గోల్డ్ రిఫరల్ అస్సేయింగ్ లేబొరేటరీ ఏర్పాటుకు స్థలాన్వేషణ
బీఐఎస్‌పై అవగాహన కోసం ఏపీలో 300 క్లబ్స్ ఏర్పాటు చేశాం
ఏపీలో 100, దేశంలో 10 వేల విద్యాసంస్థలతో ఎంవోయూలు చేసుకున్నాం
విద్యార్థి దశనుంచే అవగాహన కల్పించి స్టార్టప్‌ల ప్రోత్సాహానికి రెడీ టూ స్టార్ట్ ప్రోగ్రాం
అత్యాధునిక సాంకేతికతతో 90 రోజుల్లోనే బీఐఎస్ లైసెన్స్ జారీ
ఇకపై యాపిల్ ఫోన్లోను బీఐఎస్ కేర్ యాప్‌తో నాణ్యత తెలుసుకునే అవకాశం
గతేడాది 15 కేసులు, ఈ ఏడాది 8 కేసులు నమోదు చేశాం
‘సాక్షి’ ఇంటర్వ్యూలో బీఐఎస్ డైరెక్టర్ హెడ్ ప్రేమ్ సజనీ
సాక్షి, విశాఖపట్నం: ఇకపై ఆంధ్రప్రదేశ్‌లోనే బంగారం స్వచ్ఛత పరీక్షలు పూర్తిస్థాయిలో జరగనున్నాయని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) డైరెక్టర్ అండ్ హెడ్ (సైంటిస్ట్–ఈ) ప్రేమ్ సజానీ వెల్లడించారు. వినియోగదారుడు కొనుగోలు చేసే ప్రతి వస్తువు నాణ్యతకు భరోసా ఇచ్చేందుకు బీఐఎస్ నిరంతరం కృషి చేస్తోందన్నారు. విశాఖలో సోమవారం నిర్వహించిన స్టాండర్డ్ కాంక్లేవ్‌లో పాల్గొన్న ఆమె ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. పలు కీలక అంశాలపై మాట్లాడారు. రాష్ట్రంలో నాణ్యత ప్రమాణాలను పటిష్టం చేయడంతోపాటు విద్యార్థుల్లో అవగాహన పెంచుతున్నట్లు చెప్పారు. ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా ఈ నెల 14న చేపడుతున్న బీఐఎస్ భవిష్యత్తు ప్రణాళికల గురించి వివరించారు. ఆమె ఏమన్నారంటే..

చెన్నై, హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదు
మనం కొనే బంగారం స్వచ్ఛతని పరీక్షించేందుకు బీఐఎస్ ఆధ్వర్యంలో ప్రైవేట్ హాల్‌మార్కింగ్ కేంద్రాలున్నాయి. అయితే.. ఏదైనా ఒక బంగారు ఆభరణం కొనుగోలు చేసిన సమయంలో దాని స్వచ్ఛతపై వినియోగదారుడు, దుకాణదారుడికి మధ్య వివాదం ఏర్పడితే దాని అత్యున్నత ప్రామాణిక నాణ్యత పరీక్షకు గోల్డ్ రిఫరల్ అస్సేయింగ్ లేబొరేటరీ (జీఆర్ఏఎల్) అవసరం. ఇప్పటివరకు ఇలాంటి కేసుల పరిష్కారం కోసం రాష్ట్రంలో బంగారం స్వచ్ఛతను మరింత కచ్చితత్వంతో పరీక్షించేందుకు చెన్నై, హైదరాబాద్‌లలోని లేబొరేటరీలపై ఆధారపడేవాళ్లం. ఇకపై అలాంటి ఇబ్బందులు లేకుండా.. ఏపీలోను ప్రతిష్టాత్మక జీఆర్ఏఎల్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. విజయవాడ, అమరావతి పరిధిలో స్థలాన్వేషణ జరుగుతోంది. ఇది అందుబాటులోకి వస్తే బంగారం నాణ్యత పరీక్షల విషయంలో రాష్ట్ర ప్రజలకు, వ్యాపారులకు ఎంతో వెసులుబాటు కలుగుతుంది.
