వెనామీ రొయ్య ఫీడ్‌పై టన్నుకు ఎమ్మార్పీపై రూ.9,350, టైగర్ ఫీడ్‌పై రూ.12,870 భారం
రూ.1.23 లక్షలకు చేరిన టన్ను వెనామీ మేత ధర
టైగర్ రొయ్యల ఫీడ్ ధర టన్ను రూ.1.39 లక్షలు..
ఏకాభిప్రాయం లేకుండానే పెంపు అమలు
గగ్గోలు పెడుతున్న ఆక్వా రైతులు
సాక్షి, అమరావతి: రొయ్యల మేత కంపెనీలు ఫీడ్ ధరలు పెంచేశాయి. టన్నుపై వెనామీ రొయ్యల మేత ధరను ఎమ్మార్పీపై రూ.9,350, టైగర్ రొయ్యల మేత ధరను రూ.12,870 చొప్పున పెంచాయి. ఈ పెంపు శనివారం (17వ తేదీ) నుంచే అమల్లోకి వస్తుందని ప్రకటించాయి. తాజా పెంపుతో 8 నెలల వ్యవధిలోనే టన్నుపై రూ.28,870 పెంచినట్టయ్యింది. ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) చట్టానికి తూట్లు పొడుస్తూ రైతుల ఏకాభిప్రాయం లేకుండా కంపెనీలు ఇష్టారాజ్యంగా ధరలు పెంచేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని రైతులు మండిపడుతున్నారు.
వరుసగా భారీగా పెంపు...
ఈ ఏడాది ఫిబ్రవరిలో రొయ్యల ఫీడ్ ధరను టన్నుకు రూ.4వేలు, జూన్‌లో రూ.12వేలు చొప్పున కంపెనీలు పెంచాయి. పైగా 45 రోజులకు ఒకసారి ధరల పెంపును సమీక్షించేందుకు ఫీడ్ ధరల సబ్ కమిటీని ఏర్పాటు చేయడంతో ఫీడ్ కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. తాజాగా ఇన్వాయిస్ ధరలపై వెనామీ మేత ధర టన్నుకు రూ.8వేలు, టైగర్ ఫీడ్‌పై రూ.11వేలు చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించాయి. కాగా, అసలు ఎమ్మార్పీ మాత్రం చెప్పకుండా మాత్రం దాటవేశాయి.
2024 ఏప్రిల్‌లో వెనామీ రొయ్యల ఫీడ్ ధర టన్ను రూ.82వేలు, టైగర్ రొయ్యల ఫీడ్ ధర రూ.92వేలు ఉండగా, తాజా పెంపుతో వెనామీ మేత ధర టన్ను రూ.1.23 లక్షలకు, టైగర్ మేత ధర రూ.1.39 లక్షలకు చేరాయి. అంటే... రెండున్నరేళ్లలో వెనామీ రైతులపై టన్నుకు రూ.41వేలు, టైగర్ రైతులపై రూ.47వేల చొప్పున భారం పడినట్టయ్యింది. మేత ధరల భారంతో వెనామీ రొయ్యల ఉత్పత్తి ఖర్చు కిలోకు రూ.300కు చేరగా, టైగర్ రొయ్యల ఉత్పత్తికి కిలోకు రూ.450కు పెరిగింది.
ఇక నుంచి ప్రతి 45 రోజులకు ఒకసారి ధరల పెంపును సమీక్షిస్తామని ఫీడ్ కంపెనీలు ప్రకటించడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఫీడ్ ధరల పెంపును అడ్డుకోవడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ ఆక్వా రైతులు ఆందోళన బాటపడుతున్నారు. ప్రస్తుతం పట్టుబడిలో ఉన్న చెరువుల పట్టివేత పూర్తి కాగానే సాగు సమ్మెకు వెళ్లాలనే యోచనలో రైతులు ఉన్నారు.


