ఖరీదైన గృహాలలో రెండో స్థానంలో భాగ్యనగరం

PropTiger Survey Details About Realty in 7 Metro Cities - Sakshi

తొలిస్థానంలో ముంబై; థర్డ్‌ ప్లేస్‌లో బెంగళూరు 

హైదరాబాద్‌లో చ.అ. ధర సగటు రూ.5,900–6,100 

బెంగళూరులో రూ.5,500–5,700 

ప్రాప్‌టైగర్‌ సర్వేలో వెల్లడి   

సాక్షి, హైదరాబాద్‌:  హైదరాబాద్‌లో శ్రీమంతులు ఏ స్థాయిలో పెరుగుతున్నారో... అదే రీతిలో గృహాలు ఖరీదవుతున్నాయి. దేశంలోని హై నెట్‌వర్త్‌ ఇండివిడ్యువల్స్‌ ఉన్న నగరాలలో హైదరాబాద్‌ రెండో స్థానంలో నిలవగా.. కాస్లీ ప్రాపర్టీలలోనూ ఇదే ప్లేస్‌లో నిలిచింది. గతేడాది పండుగ సీజన్స్‌ నేపథ్యంలో నగర స్థిరాస్తి మార్కెట్‌లో సానుకూల వాతావరణం నెలకొంది. దీంతో గృహాల సరఫరా, కొనుగోళ్లు పెరిగాయి. ఆర్థిక వ్యవస్థ స్థిరపడటం, ఉద్యోగ భద్రత పెరగడం, కొత్త ఉద్యోగ అవకాశాల కల్పన, మెరుగైన మౌలిక వసతులు వంటి వాటితో ఈ ఏడాది నగర రియల్టీ మార్కెట్‌కు సరికొత్త పథంలోకి దూసుకెళుతుందని రియల్‌ ఎస్టేట్‌ అడ్వైజర్‌ ప్రాప్‌టైగర్‌ అంచనా వేసింది. 

అల్ట్రా హై నెట్‌వ‍ర్త్‌లో
గతేడాది హైదరాబాద్‌లో అల్ట్రా హై నెట్‌వర్త్‌ ఇండివిడ్యువల్స్‌ (యూహెచ్‌ఎన్‌ఐ) సంఖ్య 467కి చేరింది. 2026 నాటికి 56 శాతం వృద్ధి రేటుతో 728కి చేరుతుందని ప్రాపర్టీ కన్సల్టెంట్‌ నైట్‌ఫ్రాంక్‌ ఇండియా వెల్త్‌ రిపోర్ట్‌–2022 వెల్లడించింది. 2016లో నగరంలో యూఎన్‌హెచ్‌ఐల సంఖ్య 314గా ఉంది. 30 మిలియన్‌ డాలర్లు (రూ.225 కోట్లు) కంటే ఎక్కువ ఆదాయం ఎక్కువ ఉన్న  వాళ్లను యూహెచ్‌ఎన్‌ఐలుగా పరిగణిస్తుంటారు. తొలి స్థానంలో నిలిచిన ముంబైలో 1,596 మంది యూహెచ్‌ఎన్‌ఐలున్నారు. 

ధర చ.అ.కు రూ.5,900 – 6,100 
దేశంలో ఖరీదైన గృహాలలో తొలి స్థానంలో ముంబై నిలవగా.. హైదరాబాద్‌ రెండో స్థానానికి చేరింది. హైదరాబాద్‌ ప్రాపర్టీల ధరలు పెరిగిపోతున్నాయి. గతేడాది నాల్గో త్రైమాసికం (అక్టోబర్‌ – డిసెంబర్‌)లో నగరంలో స్థిరాస్తి ధరలు 7 శాతం మేర పెరిగాయి. పెరిగిన ధరల తర్వాత దేశంలోనే అత్యంత ఖరీదైన గృహాల నగరాలలో ముంబై తర్వాత హైదరాబాద్‌ నిలిచిందని ప్రాప్‌టైగర్‌ తెలిపింది. కరోనా మహమ్మారి తర్వాత 2020 ప్రారంభంలో రవాణా పరిమితుల నేపథ్యంలో నిర్మాణ సామగ్రి రేట్లు పెరిగాయి. దీంతో కొత్త అపార్ట్‌మెంట్ల వార్షిక ధరలలో వృద్ధి నమోదయిందని పేర్కొంది. ప్రస్తుతం నగరంలో సగటు ధర చ.అ.కు రూ.5,900 నుంచి 6,100లుగా ఉంది. గతేడాది క్యూ4లో  అహ్మదాబాద్‌తో సహా నగరంలో అత్యధిక ధరల ర్యాలీ నమోదయిందని ప్రాప్‌టైగర్‌ బిజినెస్‌ హెడ్‌ రాజన్‌ సూద్‌ తెలిపారు. 

లాంచింగ్, సేల్స్‌లో బాచుపల్లి హాట్‌స్పాట్‌.. 
2020 క్యూ4తో పోలిస్తే గతేడాది క్యూ4లో హైదరాబాద్‌లో గృహాల విక్రయాలలో 36 శాతం వృద్ధి రేటు కనిపించింది. 2020 నాల్గో త్రైమాసికంలో 16,400 యూనిట్లు విక్రయం కాగా.. గతేడాది అక్టోబర్‌ – డిసెంబర్‌లో 22,239 గృహాలు అమ్ముడుపోయాయి. బాచుపల్లి, తెల్లాపూర్, మియాపూర్‌ ప్రాంతాలు గృహ కొనుగోలుదారులు అత్యంత ప్రాధాన్యమిచి్చన ప్రాంతాలుగా నిలిచాయి. 3 బీహెచ్‌కే కొనుగోళ్లకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. 2021 క్యూ4లోని గృహ విక్రయాలలో 3 బీహెచ్‌కే వాటా 48 శాతంగా ఉంది.  హైదరాబాద్‌ స్థిరాస్తి మార్కెట్‌లో సెంటిమెంట్‌ బలపడుతుండటంతో కొత్త ప్రాజెక్ట్‌ల లాంచింగ్స్‌లోనూ రెట్టింపు వృద్ధి నమోదయింది. 2020 క్యూ4లో 22,940 యూనిట్లు ప్రారంభం కాగా.. గతేడాది నాల్గో త్రైమాసికం నాటికి 48,566 గృహాలు లాంచింగ్‌ అయ్యాయి. మెజారి టీ యూనిట్ల లాంచింగ్స్‌ పుప్పాలగూడ, మియాపూర్, బాచుపల్లి ప్రాంతాలలోనే జరిగాయి. కొత్తగా ప్రారంభమైన గృహాలలో 36% రూ. కోటి కంటే ఎక్కువ ధర ఉన్న గృహాలే ఉన్నాయి. 

చదవండి: రియల్‌ ఎస్టేట్‌లోకి విదేశీ పెట్టుబడుల వరద

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top