వైద్యసేవలపై రాష్ట్ర బృందం ఆరా.. | Sakshi
Sakshi News home page

వైద్యసేవలపై రాష్ట్ర బృందం ఆరా..

Published Thu, Nov 9 2023 12:20 AM

ప్రమాదంలో దెబ్బతిన్న కారు - Sakshi

బూర్గంపాడు: మండల పరిధిలోని మోరంపల్లిబంజర పీహెచ్‌సీని రాష్ట్ర మాతా శిశు సంరక్షణ బృందం బుధవారం సందర్శించింది. ఆస్పత్రిలో గర్భిణులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. కాన్పులు, ప్రభుత్వం అందిస్తున్న పథకాల తీరుతెన్నులను తెలుసుకున్నారు. తల్లి, బిడ్డల మరణాల రేటును పూర్తిగా తగ్గించాలని సూచించారు. రాష్ట్ర మాతా శిశు సంరక్షణ బృందం సభ్యులు డాక్టర్‌ అఖిల, డాక్టర్‌ కీర్తి, డాక్టర్‌ చైతన్య, డాక్టర్‌ లక్ష్మీసాహితి, డీపీఓ దుర్గ తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్‌ శాఖ అధికారులపై దాడి

టేకులపల్లి: విధులు నిర్వహిస్తున్న విద్యుత్‌ అధికారులపై దాడి చేసి విధులకు ఆటంకం కలిగించిన ఘటనపై టేకులపల్లి పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ జి.రమణారెడ్డి కథనం ప్రకారం.. బొమ్మనపల్లి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలోని కొత్తతండా(పి) గ్రామానికి చెందిన బోడ వీరన్‌ కుమార్‌ ఏడాది నుంచి విద్యుత్‌ బకాయి రూ.9,800 చెల్లించడం లేదు. గత నెల 31న ఉదయం వీరన్‌ ఇంటికి విద్యుత్‌ శాఖకు చెందిన లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగుల్‌ మీరా, జేఎల్‌ఎం దామర చరణ్‌, ఎలక్ట్రిషియన్‌ గోపి వెళ్లి బకాయి చెల్లించాలని కోరగా, ఆయన చెల్లించేందుకు నిరాకరించాడు. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి విద్యుత్‌ సర్వీసును తొలగిస్తుండగా వీరన్‌ అధికారులను బూతులు తిడుతూ, దాడికి పాల్పడి, విధులకు ఆటంకం కలిగించాడు. ఈ ఘటనపై బుధవారం జేఎల్‌ఎం ఫిర్యాదు చేయగా, ఎస్‌ఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

డివైడర్‌ను ఢీ కొట్టిన కారు

పాల్వంచ: డివైడర్‌ను కారు ఢీకొట్టిన సంఘటన మంగళవారం అర్ధరాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. భద్రాచలం వైపు నుంచి పాల్వంచ వైపు వస్తున్న కారు జగన్నాథపురం సమీపంలో డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో కారులోని వ్యక్తులకు స్వల్పగాయాలయ్యాయి. కారులో ఉన్న వారు ఇల్లెందుకు చెందిన వారుగా తెలిసింది. కారు ధ్వంసమైంది. సరైన సూచికలు లేక పోవడంతోనే డివైడర్‌ను కారు ఢీకొట్టిందని, ఇటీవల కాలంలో ఇక్కడ ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయని స్థానికులు పేర్కొంటున్నారు.

వైద్యసిబ్బందితో రాష్ట్ర మాతా శిశు సంరక్షణ బృందం
1/1

వైద్యసిబ్బందితో రాష్ట్ర మాతా శిశు సంరక్షణ బృందం

Advertisement
Advertisement