టీడీపీకి భారీ షాక్‌.. కన్నీరు పెడుతూ కీలక నేత రాజీనామా | Gunda Laxmi devi Resign To TDP | Sakshi
Sakshi News home page

టీడీపీకి భారీ షాక్‌.. కన్నీరు పెడుతూ కీలక నేత రాజీనామా

Oct 21 2026 1:18 PM | Updated on Oct 21 2026 1:23 PM

Gunda Laxmi devi Resign To TDP

శ్రీకాకుళం: తెలుగుదేశం పార్టీలో నాలుగు దశాబ్దాలుగా కొనసాగిన మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన భర్త, మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణకు పార్టీలో జరిగిన అవమానాలు, ఆయన విగ్రహ ఏర్పాటును అడ్డుకోవడం వంటి పరిణామాలే తన నిర్ణయానికి కారణమని ఆమె ఆరోపించారు. 40 ఏళ్లుగా పనిచేసిన పార్టీని వీడాల్సి రావడం బాధగా ఉందంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.

తన భర్త గుండ అప్పల సూర్యనారాయణ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పనిచేశారని లక్ష్మీదేవి గుర్తుచేశారు. సుదీర్ఘకాలం టీడీపీలో కొనసాగుతూ పార్టీని నమ్ముకొని, దాని బలోపేతానికి కృషి చేశామని తెలిపారు. అయితే గత పదేళ్లుగా తన భర్త తీవ్ర మనస్తాపానికి గురయ్యారని, పలుమార్లు చంద్రబాబును కలిసి తమ సమస్యలను వివరించినా పరిస్థితిలో మార్పు రాలేదని ఆరోపించారు. మనస్తాపంతోనే తన భర్త మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు.

తన భర్త మరణం తర్వాత కూడా తమను, తమను నమ్ముకున్నవారిని అవమానాలకు గురిచేస్తున్నారని లక్ష్మీదేవి వాపోయారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పనిచేసిన వ్యక్తి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు. విగ్రహం కోసం నిర్మించిన దిమ్మెలను ధ్వంసం చేశారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేశ్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ‘జెండానే మా అజెండా’ అంటూ పార్టీని నమ్ముకొని ముందుకు సాగుతున్న వారికి అన్యాయం జరిగిందని లక్ష్మీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. 

తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ తనకు ఫోన్‌ చేసి పార్టీని వీడవద్దని కోరినట్లు వెల్లడించారు. అయినప్పటికీ తనను నమ్ముకున్న కొందరు టీడీపీలోనే ఉన్నా.. వారిని పార్టీ కార్యకర్తలుగా గుర్తించడం లేదని ఆరోపించారు. వారి కోసమే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. 40 ఏళ్లుగా పనిచేసిన టీడీపీని ఈ పరిస్థితుల్లో వీడాల్సి రావడం తనకు ఎంతో బాధ కలిగిస్తోందంటూ లక్ష్మీదేవి భావోద్వేగానికి గురయ్యారు. ఆమె రాజీనామా నిర్ణయం శ్రీకాకుళం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇదీ చదవండి: బాబు సర్కార్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement