
సాక్షి, ఢిల్లీ: ప్రముఖ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు(Kommineni Srinivasa Rao)కు భారీ ఊరట లభించింది. ఆయన్ని తక్షణమే విడుదల చేయాలంటూ శుక్రవారం సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సాక్షి చానెల్ డిబేట్‌లో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై గుంటూరు తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే..
కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అక్రమమంటూ దాఖలైన పిటిషన్‌ను ఇవాళ జస్టిస్ పీకే మిశ్రా, జస్టిన్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ‘‘టీవీ డిబేట్‌లో నవ్వినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా?. అలాగైతే కేసుల విచారణ సందర్భంగా మేమూ నవ్వుతుంటాం. వాక్ స్వాతంత్రాన్ని రక్షించాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. విశ్లేషకుడి వ్యాఖ్యలతో కొమ్మినేనికి ఏం సంబంధం?. ఆయన్ని వెంటనే విడుదల చేయండి. డిబేట్లను గౌరవప్రదంగా నిర్వహించాలి. విడుదల సందర్భంగా అవసరమైన షరతులను ట్రయల్ కోర్టు విధిస్తుంది’’ అని ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.
పిటిషన్‌లోని ముఖ్యాంశాలు:
కొమ్మినేని శ్రీనివాసరావును అక్రమంగా అరెస్టు చేశారు. మూడేళ్ల లోపు శిక్ష పడే నేరాలకు పోలీసులు ముందుగా 41 కింద నోటీసు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పులు చెబుతున్నాయి. నోటీసు ఇవ్వకుండానే అక్రమంగా అరెస్టు చేశారు. సుప్రీంకోర్టు తీర్పును పోలీసులు పాటించలేదు. కేఎస్సార్ లైవ్ షో లో గెస్ట్ చేసిన వ్యాఖ్యలకు.. యాంకర్ ఎలా బాధ్యత వహిస్తారు?. అలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయొద్దని గెస్ట్‌ను కేఎస్ఆర్ నియంత్రించారు . వాటిని సమర్థించలేదు. తెలంగాణలో అరెస్టు చేసి 331 కిలోమీటర్ల దూరంలో.. అదీ ఆంధ్రప్రదేశ్‌లో రిమాండ్ చేశారు. పైగా ట్రాన్సిట్ రిమాండ్ తీసుకోలేదు.
కొమ్మినేని సీనియర్ జర్నలిస్టు. ఆయనకు ఎలాంటి నేర చరిత్ర లేదు.పైగా 70 ఏళ్లకు పైబడిన సీనియర్ సిటిజన్. కొమ్మినేని దర్యాప్తును తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. స్థానిక కోర్టులో కొమ్మినేని తరఫున న్యాయవాదిని అనుమతించలేదు. సహజ న్యాయ సూత్రాలకు ఇది విరుద్ధం . ఈ కేసులో పోలీసులు ప్రాథమిక హక్కు ఆర్టికల్ 19, 21 ,22(1)ను ఉల్లంఘించారు. ప్రజాస్వామ్య నాలుగో స్తంభమైన మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. వాక్ స్వాతంత్రానికి భంగం కలిగిస్తున్నారు. అక్రమ అరెస్టుతో ఆయన జీవించే హక్కుకు భంగం కలిగింది’’ అని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ వాదనలతో ఏకీభవించిన కోర్టు కొమ్మినేనికి బెయిల్ మంజూరు చేస్తూ ఊరట ఇచ్చింది.
