breaking news
Public authorities
-
అటకెక్కుతున్న ఆర్టీఐ చట్టం!
దేశమంతటా సమాచార హక్కు చట్టం క్రమంగా బలహీనపడుతోంది. ప్రజా స్వామ్య పాలనలో పారదర్శకతకు ప్రాణం పోయడానికి వచ్చిన చట్టం, ఇప్పుడు తానే ‘ప్రాణాపాయ’ స్థితిలో కొట్టు మిట్టాడుతోంది. 21 యేళ్ల కింద (2005 అక్టోబర్ 11) ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చినపుడు ‘‘ప్రజా సమాచారాన్ని ప్రజ లకు సులభంగా అందుబాటులోకి తెచ్చే ఒక పక్కా వ్యవస్థ ద్వారా పారదర్శక సంస్కృతిని పెంపొందించడమే లక్ష్యం’’ అని పేర్కొన్నారు. ఆర్టీఐ చట్టం వచ్చిన ఆరంభం నుంచి అటు అడిగేవారు, ఇటు ఇచ్చేవారు... ఇరుపక్షాల్లో అవగాహన పెరుగుతున్న క్రమంలోనే పారదర్శక వాతావరణం బలపడుతూ వచ్చింది. మొదట్లో సమాచార కమిషన్లు కూడా క్రియాశీలంగా పని చేశాయి. సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు, అడ్వకేట్లు, కార్పొరేట్ ప్రత్యేక సెల్స్ స్థాయి దాటి సామాన్యుల వరకు కూడా ఈ చట్టం, దాని గొప్పదనం పరిచయమైంది. ప్రభుత్వ, పాలనా వ్యవస్థల్లోని సమాచారం సులభంగా ప్రజాబాహుళ్యంలోకి రావడం మొదలైంది. ఆర్టీఐ దరఖాస్తులు పెట్టడం, సమాచారం లభించని చోట అప్పీళ్లు, రెండో అప్పీళ్ల వరకూ వెళ్లింది.అప్పీళ్ల తర్వాతా న్యాయం జరుగకుంటే న్యాయస్థానాల తలుపు తట్టిన సందర్భాలు కోకొల్లలుగాఉండేవి.ఆర్టీఐ ద్వారా సమాచారం పొంది, తమకు చట్టబద్దంగా, రాజ్యాంగం పరిధిలో రావాల్సిన ప్రయోజనాలను, జరగకుండా పోయిన మేలును పట్టుబట్టి పౌరులు సాధించుకోవడం కథలు కథలుగా పలు విజయగాథలు మీడియాలో వచ్చేవి. తొలి రెండు మూడేళ్లలోనే కొన్ని సవరణలు ప్రతిపాదించి, చట్టాన్ని బలహీన పరచడానికి జరిగిన యత్నాన్ని పౌరసమాజం అడ్డుకుంది. స్వచ్ఛంద వెల్లడి ‘సెక్షన్ 4’కు గ్రహణంచట్టం అమలు బలహీనపడుతున్న క్రమంలోనే 2019లో, కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని సవరించి మరింత బలహీన పరిచింది.స్థూలంగా పారదర్శకత పైనే పెద్ద వేటు వేసింది. ‘వ్యక్తిగత గోప్యత సమాచార భద్రత (డీపీడీపీ) చట్టం’ తెచ్చే క్రమంలో, ఆర్టీఐ చట్టానికి వర్తించేలా రూపొందించిన నిబంధనలు, ప్రభుత్వాల తదనంతర ఉత్తర్వులు, ఆదేశాలు ఆర్టీఐ ప్రభావాన్ని మరింత నీరుగార్చాయి. సమాచార హక్కు చట్టానికి ఆయువు పట్టు, స్వచ్చంద సమాచారాన్ని వెల్లడించే ‘సెక్షన్–4’. పాలనా వ్యవస్థల్లో అతి చిన్న యూనిట్ అయిన గ్రామ సచివాలయం నుంచి అత్యున్నత కార్య క్షేత్రాలయిన రాష్ట్రపతి భవన్, ప్రధాని ఆఫీస్ వరకు ప్రతి పౌర కార్యాలయం (పబ్లిక్ అథారిటీ)కు బాధ్యతను ఈ చట్టం నిర్దేశించింది. ఎవరూ అడగకుండానే నిర్దిష్ట సమాచారాన్ని స్వచ్ఛందంగా, తప్పనిసరిగా వెల్లడి చేయాలనే అందులోని 4 (1), (బి) సబ్ క్లాజ్ ఎంతో ముఖ్య మైంది. దీని ప్రకారం ప్రతి కార్యాలయం... అక్కడ ఏం పని జరుగు తోంది? అధికారులు–సిబ్బంది ఎవరెవరుంటారు? వారి విధులు– బాధ్యతలేంటి? ఆ వార్షిక సంవత్సరం నిధులు, గ్రాంట్స్, సబ్సిడీలు వంటి బడ్జెట్ ఎంత? లబ్దిదారులెవరు? ఏ ప్రాతిపధికన వారినిఎంపిక చేస్తారు? ఏయే చట్టాలు–నిబంధనలు వర్తిస్తాయి... ఇలా మొత్తం 17 నిర్దిష్ట అంశాల్లో ఆ సమాచారాన్ని స్వచ్చందంగా వెల్లడించాలి. స్థానిక భాషలో, స్థానిక మీడియాలో ప్రచురించడమే కాకుండా ఒక ప్రతిని కార్యాలయంలో అందుబాటులో ఉంచాలి. ఎన్ ఐసీవంటి ఎజెన్సీలు, ఇతర మార్గాల్లో ఆన్ లైన్ లో ఉంచాలి. అడిగిన వారికి, కాగితం ఖర్చులు తీసుకొని ప్రతులు అందజేయాలి. అంటే, దాదాపు ఎనభై, తొంబై శాతం సమాచారం ఏ దరఖాస్తుతో పని లేకుండా పౌరులకు అందుబాటులోకి రావాలి. అప్పుడు, నిర్దిష్టంగా తనకు ఏ సమాచారం అవసరమో... ఆ మిగిలిన పది, ఇరవై శాతం సమాచారానికి మాత్రమే ఎవరైనా దరఖాస్తు చేసుకునే అవసరం ఏర్పడుతుంది. ప్రతి కార్యాలయం తన 4 (1) (బి) సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆధునికీకరించాలని కూడా చట్టం నిర్దేశిస్తోంది. కానీ, తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కేంద్ర స్థాయిలో కూడా ఈ ఆధునీకరించడం అన్నది సవ్యంగా జరగటం లేదు. ‘సతర్క్ నాగరిక్ సంఘటన్ ’ అనే స్వచ్చంద సంస్థ దేశ వ్యాప్త పరిస్థితిని సమీక్షించగా దేశంలోని 29 కమిషన్ల పరిధిలో 4.13 లక్షల అప్పీళ్లు–ఫిర్యాదులు పెండింగ్ లో ఉన్నట్టు తేలింది.లెక్కలు చూపని పబ్లిక్ అథారిటీలు!పదిహేడు అంశాల్లోనే కాకుండా మరికొంత అదనపు సమాచా రాన్ని ఈ స్వచ్ఛంద వెల్లడితో జోడించాలని కేంద్ర ప్రభుత్వసిబ్బంది–శిక్షణ (డీవోపీటీ) మంత్రిత్వ శాఖ గతంలోనే ఉత్తర్వు లిచ్చింది. పబ్లిక్–ప్రయివేట్ భాగస్వామ్య వ్యవహారాలు, భారీ కొనుగోళ్లు (ప్రొక్యూర్మెంట్), ఆర్టీఐ దరఖాస్తులు–స్పందన–విశ్లేషణ వంటి మరో 8 అనుబంధ అంశాల్ని ఇందుకు జతచేసింది. కానీ ఇవేవీ సవ్యంగా అమలు కావటం లేదన్నది, కేంద్ర ప్రభుత్వ కార్యాల యాల ఆన్ లైన్ వ్యవస్థపై జరిపిన తాజా పరిశీలనలో వెల్లడయింది. ఆర్టీఐ చట్ట నిబంధన, 4 (1), (బి) ప్రకారం స్వచ్ఛందంగా వెల్లడించాల్సిన సమాచారం, అదనంగా జోడించిన అంశాల విషయంలోనే కాకుండా మొత్తం పారదర్శకతపైనే తటస్ఠ (మూడో) పక్షంతో ఆడిటింగ్ జరిపించాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆదేశం. సదరు ‘పారదర్శకత తనిఖీ’ నివేదిక ప్రతిని కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) కి పంపించాలన్న ఆదేశాన్ని కూడా మెజారిటీ పౌర కార్యాల యాలు (పబ్లిక్ అథారిటీలు) పాటించడం లేదని సీఐసీ వార్షిక నివేదికే వెల్లడిస్తోంది. కేంద్ర ప్రభుత్వ విభిన్న విభాగాలకు చెందిన 2,303 పౌర కార్యాలయాల్లో (పీఏలు) 1,446 మాత్రమే సదరు నివేదికల్ని సీఐసీతో పంచుకున్నాయి. 