జేసీ అనుచరుడి దౌర్జన్యం | Sakshi
Sakshi News home page

జేసీ అనుచరుడి దౌర్జన్యం

Published Mon, Nov 20 2023 12:40 AM

వేతనాల కోసం నిరసన వ్యక్తం చేస్తున్న 
పంచాయతీ కార్మికులు 
 - Sakshi

తాడిపత్రి టౌన్‌: మండలంలోని గన్నెవారిపల్లి కాలనీ మాజీ సర్పంచ్‌, జేసీ ప్రధాన అనుచరుడి దౌర్జన్యానికి పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న 36 మంది కార్మికులకు ఇబ్బందులు తప్పడం లేదు. గత సర్పంచ్‌ ఎన్నికల్లో ఎస్సీలకు పంచాయతీని కేటాయించడంతో టీడీపీ మద్దతుదారు ఉమామహేష్‌ గెలుపొందాడు. అయినా పెత్తనమంతా మాజీ సర్పంచ్‌దే కావడంతో పాలన అస్తవ్యస్థమైంది. మూడు నెలల వేతన బకాయిల కోసం దాదాపు 14 రోజులుగా కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నా వారిని ఎవరూ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కేవలం సర్పంచ్‌ సంతకం చేయకపోవడంతో కార్మికుల వేతనాలు ఆగినట్లు అధికారులు చెబుతున్నారు.

తమ్ముడిపై ప్రేమతో..

వాస్తవానికి సర్పంచ్‌ ఉమామహేష్‌ తన తమ్ముడి పేరును పంచాయతీ కార్మికుడిగా చేర్చి వేతనం కాజేసేందుకు కుట్ర చేసినట్లుగా ఆరోపణలున్నాయి. ఈ విషయంపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేయడంతో తమ్ముడి పేరు తొలగించాలని సర్పంచ్‌కు అధికారులు సూచించారు. దీనికి సర్పంచ్‌ ససేమిరా అంటూ మాజీ సర్పంచ్‌ అండ చూసుకుని వేతన బిల్లులపై సంతకాలు చేయకుండా మొండికేశారు. దీంతో మూడు నెలలుగా వేతనాలు అందక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు.

సమ్మె బాటలో కార్మికులు..

బకాయి వేతనాలు చెల్లించాలంటూ 14 రోజులుగా కార్మికులు వివిధ రకాలుగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో సమ్మెలోకి వెళ్లేందుకు కార్మికులు సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించి కార్యాచరణనూ సిద్ధం చేశారు. ఈ విషయమై ఈఓఆర్డీ జిలాన్‌బాషా మాట్లాడుతూ.. కార్మికులు సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నది వాస్తవమేనన్నారు. వేతన బిల్లులపై సర్పంచ్‌ సంతకం చేయకపోవడం వల్లనే సమస్య ఉత్పన్నమైందన్నారు. సంతకం చేస్తే మరుసటి రోజే కార్మికులకు వేతనాలు అందజేస్తామని స్పష్టం చేశారు.

దళిత సర్పంచ్‌ను అడ్డు పెట్టుకుని

పంచాయతీపై పెత్తనం

నిరసనగా సమ్మెబాట పట్టనున్న కార్మికులు

Advertisement

తప్పక చదవండి

Advertisement