breaking news
Voters List Modification
-
ధర్నా @ రాజ్‌ఘాట్
న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) మాటున గంపగుత్తగా కోట్లాది ఓటర్ల ఓటు హక్కును హరించి ప్రజాస్వామ్యాన్ని పరిహసించిన ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ రాజీనామా డిమాండ్‌తో గత రెండ్రోజులుగా రాజధాని రహదారులపై ఉద్యమించి నినాదాలతో హోరెత్తించిన విపక్షాల ‘ఇండియా’కూటమి నేతలు ఒక్కసారిగా తమ ఉద్యమపంథాను మార్చారు. గాందీజీ స్ఫూర్తితో మౌనంగా తమ నిరసనను తెలపాలని నిర్ణయించుకుని శాంతియుతంగా నిరసనోద్యమాన్ని ముందుకు నడిపించారు. మంగళవారం ఆకాశవాణి ప్రాంగణంలో, బుధవారం నడిరోడ్డుపై హైడ్రామా కొనసాగిన విపక్ష ఎంపీల ఉద్యమం గురువారం గాందీజీ స్మారకం రాజ్‌ఘాట్ వేదికగా కొనసాగింది. గత రెండ్రోజులుగా కాంగ్రెస్, ఆర్జేడీ, తృణమూల్ కాంగ్రెస్ తదితర మిత్రపక్షాల ఎంపీలు, మద్దతుదారులు, కార్యకర్తలు త్రివర్ణపతాకాలు చేతబూని కీలక పార్లమెంట్ పరిసరాల్లో నడిరోడ్లపై చేసిన నిరసనోద్యమాన్ని కట్టడిచేసేందుకు చెమటోడ్చిన ఢిల్లీ పోలీసులు గురువారం కాస్తంత ఊపిరిపీల్చుకున్నారు. అయితే శుక్రవారం మళ్లీ ఉద్యమంలో కదంతొక్కుతామన్న విపక్ష నేతల ప్రతిజ్ఞతో పోలీసుల మొహరింపు, అప్రమత్తత సెంట్రల్ ఢిల్లీలో రాజ్యమేలుతోంది. మళ్లీ ఖర్గే భేటీతో మొదలై.. బుధవారం మాదిరే గురువారం సైతం విపక్షాల ఎంపీలందరికీ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మధ్యాహ్నం భోజనానికి ఆహా్వనించారు. దీంతో కాంగ్రెస్, తదితర మిత్రపక్షాల ఎంపీలంతా కన్నాట్ ప్లేస్‌లోని ఔటర్ సర్కిల్ మొయిట్స్ రెస్టారెంట్లో భేటీ అయి భోజనం పూర్తిచేశారు. ముందుజాగ్రత్తగా పోలీసులు ఆ ప్రాంతంలో మొహరించి సిద్ధంగా ఉన్నారు. వాళ్ల అంచనాలను తలకిందులు చేస్తూ ఖర్గే ఈరోజు రహదారిలో పోరాటం చేయట్లేదని, నేరుగా రాజ్‌ఘాట్‌కు వెళ్లి అక్కడ శాంతియుతంగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టంచేశారు. దీంతో ఎంపీలతో బస్సుల్లో బయల్దేరారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాందీ, టీఎంసీ ఎంపీలు అభిషేక్ బెనర్జీ, మేనకా గురుస్వామి, సాకేత్ గోఖలే, సమీరుల్ ఇస్లాం, ఎస్పీ పార్లమెంట్ సభ్యులు రాజీవ్ రాయ్, మొహీబుల్లాహ్, సీపీఐఎం ఎంపీ జాన్ బ్రిటాస్, సీపీఐ ఎంపీ సందోశ్, ఆర్జేడీ నేత సుధాకర్ సింగ్ తదితరులూ బస్సుల్లో బయల్దేరారు. కొందరు నేతలు బస్సుల పైకి ఎక్కి త్రివర్ణపతాకం చేతబూనారు. వీళ్ల బస్సులను కాంగ్రెస్ మద్దతుదారులు అనుసరించారు. ముఖ్యనేతలు మౌనంగా ఉండిపోయినా కార్యకర్తలు మాత్రం నినాదాలు ఇచ్చారు. యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ, వామపక్ష సంఘాల సభ్యులు వెంట నడిచారు. మింటో రోడ్, ఆసిఫ్ అలీ రోడ్ దాటుకుని ఢిల్లీగేట్, డిలైట్ సినిమా మీదుగా రాజ్‌ఘాట్‌కు శాంతియుత ర్యాలీ కొనసాగింది. ర్యాలీ చాలా నెమ్మదిగా సాగడంతో ఐదు కిలోమీటర్ల దూరం వెళ్లడానికి దాదాపు రెండు గంటల సమయం పట్టింది. ఆ ముగ్గురికీ జ్ఞానం ప్రసాదించండి.. రాజ్‌ఘాట్‌లో మహాత్ముని స్మారకం వద్ద ఖర్గే, రాహుల్, ప్రియాంక, అభిõÙక్బెనర్జీ, మహువా మొయిత్రా, ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ, రాజీవ్ శుక్లా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, దీపేందర్ హూడా తదితర నేతలు తొలుత అంజలి ఘటించారు. ఎస్ఐఆర్ పేరిట ఓట్ల తొలగింపు, అక్రమాలతో ఓట్ల చోరీ వంటి పాపాలు చేయకుండా బీజేపీ ప్రభుత్వానికి, సీఈసీ జ్ఞానేశ్‌కు జ్ఞానోదయం కలిగేలా చేయాలని విపక్ష నేతలు ప్రారి్థంచారు. తర్వాత అక్కడి ప్రాంగణంలో నేలపై కూర్చుని మౌనంగా నిరసన కొనసాగించారు. రాహుల్ తదితరులు కొంతసేపు మౌనముద్రలో ఉండిపోయారు. తిరుగుపయనమయ్యేటపుడు ఖర్గే మీడియాలో మాట్లాడారు. ‘‘ప్రభుత్వం ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకుంటుందని ఆశిస్తూ అందరం ప్రార్థనలుచేశాం. ఇకనైనా ఓట్ల చోరీ ఆగిపోవాలి. తప్పులు చేసిన వాళ్లు రాజీనామా చేసి ప్రాయశ్చిత్తంచేసుకోవాలి. ఓటేసే హక్కును మోదీ ప్రభుత్వం అక్రమంగా లాక్కుంటోంది. గొప్ప నేతలు గాంధీజీ, నెహ్రూ, సర్దార్ పటేల్ సాధించిన హక్కును ఇప్పుడొచ్చి వీళ్లు లాగేసుకుంటున్నారు. దేశాన్ని హైజాక్ చేస్తున్న మోదీ, షా, జ్ఞానేశ్‌ల నేరపూరిత కుట్రను భారత పౌరులకు గాందీజీ సాక్షిగా తెలియజెప్పేందుకు ఇక్కడికొచ్చాం’’అని ఖర్గే అన్నారు. రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేస్తాం.. అంతకుముందు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ మాట్లాడారు. ‘‘గాందీజయంతి రోజునే రాష్ట్రపతిని కలిసేందుకు విజ్ఞప్తిచేశాం. భేటీకొచ్చేవాళ్ల అందరి పేర్లు ముందే చెప్పాలన్నారు. పేర్లతో ఐదోతేదీన మళ్లీ అభ్యరి్థంచాం. నేడో, రేపో పిలుపు రావొచ్చు. రాష్ట్రపతి ముర్మును కలిసి స్వయంగా ప్రస్తుత ఓట్ల దారుణోదంతాన్ని వివరిస్తాం’’అని తెలిపారు. అంతకుముందు రాజ్‌ఘాట్‌కు బస్సులో వచ్చేటప్పుడు రాహుల్ ఒక వీడియో సందేశం ‘ఎక్స్’లో విడుదలచేశారు. ‘‘గత 10–15 ఏళ్లలో ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యం అమలు, రాజ్యాంగం దారుణంగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు రాజకీయ చైతన్యం మొదలైంది. త్వరలోనే ప్రభుత్వాలు మారతాయి. అప్పుడు అసలైన దర్యాప్తు ఆరంభమవుతుంది. దోషులుగా తేలితే మోదీ, షా, మోహన్ భాగవత్, వీళ్ల తోటి నేరస్తులకు కఠిన శిక్షలు పడతాయి’’అని అన్నారు. తర్వాత రాజ్‌ఘాట్ వద్ద రాహుల్ మాట్లాడారు. ‘‘ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్న మోదీ, షా, జ్ఞానేశ్ త్రయాన్ని చట్టం ముందు నిలబెడతా. ఇదే నా వాగ్దానం’’అని అన్నారు. శుక్రవారం మరో తరహాలో ఉద్యమం కొనసాగుతుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ వెల్లడించారు. మరోవైపు బుధవారం ధర్నాకు సంబంధించి రాహుల్, ప్రియాంకలపై ఢిల్లీలో గురువారం ఎఫ్ఐఆర్ నమోదైంది.