37 శాతం పీఏలు అసలు నివేదికల్నే సమర్పించకుంటే, సమర్పించిన (63 శాతం) వాటిలో, సగం కన్నా ఎక్కువ పీఏలు అరకొరగా, మొక్కుబడి సమాచారాన్ని పొందుపరిచినట్టు ఒక మీడియా సంస్థ జరిపిన అధ్యయనం– విశ్లేషణలో వెల్లడయింది. సమాచార కమిషన్ ఆదేశాలూ బేఖాతరు‘‘మీరూ పౌర కార్యాలయాలే’’ అని కేంద్ర సమాచార కమిషన్ పదే పదే నొక్కి చెప్పినా, దేశంలోని ఆరు అగ్రశ్రేణి రాజకీయ పార్టీలు ‘‘మావి పౌర కార్యాలయాలు కావు, మేం ఆర్టీఐ కిందకు రాము’’ అని మొండిగా ససేమిరా అన్నాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తే ఒక కేసు విచారణ సందర్భంగా ‘‘ఫేక్ డిగ్రీల వాళ్లు, పనిలేని వారు, పరాన్నబుక్కులుగా బొద్దింకల్లాగా మారి, అందులో కొందరు ఆర్టీఐ కార్యకర్తలవుతున్నారు’’ అని చులకనగా మాట్లాడిన వైనానికి దేశం విస్మయం చెందింది. అంతకు చాలా ఏళ్లముందు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాటి గవర్నర్ ఒకరు ఇలాగే ఆర్టీఐ కార్యకర్తలపై చులకనగా మాట్లాడేవారు. ఇలా పెద్ద పెద్ద హోదాల్లోని వారే ఆర్టీఐని చిన్న బుచ్చి మాట్లాడటం కూడా చట్టం అమలుపట్ల అధికారయంత్రాంగం నిర్లక్ష్యానికి కారణాల్లో ఒకటిగా పేర్కొనవచ్చు. అధికా రులు, రాజకీయ పక్షాలు, సమాచార కమిషన్లు... ఇలా కీలక వ్యవస్థ లకు చెందిన కొంతమంది కూడబలుక్కున్నట్టు తమ చర్యల ద్వారా ఆర్టీఐ చట్టాన్ని అటకెక్కిస్తున్న జాడలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి.సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టానికి శత్రువులెక్కువ. సామాన్యులు, సగటు పౌరులు, కార్యకర్తలు తప్ప ఈ చట్టానికి చుట్టాలే లేరు. అందుకే, చట్టం అమల్లోకి వచ్చి 21 యేళ్లు పూర్తయినా ఆశించిన ఫలితంకనిపించటం లేదు.-వ్యాసకర్త సమాచార హక్కు చట్టం పూర్వ కమిషనర్, పీపుల్స్ పల్స్ రిసెర్చ్ సంస్థ డైరెక్టర్- దిలీప్ రెడ్డి -
ప్రజా సేవకే అంకితం కావాలి
♦ సర్పంచ్‌లు వెల్ఫేర్ రోల్‌గా మార్పు చెందాలి ♦ ప్రజాప్రతినిధులతో గవర్నర్ ముఖాముఖి సిద్దిపేట జోన్: ‘ప్రజాప్రతినిధులు.. ప్రజా సేవకే అంకితం కావాలి.ప్రజలందరినీ భాగస్వాములను చేసుకుని కలిసి పనిచేయాలి. అభివృద్ధి సాధించాలి’ అని గవర్నర్ నరింహన్ అన్నారు. శుక్రవారం సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు మండలాల ఎంపీటీసీలు, సర్పంచ్‌లతో నాగుల బండ శివారులోని నర్సరీ వద్ద ముఖాముఖి నిర్వహించారు. మంత్రి హరీశ్‌రావుతో కలిసి ముందుగా ప్రజాప్రతినిధులను పరిచయం చేసుకున్నారు. అనంతరం వారితో మాట్లాడారు. వారి మాటల్లోనే... హరీష్‌రావు : గవర్నర్ సిద్దిపేట నియోజకవర్గ ప్రగతిని పరిశీలించడానికి వచ్చారు. కొందరి ప్రజాప్రతినిధులతో ఆయన మాట్లాడాలను కుంటున్నారు. మీలో ఎవరైన ముందుకు రండి అనగానే సర్పంచ్ ఆంజనేయులు వేదిక మీదకు వచ్చారు. గవర్నర్ పలు ప్రశ్నలు అడిగారు. గవర్నర్ : మీ పేరు, ఏ గ్రామం? ఆంజనేయులు : గుర్రాలగొంది సర్పంచ్‌ను, నా పేరు ఆంజనేయులు గవర్నర్ : హరితహారం కింద గ్రామంలో ఎన్ని మొక్కలు నాటారు? ఆంజనేయులు : ప్రస్తుతం 25వేల మొక్కలు నాటాం, లక్ష లక్ష్యంతో ప్రణాళిక రూపొదించాం. గవర్నర్ : మొక్క విలువ తెలుసా? మొక్కను నాటడమే కాకుండా వాటిని పరిరక్షించడం కూడా ముఖ్యమైన బాధ్యత, వైఫల్యం చెందింతే జరిమానా విధిస్తా. డిసెంబర్లో మొక్కల లెక్క చూస్తా తక్కువగా ఉంటే జరిమానా తప్పదు మరీ. అంటూ సీరియస్‌గా ప్లాన్ చేసుకోవాలి. ఆంజనేయులు : మంత్రి హరీశ్‌రావు సూచన మేరకు నాటిన ప్రతి మొక్కను సమష్టిగా కాపాడుకుంటున్నాం. గవర్నర్ : గత ఏడాది గ్రామంలో ఎన్ని మొక్కలు నాటారు. ఆంజనేయులు : 34 వేల మొక్కలు నాటగా, వాటిలో 22 వేలు మొక్కలు బతికాయి. గవర్నర్ : మిగత వాటి మాటమేమిటి ? ఈ సారి మళ్లీ పునరావృతం కాకుండా చూసుకోండి. అంటునే మహిళ ప్రజా ప్రతినిధి ఒకరు ముందుకు రావాలని సూచించ గా రామంచకు చెందిన ఎంపీటీసీ విజయదేవి వేదిక మీదకు వచ్చారు. గవర్నర్ : ప్రస్తుతం మహిళా సర్పంచ్ల కాలం నడుస్తోంది. ఇప్పటి వరకు ఇబ్రహీంపూర్ సందర్శించా అక్కడి మహిళ సర్పంచ్ పనితీరు ఆదర్శనీయం. మీ గ్రామం కూడా ఇబ్రహీంపూర్ మాదిరిగా అభివృద్ధి చెందాలి. ఎంపీటీసీ: మంత్రి సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నాం. గవర్నర్ : సర్పంచ్ రోల్ చాల గొప్పది. సర్పంచ్ అనగానే రాజకీయాలు అనుకోవద్దు. సర్వీస్, సంక్షేమ భావంతో పనిచేయాలి. గ్రామాల్లో ప్రజలందరినీ కలుపుకుని వారిని ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో భాగస్వామ్యం చేయాలి. కలిసి పనిచేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. సర్పంచ్ల స్టోరీ మారింది. నేటి నుంచి కొత్త స్టోరిగా మారాలి. పొలిటికల్ రోల్ నుంచి వేల్ఫేర్ రోల్ దిశగా సర్పంచ్‌లు సాగాలి. గ్రామాల్లో పారిశుద్ధ్యం, నీటి సరఫరా, ఉపాధి కల్పనా, హరితహారం లాంటివి చేపట్టాలి. గ్రామంలో పనిలేకుండా ఎవ్వరూ ఉండరాదు. ఆ దిశగా ఉపాధి శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసి సర్వీస్ రోల్‌తో మంచి పేరును సాధించుకోండి ఇప్పటికే మీ నియోజకవర్గం ఆదర్శంగా నిలుస్తుంది. మీ మంత్రి హరీష్‌రావు అనుకున్నది సాధిస్తాడు. గ్రామంలో బడి వయస్సు కలిగిన పిల్లలు ఇళ్లల్లో ఉండరాదు, అక్షరాస్యత శాతం పెంచాలి. ఈ ముఖాముఖిలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ సొలిపేట రామలింగారెడ్డి, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్, రాష్ట్ర హరితహారం పథకం ఇన్చార్జి ప్రియాంక నర్గీస్, సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిదులు పాల్గొన్నారు.