300 స్టూడెంట్ క్లబ్స్.. 100 ఎంవోయూలు
ప్రజలకు అందించే ఉత్పత్తుల్లో నాణ్యతపై ప్రతి ఒక్కరిలో అవగాహన పెంచే లక్ష్యంతో విద్యార్థులపై ప్రత్యేక దృష్టిసారించాం. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఇప్పటికే 300, దేశవ్యాప్తంగా 10 వేల బీఐఎస్ స్టూడెంట్ క్లబ్స్ ఏర్పాటు చేశాం. 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఇండియన్ స్టాండర్డ్స్ గురించి, వస్తువుల క్వాలిటీ ఎలా చెక్ చేయాలి, బీఐఎస్ కేర్ యాప్ ఎలా వాడాలి, వస్తువుకు లైసెన్స్ ఉందో లేదో ఎలా తనిఖీ చేయాలి అనే విషయాలను నేర్పిస్తున్నాం. అంతేకాకుండా స్టాండర్డ్స్ ప్రాముఖ్యతను సిలబస్‌లో చేర్చేందుకు వీలుగా రాష్ట్రంలోని ఏయూ, తిరుపతి ఐఐటీ, నూజివీడు ట్రిపుల్ఐటీ సహా 100 విద్యాసంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకున్నాం.
పరిశ్రమల ప్రోత్సాహానికి రెడీ టూ స్టార్ట్
భవిష్యత్తులో పరిశ్రమలు స్థాపించాలనుకునే యువ
తకు నాణ్యత ప్రమాణాలపై అవగాహన ఎంతో అవసరం. విద్యార్థి దశ నుంచే వారికి దీనిపై శిక్షణ ఇచ్చి, వారు భవిష్యత్తులో స్టార్టప్‌లు, తయారీ రంగంలోకి అడుగుపెట్టేలా ప్రోత్సహించడానికి రెడీ టూ స్టార్ట్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం.
అత్యాధునిక సాంకేతికతతో 90 రోజుల్లోనే లైసెన్స్
బీఐఎస్ సేవలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా అందించడానికి అత్యాధునిక సాంకేతికతను పూర్తిస్థాయిలో వినియోగిస్తున్నాం. ఈ టెక్నాలజీ సహాయంతో లైసెన్సింగ్ ప్రక్రియను సులభతరం చేశాం. దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లోనే బీఐఎస్ లైసెన్స్ జారీచేసేలా వ్యవస్థను తీర్చిద్దాం. ఒకవేళ తయారీదారులు స్వయంగా ముందే ల్యాబ్‌లలో టెస్టులు చేయించుకుని, ఆ రిపోర్టులను అప్లోడ్ చేస్తూ లైసెన్స్‌కు అప్లై చేస్తే 30 రోజుల్లోనే ఇచ్చేస్తాం
యాపిల్ ఫోన్లలోనూ యాప్ సేవలు
వినియోగదారులు తాము కొనుగోలు చేసే వస్తువుల నాణ్యతను, హాల్‌మార్క్‌ని సులభంగా చెక్ చేసుకునేందుకు తీసుకువచ్చిన బీఐఎస్ కేర్ యాప్ సేవలను మరింత విస్తరించాం. ఇప్పటివరకు కేవలం ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ యాప్.. ఇప్పుడు యాపిల్ ఫోన్ వినియోగదారులు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా మోసాలకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరిస్తున్నాం. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై దాడులు చేస్తూ కఠినచర్యలు తీసుకుంటున్నాం. గతేడాది ఇలాంటి వారిపై 15 కేసులు నమోదు చేయగా, ఈ ఏడాది ఇప్పటివరకు 8 కేసులు నమోదు చేశాం.


