈ దశలోనే అవసరాలు, సౌకర్యాలకు మధ్య తేడా ఏంటో తెలుసుకోవాలి.
పొదుపుతో లాభాలు
రూపాయి ఖర్చు చేయడం మానేస్తే.. రూపాయి సంపాదించినట్లే.. ఈ సూత్రం పిల్లలు ఎప్పుడూ గుర్తించుకోవాలి. ప్రతి రూపాయి విలువను అర్థం చేసుకోవాలి. పొదుపు చేస్తే వచ్చే లాభాలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలి. ఇంట్లో చిన్నచిన్న పనులు చేస్తున్నప్పుడు అమ్మానాన్నలు వచ్చే మనీని పొదుపు చేసి అత్యవసరమైన వస్తువులను వీరిపై ఆధారపడకుండా కొనుగోలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. అలాంటప్పుడు డబ్బు విలువ అర్థం అవుతుంది.
పెట్టుబడులపై అవగాహన
పొదుపు, ఖర్చుపై అవగాహన వచ్చాక మెల్లిగా పెట్టుబడులకు సంబంధించిన అంశాలను తెలుసుకోవాలి. పోస్టాఫీసుల్లో అకౌంట్ ఓపెన్ చేసేలా పిల్లల కోసం ప్రత్యేకంగా సేవింగ్స్ పథకాలున్నాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లు వంటి చిన్న చిన్న పెట్టుబడి మార్గాల్ని అలవరుచుకోవాలి.
ఆర్థిక ప్రణాళిక
ఆదాయానికి తగ్గట్టే ఖర్చు చేయాలన్న సూత్రాన్ని ప్రధానంగా తెలుసుకోవాలి. అందుకోసం ఆర్థిక ప్రణాళిక ఎలా వేసుకోవాలో నేర్చుకోవాలి. ఇంట్లో ఆదాయం.. దాన్ని ఎలా ఖర్చు చేస్తున్నాం.. వంటి విషయాల్ని అవగాహన చేసుకోవాలి.
ఇదీ చదవండి: ఐటీఆర్ గడువు తేదీ పొడిగింపు.. విస్తుగొలిపే కారణాలు
అప్పు గురించి తెలుసుకోవాలి..
ఇంట్లో అత్యవసర సమయంలో ఆర్థిక అవసరాల కోసం తీసుకునే రుణాలకు సంబంధించిన వివరాలను పిల్లలు తెలుసుకోవాలి. ఎలాంటి సమయంలో అప్పు చేయాలి? అప్పు చేయడం ద్వారా ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతాయి.. అప్పు చేయకుండా ఉండాలంటే ఎలా మెదలాలి.. వంటి అంశాలను తెలుసుకోవాలి.