స్థానిక పోరు.. సేవారంగానికి జోరు | Local elections provide a boost to temporary employment | Sakshi
Sakshi News home page

స్థానిక పోరు.. సేవారంగానికి జోరు

Oct 16 2026 4:18 AM | Updated on Oct 16 2026 4:18 AM

Local elections provide a boost to temporary employment

స్థానిక ఎన్నికలతో తాత్కాలిక ఉపాధికి ఊతం  

చిరువ్యాపారులకు కొత్త అవకాశాలు.. క్యాటరింగ్, ప్రింటింగ్, ఫొటోగ్రఫీ, రవాణా, సౌండ్‌సిస్టమ్‌ రంగాల్లో ఉపాధి  

సాక్షి, అమరావతి: ఎన్నికలు ఎప్పుడు జరిగినా అభ్యర్థులు తమ గెలుపునకోసం విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. రూ.కోట్లు ఖర్చు చేసి గెలిచేందుకు పోటీపడుతుంటారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాలు, పట్టణాల్లో సేవారంగానికి ఉపాధి అవకాశాలు విస్తరించే అవకాశం ఉందని అధ్యయనాలు సైతం స్పష్టం చేస్తున్నాయి. అభ్యర్థులు ప్రచారసభలు, ర్యాలీలు, వాహనాలు, మైకులు, భోజన ఏర్పాట్లపై చేసే ఖర్చుతో పాటు ఫ్లెక్సీలు, బ్యానర్లు, కరపత్రాల తయారీకి స్థానిక ప్రింటింగ్‌ కేంద్రాలను ఆశ్రయించడం వల్ల చిరువ్యాపారులకు లాభాలు పెరుగుతాయి. 

స్థానిక ఫొటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు, టెంట్‌ నిర్వాహకులు, సౌండ్‌సిస్టమ్‌ టెక్నీషియన్లు, వంటవారు, క్యాటరింగ్‌ సిబ్బంది, ఆటో, కారు డ్రైవర్లకు అదనపు రోజువారీ పని లభిస్తుంది. సభలకు కుర్చీలు, మైకులు, జనరేటర్లు అద్దెకు ఇవ్వడం నుంచి కార్యకర్తలకు భోజనాలు సిద్ధం చేయడం వరకు పలు సేవలకు డిమాండ్‌ ఏర్పడుతుంది. ఈ పనుల్లో కొన్నింటికి అదనపు సహాయకులు అవసరమవడంతో కొందరు సామాన్యులకు తాత్కాలిక ఉద్యోగాలు దొరుకుతాయి. రోజువారీ కూలీలు, యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అభ్యర్థులు నగదును పట్టణాలు, గ్రామాల్లోనే ఖర్చుచేయడం వల్ల స్థానిక వ్యాపారుల చేతుల్లోకి నగదు చేరి.. దుకాణాలు, రవాణా, ఆహారసేవలు వంటి అనుబంధ రంగాల్లోను నగదు చలామణి పెరగవచ్చని నివేదికల్లో వెల్లడైంది.  

2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో 9 లక్షల తాత్కాలిక ఉద్యోగాలు  
2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా దేశవ్యాప్తంగా సుమారు 9 లక్షల తాత్కాలిక ఉద్యోగాలు ఏర్పడతాయని ఉద్యోగ నియామక రంగానికి చెందిన సంస్థలు అప్పట్లో ముందస్తు అంచనా వేశాయి. వర్క్‌ఇండియా సంస్థకు సంబంధించిన అంచనాలు, పరిశ్రమవర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రచారానికి సంబంధించి ఆరునెలల్లో సుమారు రెండులక్షల తాత్కాలిక ఉద్యోగ అవకాశాలు ఏర్పడ్డాయి. ప్రచార నిర్వహణ, రవాణా, ఆహార సరఫరా, ప్రింటింగ్, భద్రత, ఐటీ సేవలు తదితర రంగాల్లో మరో నాలుగులక్షల నియామకాలు జరిగాయని అంచనా. 

సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ (సీఎంఎస్‌) అంచనా ప్రకారం.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం వ్యయం సుమారు రూ.1.35 లక్షల కోట్లకుపైనే ఉంది. 2019లో ఎన్నికల వ్యయం రూ.55 వేల కోట్ల నుంచి రూ.60 వేల కోట్ల మధ్య ఉంటుందని అప్పట్లో అంచనా వేయగా, 2024లో వ్యయం గణనీయంగా పెరిగింది. అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌) 2025లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. ప్రచారం, ప్రకటనలకు అభ్యర్థులు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. ఇదంతా అంతిమంగా ప్రజల్లోకే వెళుతుంది. ఇందులోనే సేవారంగానికి కూడా కొంత చేరుతుంది.  

పలు వృత్తుల వారికి ఉపాధి అవకాశాలు  
స్థానిక ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు చేసే ఖర్చు అనేక వృత్తుల వారికి పనులు కల్పిస్తుంది. సభల నిర్వహణకు టెంట్లు, కుర్చీలు, మైకులు, జనరేటర్లు అవసరమవుతాయి. ప్రచార సామగ్రి కోసం ఫ్లెక్సీలు, బ్యానర్లు, కరపత్రాలు ముద్రించాల్సి ఉంటుంది. కార్యకర్తల రాకపోకలు, భోజన ఏర్పాట్లకు వాహనాలు, హోటళ్లు, క్యాటరింగ్‌ సిబ్బంది సేవలు వినియోగించుకోవాల్సి ఉంటుంది. దీంతో మండల కేంద్రాలు, చిన్న పట్టణాల్లోని వ్యాపారులు, రోజువారీ కూలీలు, యువతకు తాత్కాలిక ఉపాధి అవకాశాలు లభిస్తాయి. 

బ్రెజిల్‌లో ఎన్నికల ప్రచార సిబ్బందిపై నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ ఎకనామిక్‌ రీసెర్చ్‌ ప్రచురించిన పరిశోధన నివేదిక ప్రకారం.. విజయం సాధించిన రాజకీయ ప్రచార బృందాల్లో పనిచేసిన కొందరికి తర్వాతి కాలంలోను ఉద్యోగ, ఆదాయ ప్రయోజనాలు కనిపించాయి. ముఖ్యంగా విజేతల బృందాల్లో పనిచేసినవారికి నాలుగేళ్ల తర్వాత వార్షిక ఆదాయంలో సుమారు 10 శాతం ప్రయోజనం కనిపించినట్లు ఆ నివేదిక పేర్కొంది. అంటే.. స్థానిక ఎన్నికలు సేవారంగంలో తాత్కాలిక డిమాండ్‌ను పెంచే అవకాశం కల్పిస్తాయని రుజువైంది.  

ఎంతమంది అవసరం? 
100 ప్రచారసభలు, సమావేశాల నిర్వహణకు వివిధ విభాగాల్లో అవసరమయ్యే సిబ్బందిపై ఒక అంచనా ఇలా ఉంది  
సేవా విభాగం                                               అవసరమయ్యే సిబ్బంది  
టెంట్లు, షామియానా, కుర్చీల ఏర్పాటు                  600–1,200 
వంటవారు, క్యాటరింగ్, భోజనాల సరఫరా               800–2,000 
ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు                               200–400 
సౌండ్‌సిస్టమ్, విద్యుత్‌ టెక్నీషియన్లు                     200–500 
డ్రైవర్లు, రవాణా సహాయకులు                              200–600 
బ్యానర్లు, ఫ్లెక్సీల ఏర్పాటు                                   200–600 
ప్రింటింగ్, ప్రచారసామగ్రి తయారీ                           200–500   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement