breaking news
Sadashiva Reddy (35)
-
బీసీఐ చైర్మన్ మనన్ దిగిపోవాలి
సాక్షి, న్యూఢిల్లీ: బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) చైర్మన్ మనన్ మిశ్రా తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని బీసీఐ కో–చైర్మన్, సీనియర్ న్యాయవాది వైఆర్ సదాశివరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మిశ్రాకు శనివారం ఆయన ఒక ఘాటు లేఖ రాశారు. 15 రోజుల్లోగా చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. నిధుల మళ్లింపు, అక్రమ నియామకాలు, అధికార దుర్వినియోగం సహా 8 ప్రధాన కారణాలను ప్రస్తావిస్తూ మనన్ రాజీనామాకు సదాశివరెడ్డి పట్టుబట్టారు. బీసీఐ ఖాతాలతో పాటు ఆయన హయాంలో ఏర్పాటైన ట్రస్ట్ ఖాతాలపై స్వతంత్ర ఆడిట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆరోపణలపై చర్చించేందుకు కౌన్సిల్‌ను అత్యవసరంగా సమావేశ పరచాలని కోరారు. హైదరాబాద్‌లోని నల్సా ర్ న్యాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవా నికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ హాజరుకావడాన్ని తప్పుబట్టిన విద్యార్థులను మనన్ మిశ్రా బెదిరించడాన్ని సదాశివరెడ్డి తప్పుబట్టారు. మిశ్రా తన పదవీకాలంలో 2020లో ’బీసీఐ ట్రస్ట్ పెర్ల్– ఫస్ట్’ పేరిట తనకు కావలసిన వారితో ఒక కొత్త ట్రస్టును ఏర్పాటు చేశారని సదాశివరెడ్డి ఆరోపించారు. కౌన్సిల్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ బీసీఐ నిధుల నుంచి దాదాపు రూ.150 కోట్లను ఆ ట్రస్టుకు మళ్లించారన్నారు. బీసీఐ ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థల్లో కీలక పరిపాలనా పోస్టులన్నీ మిశ్రా బంధువుల చేతుల్లోనే ఉన్నాయని గుర్తుచేశారు. ఏమాత్రం అర్హత లేని కాలేజీలకు అనుమతులు ఇవ్వడంతో న్యాయ విద్యలో నాణ్యత పడిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 2012 నుంచి వరుసగా 14 ఏళ్లకు పైగా మిశ్రా చైర్మన్ పదవిలో కొనసాగడం పార్లమెంటు ఉద్దేశించిన రొటేషనల్ విధానానికి విరుద్ధమని పేర్కొన్నారు.ఆరోపణలను ఖండించిన మనన్తనపై వచ్చిన ఆరోపణలను మనన్ ఖండించారు. ‘‘ఆరోపణలు గుప్పిస్తున్న సదాశివరెడ్డి బీసీఐలో ప్రస్తుతం సభ్యుడు కాడు. సొంత రాష్ట్రం కర్ణాటక నుంచి ఈసారి ఆయన పోటీచేయలేదు. గత ఎనిమిదేళ్లుగా బీసీఐ సభ్యునిగా ఉన్న కాలంలో చేయని ఆరోపణలు ఇప్పుడెందుకు చేస్తున్నట్లు? అయినా నేనెంత నిజాయతీపరుడినో బార్ కౌన్సిల్లో అందరికీ తెలుసు. పాతిక లక్షల మంది లాయర్ల మద్దతున్న నన్ను సోషల్‌మీడియాలో సదాశివరెడ్డి లాంటి వాళ్లు ఎంతో మంది విమర్శిస్తుంటారు’’ అని మనన్ వ్యాఖ్యానించారు. -
చలాకీగా ఉండేవాడు.. జీవచ్ఛవంలా మిగిలాడు..
సుల్తాన్‌బజార్ : ఎనిమిదేళ్ల నాటి దుర్ఘటన వారిని ఇంకా వెంటాడుతునే ఉంది. ఎంటెక్ చదివి ఇంజినీరుగా పనిచేస్తున్న ఆ యువకుడు స్నేహితులతో కలిసి చాట్ తిందామని 2007లో ఆగస్టు 25న గోకుల్ చాట్‌కు వచ్చిన అతడు ఉగ్రవాదులు పెట్టిన బాంబు పేలుడులో తీవ్రంగా గాయపడిన సరూర్‌నగర్ వాసి సదాశివ రెడ్డి(35) ఇప్పుడు వికలాంగుడిగా మిగిలాడు. కదలలేని స్థితిలో ఉన్న అతడిని చూస్తూ కన్నవారు తట్టుకోలేక పోతున్నారు. నాటి దుర్ఘటనలో ప్రాణాలు పోగొట్టుకున్న వారికి నివాళులు అర్పించేందుకు మంగళవారం సదాశివరెడ్డి తల్లిదండ్రులు మోహన్‌రెడ్డి, వసంత సహాయంతో కోఠి గోకుల్ చాట్‌కు వచ్చాడు. నాటి బాంబు పేలుళ్లలో అన్ని అవయవాలు చచ్చుబడిపోయాయని తల్లి రోదించడం అందరినీ కలిచివేసింది. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి తక్షణ సహాయం కింద రూ. 20 వేల చెక్కు ఇచ్చారని, వైద్య ఖర్చులు భరిస్తామని, ప్రభుత్వ ఉద్యోగం, రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని వైఎస్ హామీ ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్ చొరవతో తన రెండో కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందన్నారు. వైస్సార్ అకాల మరణంతో వైద్య ఖర్చులు చెల్లించకపోవడంతో నాంపల్లి కేర్ ఆసుపత్రి నుంచి ఇంటికి పంపేశారని, తమకు ఇస్తామన్న ఎక్స్‌గ్రేషియా, వైద్య సదుపాయాలు లే వని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి తమకు న్యాయం చేయాలని ఆమె కోరారు. మరో బాధితుడు సయ్యద్ రెహమాన్ గోకుల్ చాట్ వద్ద నివాళులు అర్పించారు. నాటి పేలుడులో తనకు కన్ను పోయిందని, ప్రభుత్వం వికలాంగ ఫించన్, ఇల్లు, జిరాక్స్ మిషన్ ఇచ్చి ఆదుకోవాలని అక్కడ బ్యానర్ ప్రదర్శించాడు.


