Modular Kitchens
-
ఇంటి విలువను పెంచే కొత్త రకం కిచెన్..
ఇంట్లో వంట గది స్థానం ప్రత్యేకం.. ఇంటిల్లిపాది ఆరోగ్యానికి, శ్రేయస్సుకు, సానుకూల శక్తికి బీజం పడేది ఇక్కడే. అందుకే వాస్తుశాస్త్రంలోనూ వంట గదికి ప్రత్యేక స్థానాన్ని కేటాయించారు. అలాంటి కిచెన్ రూమ్ అందంగా, ఆకర్షణీయంగా, శుభ్రంగా ఉండాలి కదా.. అందుకే మార్కెట్లో రకరకాల మాడ్యులర్ కిచెన్స్ అందుబాటులోకి వచ్చాయి. కానీ, కలప, వెదురుతో కిచెన్ వార్డ్ రోబ్స్ తయారు చేస్తుండటంతో కొంతకాలం తర్వాత మన్నిక తగ్గి సమస్యలు ఎదురవుతున్నాయి. దీనికి పరిష్కారమే ‘స్టెయిన్ లెస్ స్టీల్ మాడ్యులర్ కిచెన్స్’! సంప్రదాయ వంట గదులకు కాలం చెల్లింది. ఇప్పటివరకు లగ్జరీ హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, బార్లు, కాఫీ షాప్స్‌లో వినియోగించిన స్టెయిన్లెస్ స్టీల్ కిచెన్స్‌ను ఇప్పుడు ఇళ్లలోనూ ఏర్పాటు చేస్తున్నారు. ఇంటీరియర్ డిజైనింగ్‌లో స్టెయిన్లెస్ స్టీల్ భాగమైపోయింది. ఇవి సాటిలేని మన్నిక, పరిశుభ్రత, సొగసైన, ఆధునిక సౌందర్యాన్ని అందిస్తాయి. నివాస, వాణిజ్య సముదాయాలు రెండింటిలోనూ అనువైనవి.నిర్వహణ సులువు.. స్టెయిన్లెస్ స్టీల్ వంట గదుల వేడిని గ్రహించవు. తుప్పు నిరోధక గుణాన్ని కలిగి ఉంటాయి. పైగా వీటి ఉపరితలాలపై రంధ్రాలు ఉండకపోవడంతో ద్రవాలు, రసాయనాలు, సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా వంటివి లోపలికి వెళ్లవు. దీంతో ఎప్పుడూ మరకలు లేకండా పరిశుభ్రంగా ఉంటుంది. వీటి నిర్వహణ చాలా సులువు. ప్రత్యేకమైన క్లీనర్లు అవసరం లేకుండా తేలికపాటి సబ్బు, నీటితో శుభ్రం చేయవచ్చు. ఇవి అగ్ని నిరోధక శక్తిని కలిగి ఉంటుంది. అన్ని రకాల వాతావరణాలకు అనుకూలమైనవి. నీరు పడితే ఉబ్బడం, అధిక వేడికి కాలిపోవడం, కరగడం జరగదు. ఈ స్టీల్‌కు రంధ్రాలు ఉండవు కాబట్టి తెగుళ్లు, చెదపురుగులు పట్టవు.పర్యావరణ అనుకూలమైనవి.. సాధారణ ఇళ్లతో పోలిస్తే స్టెయిన్లెస్ స్టీల్ కిచెన్ ఉండే ఇంటి విలువ కొంత మెరుగ్గా ఉంటుంది. ఉన్నతశైలి అనుభూతిని కలిగిస్తుంది. ఇది పర్యావరణ అనుకూలమైనది. స్టయిన్‌లెస్ స్టీల్‌తో తరుచూ కిచెన్ కౌంటర్ టాప్‌లు, క్యాబినెట్ల తయారీ కోసం వినియోగిస్తారు. అయితే వీటి ఎంపికలో జాగ్రత్తలు అత్యవసరం. కేవలం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) సర్టిఫికేషన్, ఇండియన్ స్టాండర్డ్ ఇనిస్టిట్యూషన్(ఐఎస్ఐ) మార్క్ ఉన్న ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయాలి. -
అందమైన వంటిల్లు!
మాడ్యులర్ కిచెన్స్ పై పెరుగుతున్న ఆసక్తి సాక్షి, హైదరాబాద్: మహిళలు తమ ఇష్టప్రకారం నడిపించే రాజ్యం వంటగది. పిల్లలు అమ్మ నుంచి తాయిలం సంపాదించాలన్నా.. నాన్నకు సిఫారుసులు చేరవేసేలా అమ్మను కాకాపట్టాలన్నా.. కొత్త కోడలు కుటుంబాన్ని ప్రసన్నం చేసుకోవాలన్నా వంట గదే మూలం. మరి అలాంటి గదిని అందంగా తీర్చిదిద్దడం ఒక కళే. ఆ ఆసక్తిని ఉపాధిగా మార్చుకునేలా చేస్తోంది ‘మాడ్యులర్కిచెన్’. ♦ ఇంటీరియర్ డిజైనింగ్‌లో ఓ భాగమే కిచెన్ డిజైనింగ్. రానురానూ దీనికి ఆదరణ పెరిగి మాడ్యులర్ కిచెన్ డిజైనింగ్ అనే ప్రత్యేక విభాగంగా రూపాంతరం చెందింది. ముంబై, ఢిల్లీ, చెన్నైల్లో మనకంటే కాస్త ముందుగానే కిచెన్ డిజైనింగ్ విస్తరించగా హైదరాబాద్, బెంగళూరుల్లోనూ వీటి ఆదరణ పెరుగుతోంది. మాడ్యులర్ కిచెన్ అంటే.. వంటింట్లోని సామాగ్రి బయట కనబడకుండా, సులువుగా తీసుకునేలా అందంగా తీర్చిదిద్దడమే మాడ్యులర్ కిచెన్. తక్కువ స్థలంలో ఎక్కువ వస్తువులను తీర్చిదిద్ది.. అందంగా ఉండాలని కోరుకుంటున్నారు మహిళలు. అందుకే ఇల్లు పాతదైనా.. కొత్తదైనా.. వంట గదిని ఆకర్షణీయంగా కనిపించేలా చేయడంతో పాటు అవసరమైనప్పుడు తెరుచుకునేలా, కావాల్సిన వైపుకు తిప్పుకునేలా మాడ్యులర్ కిచెన్‌లో ర్యాకులుంటాయన్నమాట. చిన్న చిన్న వస్తువులకు కూడా హైరానా పడకుండా అందుబాటులో ఉండేలా డిజైన్ చేస్తారు. బడ్జెట్‌ను బట్టి.. ఇందుకోసం ముందుగా తయారీ విడి భాగాలతో ఒక నమూనా తయారు చేస్తారు. కేటాయించిన స్థలం, ఖాతాదారుడి బడ్జెట్‌పై వీటి తయారీ ఆధారపడి ఉంటుంది. వంటగదికి కేటాయించిన స్థలాన్ని అంచనావేసి, దానికి అనుగుణంగా విడిభాగాలను సేకరించి వంటగదిలో అమర్చుతారు. తక్కువ స్థలంలో ఇముడుతూ, ఎక్కువ అందంగా వంటగది కనిపించేలా చూడటమే డిజైనర్ పని. మన ఆసక్తి, అభిరుచులకు తగ్గట్టుగానే మాడ్యులర్ కిచెన్స్లోనూ పలురకాల మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. వంటింట్లోని సామాగ్రి బయట కనబడకుండా, సులువుగా తీసుకునేలా అందంగా రూపుదిద్దుతున్నారు. వీటి ధరలు రూ.10 వేల నుంచి ప్రారంభమవుతున్నాయి. మాడ్యులర్ కిచెన్స్ నుంచి పొగ బయటకు రాదు. పాతకాలంలో పొయ్యి మీద పొగ గొట్టాలున్నట్లుగానే ఉంటాయి. కానీ ఇవి అధునాతనంగా ఉంటాయి. దీంతో పాటు వంట సామాగ్రి చెంచాలు, కప్పులు, ప్లేట్లు వేర్వేరుగా పెట్టుకునేందుకు అరలను అమరుస్తారు. లిమెన్స్ కార్నర్, పుల్ అవుట్, టాల్ యూనిట్ ఇలా రకరకాల పేర్లతో మన అవసరాలకు తగ్గట్టుగా ప్రత్యేక అరలను ఏర్పాటు చేస్తారు. ఒక్కో అర 50 కిలోల బరువును మోసేలా ఉంటుంది. వీటికి వేడి తగిలినా.. నీటిలో తడిచినా ఏమాత్రం చెక్కుచెదరవు. స్థిరాస్తులకు సంబంధించి మీ సందేహాలు మాకు రాయండి. realty@sakshi.com