నేడు పార్లమెంట్ హౌస్‌లో భేటీశుక్రవారం ఉదయం పార్లమెంట్ హౌస్‌లో విపక్ష ఎంపీలు భేటీ అయి తదుపరి కార్యాచరణ ఖరారుచేసే ఆస్కారముంది. ముందే పిలుపొస్తే రాష్ట్రపతిభవన్‌కు వెళ్లి వినతిపత్రం సమరి్పంచే వీలుంది. శుక్రవారం భేటీలో టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ నేత రాంగోపాలయాదవ్ పాల్గొనే అవకాశం ఉంది. గురువారం రాజ్‌ఘాట్‌కు మమత రావాల్సి ఉంది. అయితే ఆమె ప్రయాణించాల్సిన విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ఆమె రాక చాలా ఆలస్యమైంది. శివసేన(యూబీటీ), శరద్‌పవార్ సారథ్యంలోని ఎన్సీపీ(ఎస్పీ)లు గురువారం నిరసనలో పాల్గొనలేదు. -
తొలి దశలో 10–15 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రి య చేపట్టడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో తొలుత ఈ ప్రక్రియను పూర్తిచేయాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు శనివారం వెల్లడించాయి. అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్లో 2026లో ఎన్నికలు జరగబోతున్నాయి. తొలి దశలో 10 నుంచి 15 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ నిర్వహించే అవకాశం ఉంది. తొలి దశ ఎస్ఐఆర్కు సంబంధించిన షెడ్యూల్‌ను వచ్చే వారమే ప్రకటించనున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న లేదా జరగబోయే రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ను ఇప్పుడే ప్రారంభించవద్దని నిర్ణయించింది. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బ ంది స్థానిక సంస్థల ఎన్నికల్లోనే తలమునకలై ఉంటారు. ఎస్ఐఆర్ విధుల్లో వారు పాల్గొనే పరిస్థితి ఉండదు కాబట్టి తదుపరి దశలోనే ఈ ప్రక్రియ చేపడతారు. బిహార్‌లో ఇటీవల ఎస్ఐఆర్ను పూర్తిచేసిన సంగతి తెలిసిందే. సమగ్ర సవరణ తర్వాత 7.42 కోట్ల మంది ఓటర్లతో తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రచురించింది. అనర్హులైన 3.66 లక్షల మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించింది. ఓటర్లు మరణించడం, శాశ్వతంగా వలస వెళ్లడం, డూప్లికేట్ ఎంట్రీ తదితర కారణాలతో ఈ పేర్లను తొలగించినట్లు ఎన్నికల సంఘం తేలి్చచెప్పింది. ఇదిలా ఉండగా, పశి్చమ బెంగాల్లో నవంబర్ 1 నుంచి ఎస్ఐఆర్ ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. -
ఓట్లు పోయాయ్!
