వసతుల కల్పనకు నివేదికలు సిద్ధం చేయండి | Sakshi
Sakshi News home page

వసతుల కల్పనకు నివేదికలు సిద్ధం చేయండి

Published Sun, Apr 7 2024 2:30 AM

మాట్లాడుతున్న కలెక్టర్‌ రాజర్షి షా - Sakshi

● కలెక్టర్‌ రాజర్షి షా

కై లాస్‌నగర్‌: అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలతో మౌలిక వసతులు కల్పించేందుకు గాను ప్రభుత్వ పాఠశాలలను క్షేత్రస్థాయిలో పరిశీలించి తుది అంచనాలతో కూడిన నివేదికలు అందించాలని కలెక్టర్‌ రాజర్షి షా సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. ఏయే పాఠశాలలో ఎలాంటి పనులు చేపట్టాలనే దానిపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. పాఠశాలలో తాగునీటి సౌకర్యం, తరగతి గదుల మేజర్‌, మైనర్‌ మరమ్మతులు, బాలికల కోసం అదనపు టాయిలెట్ల నిర్మాణ పనులు, విద్యుత్‌ సౌకర్యం, పెయింటింగ్‌ వంటి మౌలిక వసతుల పర్యవేక్షణ పనుల వ్యయ అంచనాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఇంజినీరింగ్‌ అధికారులు పాఠశాలలను సందర్శించి ప్రతిపాదనలు పక్కాగా రూపొందించాలన్నారు. సమావేశంలో ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, ట్రెయినీ కలెక్టర్‌ వికాస్‌ మహతో, జెడ్పీ డిప్యూటీ సీఈవో కళిందిని, పీఆర్‌ ఈఈ మహావీర్‌, డీఆర్డీవో సాయన్న, ఆర్‌అండ్‌బీ ఈఈ నర్సయ్య, టీఎస్‌డబ్ల్యూఐడిసీ ఈఈ అశోక్‌, డీఈవో ప్రణీత తదితరులు పాల్గొన్నారు.

తక్కువ బరువున్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ

కై లాస్‌నగర్‌: తక్కువ బరువు కలిగి ఉన్న పిల్లల వివరాలు సేకరించి వారికి అవసరమైన వైద్యచికిత్స అందించేలా చూడాలని కలెక్టర్‌ రాజర్షి షా అన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో పోషణ్‌ అభియాన్‌పై సీడీపీవోలు, ఏసీడీపీవోలు, సూపర్‌వైజర్లతో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. కుటుంబ సర్వే, రిజిస్టర్ల నిర్వహణ, బియ్యం బయోమెట్రిక్‌, పిల్లల ఎదుగుదల టీహెచ్‌ఆర్‌ అప్‌డేట్‌ వంటి అంశాలపై మండలాల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. బయోమెట్రిక్‌ వేసిన వారంలోగా అంగన్‌వాడీ కేంద్రాలకు బియ్యం సరఫరా చేయాలన్నారు. ఏడాదికోసారి నిర్వహించే కుటుంబ సర్వే పకడ్బందీగా నిర్వహించాలన్నారు. తక్కువ బరువు కలిగిన పిల్లలను ఉట్నూర్‌ సీహెచ్‌సీ, రిమ్స్‌లోని ఎన్‌ఆర్‌సీ, ఎస్‌ఎన్‌సీయూ కేంద్రాలకు రిఫర్‌ చేయాలన్నారు. బాలామృతం, కోడిగుడ్ల వివరాలను టీహెచ్‌ఆర్‌లో అప్‌డేట్‌ చేయాలన్నారు. ప్రతీ నెల మొదటి వారంలో గ్రోత్‌ మానటరింగ్‌ జరగాలని, గ్రోత్‌ మిషన్స్‌ చెడిపోతే వాటి వివరాలు సమర్పించాలన్నారు. సామ్‌మామ్‌ పిల్లలను గుర్తించి ఆర్‌బీఎస్‌కే టీంతో సమన్వయం చేసుకుని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌, రిమ్స్‌కు పంపించాలన్నారు. 14రోజులపాటు వైద్యాధికారుల పర్యవేక్షణలో ఉంచి పోషకాహారం అందించాలని సూచించారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున అంగన్‌వాడీ కేంద్రాలు ఉదయం 8నుంచి 11గంటల వరకు నిర్వహించాలన్నారు. గర్భిణులు, బాలింతలు, పిల్లలకు 11 గంటలలోపు స్పాట్‌ ఫీడింగ్‌ అందించాలని తెలిపారు. తల్లులు తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ట్రెయినీ కలెక్టర్‌ వికాస్‌ మహతో, డీడబ్ల్యూవో మిల్కా, సీడీపీవోలు వనజ, మిల్కా తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement