అమరావతి: ఏపీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉత్తర అండమాన్ సముద్ర పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిన నేపథ్యంలో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే మూడు గంటలు కాకినాడ, కోనసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ విధించింది. అమలాపురం, కాట్రేనికోన ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ చెప్పుకొచ్చారు.
భారత వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం, ఉత్తర అండమాన్ సముద్రంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం పశ్చిమ వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉంది. దీని ప్రభావంతో అక్టోబర్ 23 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఆ తర్వాత అది మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో, నేడు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. సముద్రంలో వాతావరణ పరిస్థితులు మారే అవకాశం ఉండటంతో ఈ నెల 25 నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక జారీ చేశారు.
రాబోయే మూడు గంటలు కాకినాడ, కోనసీమ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ 🟠 అమలాపురం, కాట్రెనికోన ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్ష సూచన ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ప్రఖర్ జైన్, ఎండీ, #APSDMA #AndhraPradesh #WeatherUpdate #lightning #safetyfirst #kakinada #amalapuram #konaseema https://t.co/uigMYfk1iB
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) October 22, 2026
పిడుగులు, ఈదురుగాలులతో అప్రమత్తం
ప్రకాశం, నెల్లూరు, తిరుపతి సహా దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు, పిడుగులు, బలమైన ఈదురుగాలుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఉరుములు వినిపించినప్పుడు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండకూడదు. వాతావరణ పరిస్థితులను బట్టి అధికారుల సూచనలు పాటించాలి. అక్టోబర్ 25 నుంచి సముద్రంలోకి వెళ్లవద్దన్న మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు.
తెలంగాణలోనూ వర్షాలు..
తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది.
ఇదీ చదవండి: బాబు మార్కు అరాచకం.. కళ్లెదుటే సాక్ష్యం..