జిల్లాలోని కడప అసెంబ్లీ సెగ్మెంట్ మొదలుకొని అనేక నియోజకవర్గాల్లో ఓట్లు మాయం కావడం ఆందోళన కలిగిస్తోంది.కడపలో కొంతమంది ప్రజాప్రతినిధుల కుటుంబీకుల ఓట్లు కూడా గల్లంతయ్యాయి. త్వరలో ఎన్నికల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు చైతన్యం కల్పిస్తే ఓటుహక్కు నమోదుకు ప్రజలు కూడా ఉత్సాహం చూపుతారు. కానీ ఉన్న ఓట్లు కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సాక్షి కడప : జిల్లా కేంద్రమైన కడపలో భారీగా ఓట్లు గల్లంతయ్యాయి. కడప నగర పరిధిలోని దాదాపు 50 డివిజన్ల పరిధిలో భారీ ఎత్తున ఓట్లు కనిపిం చడం లేదు. చాలాకాలంగా దీనిపై ఎన్నో కసరత్తులు చేస్తున్నా పరిస్థితి మాత్రం అంతుచిక్కడం లేదు. దాదాపు 70–80 వేల ఓట్లు గల్లంతయ్యాయి. చివరకు కడప ఎమ్మెల్యే ఎస్బీ అంజద్‌బాషా ఓటు సైతం ఆయనకు తెలియకుండానే డోర్ నంబరు మారిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా అధికారులు ఒక్కసారి ప్రత్యేక దృష్టి సారిస్తే తొలగిన ఓట్లను చేర్చుకునేందుకు ప్రణాళిక రూపొం దించవచ్చు. 100 కాదు..1000 కాదు....సుమారు 70– 80వేల మేర ఓట్లు కనిపించకుండా చేయడంపై పలువురు పెదవి విరుస్తున్నారు. 2014 ఎన్నికలకు సంబంధించి దాదాపు 2,45,000 పైగా ఉన్న ఓట్లు ఒక్కసారిగా 1,73,000లకు పడిపోయాయంటేనే అంతుచిక్కడం లేదు. అంతా జంబ్లింగ్ కడప నియోజకవర్గంలో ఓట్లు గల్లంతైన నేపథ్యంలో ఒకసారి పరిశీలిస్తే ఎక్కడ ఓట్లు ఎక్కడికో పోయినట్లు కనిపిస్తున్నాయి.. ఉదాహరణకు ప్రకాశ్‌నగర్‌లో ఉన్న ఒక వ్యక్తి ఓటు.. చిన్నచౌకు ఏరియాలో కనిపిస్తుండటం లాంటివి చెప్పుకోవచ్చు..ఇలా జంబ్లింగ్ అయినవి భారీగా ఉంటాయని తెలుస్తోంది. నివాసం ఉండేచోట కాకుండా మరో చోటికి ఓట్లన్ని జంబ్లింగ్ పద్ధతిలో మారాయి. ఎలా మారాయన్నది కూడా అర్థం కావడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి ఓటర్ల చేర్పునకు కృషి చేయాలని పలువురు కోరుతున్నారు. మరికొన్నిచోట్ల ఇదే పరిస్థితి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో కూడా ఓట్లు కనిపించడం లేదు. గతంతో పోలిస్తే వేల సంఖ్యలోనే మాయమయ్యాయి. బద్వేలు నియోజకవర్గంలోనూ చాలా కనుమరుగయ్యాయి. 2 లక్షల పైచిలుకు ఓట్లున్న సెగ్మెంట్లో ప్రస్తుతం 1.80 లక్షలు మాత్రమే కనిపిస్తున్నాయి. అంటే దాదాపు 20 వేల మేర కనిపించకుండా పోయాయి. అయితే వివిధ రకాల పనుల నిమిత్తం ఇక్కడికి వచ్చి స్థానికత పేరుతో ఓటుకార్డు తీసుకున్నప్పటికీ ఇప్పుడు అందరూ వెళ్లిపోవడంతో ఓట్లు పోయినట్లు అక్కడి అధికారుల ద్వారా తెలుస్తోంది. మైదుకూరు నియోజకవర్గం 1.80 లక్షలకు పైచిలుకు ఓట్లు ఉంటే ఇటీవల 9–10 వేలు మాయమయ్యాయి. పులివెందుల నియోజకవర్గంలో కూడా రెండు లక్షలకు పైగా ఓట్లు ఉండగా, దాదాపు 4–5 వేలు కనిపించడం లేదు. ఎందుకు ఈ విధంగా జరుగుతుందనేది అధికారులకే ఎరుక! జమ్మలమడుగు పరిధిలో కూడా దాదాపు మూడు వేల ఓట్ల వరకు, రాజంపేట పరిధిలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రైల్వేకోడూరులోనూ దాదాపు 4 వేల ఓట్లు మాయమైనట్లు తెలియవచ్చింది. సర్వే చేసినా..... కడప నగరంలో ఓట్లకు సంబంధించి సుమారు 500 మంది సిబ్బందితో అధికారులు గతంలో సర్వే చేపట్టారు. 260మంది బీఎల్ఓలు, మరో 250 మంది ట్యాబ్ ఆపరేటర్లర్లు.. 26 మంది సూపర్వైజర్లు.. ఇతర సిబ్బందితో కలిపి దాదాపు 500 మంది సర్వేలో పాల్గొన్నారు. అప్పట్లో కొంతమేర చేసినప్పటికీ చాలాచోట్ల డోర్ లాక్డ్, ఇతర సమస్యలు ఉత్పన్నమైనట్లు తెలిసింది. సర్వేతో 10–20 వేలు మేర ఓట్లు రికవరీ అయినప్పటికీ ఇంకా పెద్ద ఎత్తున రావాల్సి ఉంది. అధికారులు కూడా ఒక ప్రత్యేక కార్యక్రమం చేపట్టి మళ్లీ ఎన్రోల్మెంట్ చేస్తే తప్ప సాధ్యమయ్యే పని కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మళ్లీ త్వరలో అవకాశం ఉంటుంది కడప నగరంతోపాటు అన్నిచోట్ల ఓట్ల మార్పులు, చేర్పులకు మళ్లీ అవకాశం ఉంటుందని, అప్పుడు ఓట్లు లేని వారు దరఖాస్తు చేసుకోవచ్చని కడప ఆర్డీఓ దేవేందర్‌రెడ్డి తెలియజేశారు. కడప నగరంలో ఓట్లు పోయిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లగా స్పందించారు. చాలా వరకు అడ్రస్సుల మార్పు, ఆధార్ సీడింగ్, మనుషులు చనిపోయిన నేపథ్యంలోనే ఓట్లు పోయాయి తప్ప వేరే కారణాలు కావన్నారు. ప్రస్తుతం 1,76,000కు పైగా కడపలో ఓట్లు ఉన్నాయని వెల్లడించారు. ఓటు కావాల్సిన వారు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి వివరాలు చెప్పినా అప్లోడ్ చేస్తారని, అంతేకాకుండా గతంలో కూడా అడ్రస్సులు, ఇతర అనేక కారణాలపై సర్వే చేయించనున్నట్లు తెలిపారు. ఎవరి ఓట్లు ప్రభుత్వ అధికారులు తొలగించలేదని ఆయన స్పష్టం చేశారు. సెప్టెంబరు 1వ తేదీన డ్రాఫ్ట్ పబ్లికేషన్ జరగనుందని, మరొకసారి నిరంతరం కార్యక్రమంలో భాగంగా ఓటర్ల నమోదుకు అవకాశం కల్పిస్తామని ఆర్డీఓ వివరించారు. పాత జాబితాలో లేని వారు నమోదు చేసుకోవచ్చన్నారు. లోపం ఎక్కడ.. జిల్లాలో ఓట్ల మార్పులు, చేర్పుల్లో పెద్ద ఎత్తున తొలగింపు చూస్తే ఎక్కడ లోపమో అర్థం కావడం లేదు. ప్రధానంగా ఎన్నికల సంఘం ప్రయోగాత్మకంగా నజ్రరి నక్ష కార్యక్రమాన్ని అమలు చేసింది. కడప నగరంలో మాత్రమే అమలు చేసినట్లు తెలియవచ్చింది. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి కొత్త డోర్ నంబర్లను వేయడంతో బీఎల్ఓల ట్యాబుల్లో లిస్టుకు సరిపడనట్లు తెలియవచ్చింది. దాదాపు 261 పోలింగ్ బూత్‌ల పరిధిలో ఓట్లకు సంబంధించి ప్రత్యేకంగా అధికారులు ఎన్ని సమాలోచనలు చేసినా మొత్తానికైతే ఓటర్ల చేర్పులు కనిపించడం లేదు. అడ్రస్సుల గల్లంతు...ఒక భవనంలో మూడంతస్తులుంటే...కేవలం ఒక భవనానికి మాత్రమే డోర్ నంబరు ఇవ్వడంతో పైన ఉన్న రెండు, మూడు అంతస్తుల్లో ఉన్న ఓటర్లు జాబితా నుంచి మాయమయ్యారు. ఇలా అనేక రకాల సమస్యల వల్ల ఓట్లు తొలగిపోయాయి. కిందిస్థాయిలో డోర్ టు డోర్ వర్క్ చేస్తే మళ్లీ యథావిధిగా ఓట్లు పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న వారు వేరే ప్రాంతాలకు బదిలీపై వెâళ్లడం, అడ్రస్సుల మార్పు, ఆధార్ అనుసంధానంతో కొంతమేర తగ్గినట్లు అధికారులు పేర్కొంటున్నారు. -
