తాడేపల్లి: ప్రతిపక్షం నామినేషన్లు వేయకుండా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. మంగళవారం తాడేపల్లి నుంచి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు అరాచకాలు చేస్తున్నారని తెలిపారు. వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులు చేస్తున్నారు.
తప్పుడు కేసులు పెడుతున్నారని సజ్జల అన్నారు. దుగ్గిరాలలో వైఎస్సార్‌సీపీ నేత వీరయ్యపై అక్రమ కేసు పెట్టారని తెలిపారు. ఆయనపై పీడీ యాక్ట్ పెట్టారని అన్నారు. ఎన్నికల్లో ఓటమి భయంలోనే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని తెలిపారు. పోలీసులు కూడా కాల్పులు జరిపి రాళ్లతో దాడి చేశారని చెప్పారు. పోలీసులు పచ్చ రౌడీలకు వంతపాడుతున్నారని అన్నారు.
వైఎస్సార్‌సీపీపై అసత్య ప్రచారం
వైఎస్సార్‌సీపీ దౌర్జన్యాలు చేస్తోందని చంద్రబాబు ప్రచారం చేయిస్తున్నారని సజ్జల తెలిపారు. పోలీసులు గూండాలలా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఓటమి భయంతో చంద్రబాబు నాయుడు కుట్రలు చేస్తూనే ఉన్నారని తెలిపారు.
‘‘అధికార మదంతో చంద్రబాబు రెచ్చిపోతున్నారు. నామినేషన్లు వేయడానికి వెళ్లిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై తప్పుడు కేసులు పెట్టారు. రాబోయే రోజుల్లో చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారు. అభ్యర్థులు నామినేషన్లు వేస్తే అక్రమంగా అన్నీ రిజెక్ట్ చేశారు.
రాయచోటిలో వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి టీడీపీ గూండాలు నిప్పు పెట్టారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కూటమి బెదిరింపులకు వైఎస్సార్‌సీపీ నేతలు భయపడరు. అభ్యర్థులు నామినేషన్లు వేస్తే అక్రమంగా అన్నీ రిజెక్ట్ చేశారు. ఎమర్జెన్సీ సమయంలో కూడా ఇలాంటి ఘటనలు చూడలేదు. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజక వర్గంలో 900 మంది వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టారు. పులివెందులలో పోలీసులు జరిపిన కాల్పులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి ’’ అని సజ్జల చెప్పారు.
దసరాను రాజకీయాల కోసం వాడుతున్నారు
దసరా పండుగను కూడా తన సంకుచిత రాజకీయాల కోసం చంద్రబాబు వాడుకుంటున్నారని సజ్జల అన్నారు. ‘‘న్యాయస్థానాలకు సెలవులు ఉన్న సమయాన్ని చూసుకుని దొంగదెబ్బ కొట్టేందుకే హడావుడిగా స్థానిక ఎన్నికలు తెచ్చారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియను చంద్రబాబు పూర్తిగా అపహాస్యం చేశారు. పోలీసు, అధికార యంత్రాంగాలను అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష అభ్యర్థులను ఎన్నికల బరి నుంచి తప్పిస్తున్నారు. నామినేషన్లు వేయనివ్వరు.. వేసినవి తిరస్కరిస్తారు.. అవీ దాటితే ఉపసంహరించుకోవాలని బెదిరిస్తారు.
ప్రజాబలంతో గెలవలేక పోలీసుల బలంతో ఏకగ్రీవాలు చేసుకుంటున్నారు. చంద్రబాబూ.. ఇవి ఎన్నికలు కావు.. ప్రజాస్వామ్య విజయాలు అంతకంటే కావు. నామినేషన్లు వేయడమే నేరంగా, ఎన్నికల్లో పోటీ చేయడమే సవాల్‌గా మార్చేశారు. వైuస్సార్‌సీపీ పోటీలో ఉంటే ఓటమి తప్పదన్న భయంతోనే చంద్రబాబు ఈ అరాచకాలకు పాల్పడుతున్నారు. కడపలో 66 డివిజన్లలో మా అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు.
కష్టపడి వేసిన నామినేషన్లను కూడా తిరస్కరించారు.. చివరకు మేయర్ అభ్యర్థిని ఉపసంహరణకు బెదిరిస్తున్నారు. చిత్తూరులో నామినేషన్లు వేసిన అభ్యర్థులను కూడా కాపాడుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అభ్యర్థులు ప్రచారం చేయాల్సిన సమయంలో వారిని ప్రత్యర్థుల దాడుల నుంచి రక్షించుకోవాల్సి వస్తోంది. పులివెందులలో నామినేషన్లు వేయడానికి వచ్చిన వారిపై పోలీసులే దాడులు చేశారు. పులివెందులలో రెండు ఎఫ్‌ఐఆర్‌ల ద్వారా 900 మందికి పైగా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను కేసుల్లో ఇరికించారు.
రాయచోటిలో సుమారు 300 మంది, దర్శిలో 162 మందిపై తీవ్రమైన సెక్షన్లతో కేసులు పెట్టారు. నామినేషన్లు వేయడానికి వచ్చిన వందల మందిపై హత్యాయత్నం కేసులా? ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైయస్సార్‌సీపీ నాయకులు పాల్గొనకుండా చేయడమే ఈ కేసుల వెనుక కుట్ర. పులివెందులలో పోలీసుల కాల్పుల వివరాలను వారి ఎఫ్‌ఐఆర్‌లోనే పేర్కొన్నారు’’ అని తెలిపారు.
ఇదీ చదవండి: రౌడీలను తీసుకొచ్చి రెచ్చగొడుతున్నారు: ఎంపీ మిథున్‌రెడ్డి


