సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం కావాలి | Sakshi
Sakshi News home page

సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం కావాలి

Published Thu, May 9 2024 8:45 AM

సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం కావాలి

జిల్లా ఎన్నికల అధికారి పి.రంజిత్‌ బాషా

బాపట్ల: సార్వత్రిక ఎన్నికల్ని సమర్థంగా నిర్వహించడానికి అధికారులంతా సంసిద్ధం కావాలని జిల్లా ఎన్నికల అధికారి పి.రంజిత్‌బాషా తెలిపారు. ఎన్నికల నిర్వహణపై వివిధ విభాగాల నోడల్‌ అధికారులతో స్థానిక కలెక్టరేట్‌లో బుధవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ టీంలు మరింత పటిష్టంగా పనిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎస్‌ఎస్‌టీ టీంలు తనిఖీ చేసే ప్రాంతాల్ని ఎప్పటికప్పుడు మార్చాలని ఆయన ఆదేశించారు. ముఖ్యంగా నగదు, మద్యం, ఆభరణాలు వంటి బహుమతులు, ఇతర వస్తువుల్ని పంపిణీ చేయడాన్ని పూర్తిగా అరికట్టాలని చెప్పారు. గుర్తింపు కార్డుల్ని సంబంధిత ఓటర్ల చిరునామాలకు పంపామని, పోలింగ్‌ సిబ్బందికి కూడా శిక్షణలు పూర్తయ్యాయని తెలిపారు. 12వ తేదీ ఉదయాన్నే ఆయా నియోజకవర్గాలలోని డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాల వద్ద పోలింగ్‌ సిబ్బంది రిపోర్ట్‌ చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. పోలింగ్‌ సిబ్బంది, సూక్ష్మ పరిశీలకులు కలిసి పోలింగ్‌ కేంద్రానికి చేరుకునేలా పర్యవేక్షించాలని తెలిపారు. పోలింగ్‌ యంత్రాలు, సామగ్రి తరలించడానికి ఆర్టీసీ బస్సుల్ని సిద్ధం చేసుకోవాలని చెప్పారు. ప్రతి పోలింగ్‌ కేంద్రానికి ఎన్నికల సామగ్రి నూరు శాతం అందేలా ఏర్పాట్లు చేశామన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్‌ సూచించారు. సెక్టార్‌ ఆఫీసర్లు, ఎస్‌ఎస్‌టీ టీంలు ప్రయాణించే ప్రతి వాహనానికి జీపీఎస్‌ ట్రాకింగ్‌ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. పోలింగ్‌ సిబ్బంది సంక్షేమం చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని చెప్పారు. పోలింగ్‌ రోజు వినియోగంలోకి రాని ఈవీఎంలు, రిజర్వ్‌ ఈవీఎంలను బాపట్ల మున్సిపల్‌ పాఠశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్‌ రూంకు తరలించాలని ఆదేశించారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద వెబ్‌ క్యాస్టింగ్‌, వీడియోగ్రఫీ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. సక్షం వెబ్‌ సైట్‌లో ముందస్తుగా తమ పేర్లు నమోదు చేసుకున్న వారికి పోలింగ్‌ రోజున ఇంటి వద్దకు వాహన సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. పలు అంశాలపై అధికారులతో ఆయన సమీక్షించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్‌. సత్తిబాబు, అదనపు ఎస్పీ విఠలేశ్వరరావు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement