బీసీలపై చంద్రబాబుది కపట ప్రేమ: వైఎస్సార్‌సీపీ నేతలు | YSRCP Leaders Serious Comments On CBN Over BC Reservations | Sakshi
Sakshi News home page

బీసీలపై చంద్రబాబుది కపట ప్రేమ: వైఎస్సార్‌సీపీ నేతలు

Oct 8 2026 1:00 PM | Updated on Oct 8 2026 1:05 PM

YSRCP Leaders Serious Comments On CBN Over BC Reservations

సాక్షి, విశాఖ: బీసీలపై చంద్రబాబు ప్రభుత్వం కపట ప్రేమ చూపిస్తోందని వైఎస్సార్‌సీపీ నేతలు విమర్శించారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి.. చివరకు 24 శాతానికి తగ్గడానికి చంద్రబాబే కారణమని ఆరోపించారు. తప్పు చంద్రబాబు చేసి.. నెపాన్ని వైఎస్‌ జగన్‌పై నెడుతున్నారని మండిపడ్డారు. పేదల విద్య, వైద్యం కోసం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్‌ జగన్‌ కృషి చేశారని పేర్కొన్నారు.

విశాఖలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ‘వెన్నుపోటు పార్టీ వంచనపై బీసీ గర్జన’ పేరుతో సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, చెల్లుబోయిన వేణు, తమ్మినేని సీతారాం, సీదిరి అప్పలరాజు, ధర్మాన కృష్ణదాస్, బూడి ముత్యాలనాయుడుతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన బీసీ నేతలు హాజరయ్యారు. 34 శాతం రిజర్వేషన్ల పేరుతో చంద్రబాబు చేస్తున్న మోసం, బీసీ నేతలపై జరుగుతున్న దాడులపై సమావేశంలో చర్చించారు.

అనంతరం, చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ.. బీసీలపై చంద్రబాబు కపట ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. బీసీలను విస్మరించిన చంద్రబాబు.. 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత బీసీ నేతకు డిప్యూటీ సీఎం పదవి కూడా ఇవ్వలేదన్నారు. 34 శాతం రిజర్వేషన్లు నిలవవని తెలిసినా చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో బీసీలకు 100 సీట్లు ఇస్తామని చెప్పి మోసం చేశారని, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవుల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి మాట తప్పారని విమర్శించారు.

ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. టీడీపీ బీసీల పార్టీగా ప్రచారం చేసుకుంటున్నప్పటికీ బీసీలకు చేసిందేమీ లేదని విమర్శించారు. బీసీలకు న్యాయం చేసింది వైఎస్సార్‌సీపీయే అని అన్నారు. టీడీపీ బీసీలకు చేసిన మోసాన్ని ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. రాష్ట్రంలో వేలాది ఎకరాల భూమిని ప్రభుత్వం కొంతమంది వ్యక్తుల చేతుల్లో పెడుతోందని ధర్మాన ఆరోపించారు. విశాఖలో ప్రభుత్వ భూములు ఎవరికి కేటాయించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న లక్షల కోట్ల అప్పులు ఎవరి ఖాతాల్లోకి వెళ్తున్నాయో వెల్లడించాలని ప్రశ్నించారు.

బీసీల భూములు ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోతుంటే.. బీసీలు మాత్రం సెక్యూరిటీ గార్డులుగా పనిచేసే పరిస్థితి వచ్చిందని ధర్మాన వ్యాఖ్యానించారు. రాజధానిలో బీసీలకు ఎకరం భూమి ఉందా? అని ప్రశ్నించారు. పేదల విద్య, వైద్యం కోసం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్‌ జగన్‌ కృషి చేశారని పేర్కొన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు రాజధాని పెద్ద చెరువును తలపించిందని ధర్మాన విమర్శించారు. రాజధాని ఎక్కడుందో పడవలు ఎక్కి వెతకాల్సిన పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గణనీయమైన ఫలితాలు సాధిస్తుందని ఆయన అన్నారు.

ఇదీ చదవండి: రిషికొండే గుదిబండా?.. అమరావతి సంగతేంటి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement