పోస్టాఫీసు స్కీములు.. వడ్డీ రేట్ల ప్రకటన | Post Office schemes PPF SSY SCSS FD NSC interest rates unchanged for Q2 FY26 | Sakshi
Sakshi News home page

పోస్టాఫీసు స్కీములు.. వడ్డీ రేట్ల ప్రకటన

Jun 30 2025 8:11 PM | Updated on Jun 30 2025 9:12 PM

Post Office schemes PPF SSY SCSS FD NSC interest rates unchanged for Q2 FY26

పోస్టాఫీసుల ద్వారా నిర్వహిస్తున్న పలు పొదుపు స్కీములకు సంబంధించిన వడ్డీ రేట్లపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో దేశంలోని ప్రసిద్ధ చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు యథాతథంగా ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్లో తెలిపింది. అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎసీఎస్ఎస్), సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్‌వై) వంటి సాధనాలపై ఆధారపడిన పొదుపుదారులకు ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో వారి రాబడిలో ఎలాంటి మార్పులు కనిపించవు.

పన్ను ప్రయోజనాలు, దీర్ఘకాలిక పొదుపు సామర్థ్యానికి ప్రసిద్ధి చెందిన ప్రభుత్వ మద్దతు పథకం పీపీఎఫ్ గత త్రైమాసికంలో మాదిరిగానే వడ్డీ రేటును కొనసాగిస్తుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎసీఎస్ఎస్), సుకన్య సమృద్ధి సమృద్ధి స్కీమ్‌లకు ఆకర్షణీయమైన వార్షిక రేటును 8.2% కొనసాగుతుంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ లో ఇన్వెస్టర్లు 7.7 శాతం, పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (పీవోఎంఐఎస్) 7.4 శాతం వద్ద స్థిరంగా ఉన్నాయి. కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ) కూడా మారలేదు. ఇది 115 నెలల మెచ్యూరిటీ వ్యవధితో 7.5% రేటును అందిస్తుంది.

ఇక పోస్టాఫీస్ సేవింగ్స్ డిపాజిట్లపై 4 శాతం వడ్డీ లభిస్తుంది. క్రమం తప్పకుండా నెలవారీ పొదుపునకు అవకాశం ఉండే ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్ (ఆర్‌డీ) పథ​కం 6.7% వడ్డీ రేటును అందిస్తుంది. ఈ చిన్న మొత్తాల పొదుపు పథకాలు గ్యారంటీ రాబడులను అందిస్తాయి, ఎంచుకున్న పథకం ఆధారంగా నెలవారీ, త్రైమాసిక లేదా వార్షిక ప్రాతిపదికన వడ్డీని జతచేస్తాయి.

ప్రధానంగా పోస్టాఫీసులు, బ్యాంకుల ద్వారా నిర్వహిస్తున్న ఈ చిన్న పొదుపు పథకాలు సురక్షితమైన, స్థిర-ఆదాయ రాబడిని కోరుకునే లక్షల మంది భారతీయులకు కీలక పెట్టుబడి సాధనాలు. శ్యామల గోపీనాథ్ కమిటీ సిఫారసు చేసిన విధంగా ప్రభుత్వ సెక్యూరిటీలపై రాబడులకు సంబంధించిన ఫార్ములాను ఉపయోగించి ప్రభుత్వం ప్రతి త్రైమాసికానికి వాటి రేట్లను సమీక్షిస్తుంది. అయితే మార్కెట్ రేట్లలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ఈ రేట్లను స్థిరంగా ఉంచాలని కేంద్రం నిర్ణయించింది.

పథకంవడ్డీ రేటు
పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్4%
పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్6.7%
పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్7.4%
పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ (1 సంవత్సరం)6.9%
ప్రస్థితి పోస్ట్ టైమ్ డిపాజిట్ (2 సంవత్సరాలు)7%
పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ (3 సంవత్సరాలు)7.1%
పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ (5 సంవత్సరాలు)7.5%
కిసాన్ వికాస్ పత్ర (కేవీయపీ)7.5%
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిపిఎఫ్)7.1%
సుకన్య సమృద్ధి యోజన8.2%
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్7.7%
సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్)8.2%

Advertisement
 
Advertisement
Advertisement