నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు | Devi Sharan Navaratri celebrations begin at Indrakiladri from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

Oct 11 2026 5:40 AM | Updated on Oct 11 2026 5:40 AM

Devi Sharan Navaratri celebrations begin at Indrakiladri from today

తొలిరోజు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా దర్శనమివ్వనున్న దుర్గమ్మ

నేడు ఉ.8 గంటల నుంచి భక్తులకు అమ్మవారి దర్శనం

విద్యుద్దీపాలతో ఇంద్రకీలాద్రి ముస్తాబు

ఈసారి పెద్ద సంఖ్యలో వీవీఐపీలు, ప్రముఖుల రాక

సాక్షి ప్రతినిధి, విజయవాడ: దసరా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలకు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్లు కొలువుదీరిన బెజవాడ ఇంద్రకీలాద్రి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆదివారం నుంచి ప్రారంభమయ్యే దసరా ఉత్సవాలు 20వ తేదీ వరకు కొనసాగుతాయి. ఉత్సవాలలో తొలిరోజైన ఆదివారం దుర్గమ్మ శ్రీబాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. తెల్లవారుజామున అమ్మవారికి సుప్రభాత సేవ, అనంతరం స్నపనాభిషేకం, విశేష అలంకరణ, పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అనంతరం.. ఉ.8 గంటల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. మొదటిరోజు ఆదివారం కావడంతో పెద్దఎత్తున భక్తులు విచ్చేస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు.  

విద్యుద్దీపాల ధగధగలు..
ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు మహా మండపం, మల్లేశ్వర స్వామివారి ఆల­యం, రాజగోపురం, ఘాట్‌రోడ్డుతో పాటు చైనావాల్, కొండ దిగువన కనకదుర్గనగర్‌లను విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం కెనాల్‌రోడ్డులోని వినాయకుడి గుడి నుంచి క్యూలైన్లు ఏర్పాటుచేశారు. రద్దీ అధికమైతే వీఎంసీ కార్యాలయం, సీతమ్మ వారి పాదాల వద్ద ఏర్పాటుచేసిన కంపార్టుమెంట్లలోకి భక్తులను తరలిస్తారు. ఇక హైదరాబాద్, తెలంగాణ వైపు నుంచి విచ్చేసే భక్తుల కోసం ఈ ఏడాది కుమ్మరిపాలెం వరకు క్యూలైన్లు ఏర్పాటుచేసింది. 

వీవీఐపీలు, ప్రముఖుల రాక..
ఈ ఏడాది దసరా ఉత్సవాలకు పలువురు వీవీఐపీలు, ప్రముఖులు విచ్చేస్తున్న నేపథ్యంలో పోలీసు బందోబస్తును పటిష్టంగా ఏర్పాటుచేస్తున్నారు. ఈ ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల నుండి అమ్మవారి దర్శనానికి అధిక సంఖ్యలో విచ్చేస్తారు. దీంతో.. నగరానికి విచ్చేసే భక్తుల భద్రత దృష్ట్యా సుమారు 3,130 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో పోలీసు బందోబస్తును ఏర్పాటుచేస్తున్నారు. 

బూమ్‌ బ్యారియర్లు, యా­క్సె­స్‌ కంట్రోలర్స్‌ ఏర్పాటు, క్షేత్రస్థాయి పరిశీలన కోసం 30 డ్యాష్‌బోర్డులతో అధునాతన కంట్రోల్‌ రూ­మ్, క్యూలైన్లలో భక్తుల కదలికలు, పార్కింగ్‌ స్థలాలు, ఆర్టీసీ, రైల్వే ప్రయాణికుల రద్దీని ఏఐ కెమెరాలు, డ్రోన్లు, ఏఎన్‌పీఆర్‌ సిస్టమ్, డిజిటల్‌ ట్విన్స్‌ పరిజ్ఞానంతో నిరంతరం పర్యవేక్షిస్తారు. మొత్తం టెంపుల్‌ పరిసర ప్రాంతాల్లో 40 పార్కింగ్‌ పాయింట్లను ఏర్పాట్లుచేశారు. సామాన్య భక్తుల సౌకర్యార్థం కొండపైన ఓం టర్నింగ్‌ వద్ద వాహనాల పార్కింగ్‌కు అనుమతి ఇవ్వడంలేదు. పాస్‌ ఉన్న వాహనాలు ఓం టర్నింగ్‌ వరకు వెళ్లి అక్కడ డ్రాప్‌ చేసిన అనంతరం కిందకు వెళ్లిపోయేలా ఏర్పాట్లు చేశారు.

నేటి అలంకారం శ్రీబాలా త్రిపుర సుందరీదేవి..
శరన్నవరాత్రి మహోత్సవాల్లో మొదటి రోజు శ్రీ కనకదుర్గ అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. బాలాదేవి ఎంతో మహిమాన్వితమైనది. శ్రీ బాలా మంత్రం సమస్త దేవి మంత్రాల్లో ముఖ్యమైనది. అందుకే శ్రీవిద్యోపాసకులకు మొట్టమొదట బాలా మంత్రాన్ని ఉపదేశిస్తారు. మహా త్రిపుర సుందరీదేవి నిత్యం కొలువై ఉండే పవిత్రమైన శ్రీచక్రంలో మొదటి ఆమ్నాయంలో ఉండే మొదటి దేవత శ్రీబాలా త్రిపుర సుందరీదేవి. అందుకే ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే శ్రీమహా త్రిపురసుందరీదేవి అనుగ్రహాన్ని పొందగలం. దసరా ఉత్సవాల్లో భక్తులకు పూర్ణఫలం అందించే అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement