సత్యయుగ్ నుంచి గోల్డ్ సిప్ పథకం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బాలీవుడ్ నటి శిల్పా షెట్టికి చెందిన సత్యయుగ్ గ్రూపు చిన్న మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. రోజుకు రూ. 50ల బంగారాన్ని కూడా కొనుగోలు చేసే విధంగా ‘మేరా గోల్డ్ ప్లాన్’ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం కింద రోజుకు కనీసంగా రూ. 50 లేదా నెలకు రూ.1,000 చొప్పున బంగారాన్ని కొనుగోలు చేయొ చ్చు.
ఈ పథకం వివరాలను తెలియచేయడానికి గురువారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సత్యయుగ్ సీఈవో రాజ్ కుంద్రా మాట్లాడుతూ టాప్ 5 బ్యాంకుల ధర కంటే తక్కువ రేటుకే బంగారాన్ని అందిస్తామని, ఇందులో ఎటువంటి అదనపు రుసుములు ఉండవన్నారు. అలాగే బంగారాన్ని భద్రపర్చడానికి ఎటువంటి చార్జీలు చెల్లించనవసరం లేదని, ఎప్పుడు కావాలంటే అప్పుడు బంగారాన్ని తీసుకోవడం లేదా అమ్ముకోవడం చేయొచ్చన్నారు. రెండు నెలల క్రితం ప్రారంభించిన ఈ పథకానికి ఆదరణ బాగుందని, ఈ ఏడాది రెండు లక్షల మంది ఖాతాదారులకు రూ. 400 కోట్ల విలువైన బంగారాన్ని విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా సొంతగా ఏడు ఔట్లెట్లు ఉన్నాయని, వచ్చే 18 నెలల్లో హైదరాబాద్తో సహా అదనంగా 22 శాఖలను ఏర్పాటు చేయనున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇది నెలవారీ వాయిదాల చెల్లింపుతో బంగారం కొనుగోలుచేసేందుకు ఉద్దేశించిన సేవింగ్స్ పథకాల్లోకి రాదని, దీంతో దీనికి ఆర్బీఐ నిబంధనలు, కొత్త కంపెనీల చట్టం నిబంధనలు వర్తించవన్నారు. గోల్డ్ సేవింగ్స్ పథకాల్ని ఇటీవల ఆర్బీఐ నిషేధించడం తెలిసిందే.