ప్రజల భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్యం
సాక్షి, హైదరాబాద్: ప్రజల భాగస్వామ్యంతోనే దేశంలో పరిపూర్ణ ప్రజాస్వామ్యం సాధ్యమని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ అన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా బుధవారం బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓటర్ల జాబితా సవరణ అనేది నిరంతర ప్రక్రియ అని... ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా జాబితాను రూపొందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యమే అత్యంత కీలకమని వ్యాఖ్యానించారు. ఎన్నికలను ప్రశాంతంగా, పక్షపాత రహితంగా నిర్వహించేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తానని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్‌లో భారీగా ఓటర్లను తొలగించారని వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తానన్నారు. అటవీ శాఖ ముఖ్యకార్యదర్శిగా బిజీగా ఉండటంతో బాధ్యతలు చేపట్టేందుకు ఆలస్యమైందని వివరించారు. రాజ్యసభ ఎన్నికల్లో ఇప్పటివరకు నామినేషన్ దాఖలు కాలేదన్నారు. -
22,16,697 జిల్లాలోని ఓటర్ల సంఖ్య
సాక్షి, సంగారెడ్డి: జిల్లాలో ఓటర్ల సంఖ్య పెరిగింది. మహిళా ఓటర్లతో పోలిస్తే పురుష ఓటర్లు పెరిగారు. ఎన్నికల అధికారులు ఓటర్ల జాబితా సవరణ చేపట్టి తుది ఓటర్ల జాబితాను వెలువరించారు. నవంబర్, 2014 ఓటర్ల జాబితాను అనుసరించి జిల్లాలో 22,10,253 మంది ఓటర్లు ఉన్నారు. కాగా సవరణల అనంతరం జిల్లాలో ఓటర్ల సంఖ్య 22,16,697కు చేరుకుంది. జిల్లాలో మొత్తం 31,97,684 మంది జనాభా ఉండగా వీరిలో22,16,697 మంది ఓటర్లుగా నమోదు అయ్యారు. జిల్లాలో ఓటర్ల సవరణల కోసం మొత్తం 24,418 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 11,935 దరఖాస్తులను వేర్వేరు కారణాలతో తిరస్కరించారు. పరిగణలోకి తీసుకున్న 12,483 దరఖాస్తులను పరిశీలించగా వీటిలో 6039 మంది ఓటర్లను తిరస్కరించటం జరిగింది. దీంతో కొత్తగా 6444 మంది ఓటర్లు పేర్లు తుది జాబితాలో చేర్చటం జరిగింది. సవరించిన తుది ఓటర్ల జాబితాతో పోలిస్తే జిల్లాలో ఓటర్లు 6444 మంది పెరిగారు. తుది జాబితాను పరిగణనలోకి తీసుకుంటే జిల్లాలో 0.29 శాతం మేర ఓటర్లు పెరిగారు. కాగా సవరణ జాబితా ప్రకారం జిల్లాలో పురుష ఓటర్ల సంఖ్య పెరిగింది. 2014 ఓటర్ల జాబితాలో జిల్లాలో 11,16,844 మంది పురుష ఓటర్లు ఉండగా తాజాగా పురుష ఓటర్ల సంఖ్య 11,20,163కు చేరుకుంది. 3319 మేర పురుష ఓటర్లు పెరిగారు. మహిళా ఓటర్లు గత ఓటర్ల జాబితాలో 10,93,289 మంది ఉండగా తాజా జాబితాలో మహిళా ఓటర్ల సంఖ్య 10,96,412కు చేరుకుంది. ఇతర ఓటర్లు 122 మంది ఉన్నారు. కొత్త ఓటరు జాబితాలో 18 నుంచి 19 ఏళ్ల వయస్సు ఉన్న వారు పురుషులు 1950 మంది, మహిళలు 1377 మంది కొత్త ఓటర్లుగా నమోదు అయ్యారు.


