breaking news
false information to EC
-
అఫిడవిట్లో అబద్ధాలపై ఓటరూ కేసు వేయొచ్చు!
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్ అఫిడవిట్లలో తప్పుడు సమాచారం ఇచ్చినా, వాస్తవాలను దాచిపెట్టినా ఇకపై సాధారణ ఓటర్లు సైతం నేరుగా కోర్టుల ద్వారా క్రిమినల్ కేసులు నమోదు చేయవచ్చు. ప్రజాప్రాతినిధ్య చట్టం–1951లోని సెక్షన్ 125ఏ కింద ప్రైవేట్ వ్యక్తులు దాఖలు చేసే ఫిర్యాదులను కోర్టులు స్వీకరించవచ్చని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఇలాంటి కేసుల్లో కేవలం ఎన్నికల సంఘం లేదా సంబంధిత ప్రభుత్వ అధికారులు మాత్రమే ఫిర్యాదు చేయాలనే నిబంధన ఏదీ లేదని స్పష్టం చేసింది. కర్ణాటకకు చెందిన ఓ ఎమ్మెల్యే కేసు విచారణ సందర్భంగా జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగులతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఇటీవల స్పష్టతనిచ్చింది. ఆ నిబంధన ఇక్కడ వర్తించదు..ఎన్నికల అఫిడవిట్లలో తప్పుడు సమాచారం ఇచ్చే అభ్యర్థుల వ్యవహారం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ)లోని సెక్షన్ 195(1) పరిధిలోకి రాదని ధర్మాసనం తెలిపింది. కొన్ని నిర్దిష్ట నేరాలకు సంబంధించి ప్రభుత్వ అధికారులు మాత్రమే ఫిర్యాదు చేయాలని సెక్షన్ 195(1) చెబుతోంది. అయితే, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 125ఏ కింద నమోదయ్యే ఉల్లంఘనలకు ఇది వర్తించదని తేల్చింది. అభ్యర్థులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇస్తే శిక్షించేందుకు ఉద్దేశించిన సెక్షన్ 125ఏను సీఆర్పీసీ సెక్షన్ 195 జాబితాలో చేర్చలేదని గుర్తుచేసింది. చట్టసభల ఉద్దేశం స్పష్టం ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 125ఏ నిబంధనను 2002లో తీసుకురాగా, సీఆర్పీసీలోని సెక్షన్ 195 నిబంధనను 2006లో సవరించారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు తప్పుడు సమాచారం ఇచ్చే అభ్యర్థులపై అధికారులే ఫిర్యాదు చేయాలని చట్టసభలు భావించి ఉంటే, ఆ మేరకు సీఆర్పీసీ సెక్షన్ 195లో సెక్షన్ 125ఏను కూడా చేర్చి ఉండేవారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. చట్టసభలు ఉద్దేశపూర్వకంగానే దాన్ని మినహాయించినట్లు పరిగణించాలని వివరించింది. అఫిడవిట్లలో తప్పుడు సమాచారం ఇస్తే ఇతర చట్టాలతో సంబంధం లేకుండా శిక్షలు అమలు అవుతాయని సెక్షన్ 125ఏలో ఉన్న నిబంధనను ఈ సందర్భంగా ప్రస్తావించింది. ప్రైవేట్ వ్యక్తులు ఈ సెక్షన్ కింద ఫిర్యాదు చేయకూడదని ఏ చట్టంలోనూ లేదని కుండబద్దలు కొట్టింది. -
ఓటు కోసం అమెరికన్ వేషం..
న్యూయార్క్: ఓటేసేందుకు తప్పుడు సమాచారం ఇచ్చాడని, అమెరికన్ పౌరుడినని ప్రమాణం చేశాడని అమెరికాలోని మినసోటాలో ఓ భారతీయుడిపై ఆరోపణలు నమోదయ్యాయి. మినసోటా డి్రస్టిక్ట్‌లోని ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ గురువారం ఈ మేరకు రెండు అభియోగాలను ఖరారు చేసింది. ఈ ఆరోపణలు రుజువైతే ఒక్కో దానికి ఐదేళ్ల చొప్పున జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అమెరికాలోని మినసోటాలో ముఖేశ్‌కుమార్ సోమాభాయ్ చౌదరి 2024 నవంబరు ఐదవ తేదీకి కొంచెం అటు ఇటుగా ‘ఓటర్ సిగ్నేచర్ సర్టిఫికెట్’పై సంతకం పెట్టాడు. తాను అమెరికా పౌరుడినని ప్రమాణం చేశాడు. అయితే ఆ తరువాత జరిగిన విచారణలో అతడు అమెరికన్ పౌరుడు కాదన్న విషయం తెలిసింది. అమెరికాలో సాధారణ ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఓటర్ల జాబితాను, తాము అమెరికన్ పౌరులమని ఇచి్చన ప్రమాణాలను తనిఖీ చేస్తారు. అనుమానిత సరి్టఫికెట్లను ఇమ్మిగ్రేషన్ సమాచారంతో సరిపోల్చి చూసుకుంటారు. ఇందుకు కొంత సమయం పడుతుంది. ముఖేశ్‌కుమార్ విషయంలోనూ ఇదే జరిగింది. తాను అమెరికా పౌరుడిని కానని తెలిసి మరీ సంతకం పెట్టాడని కేవలం ఓటు వేసేందుకు తప్పుడు ప్రకటన ఇచ్చాడని అసిస్టెంట్ అటార్నీ జనరల్ హర్మీత్ కే.ధిల్లోన్ తెలిపారు. ‘‘ఓటు హక్కు అమెరికన్ పౌరసత్వానికి లభించే పవిత్రమైన గౌరవం. అయితే అర్హులైన వారు మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకోవడంలోనే ఎన్నికల స్వచ్ఛత ఆధారపడి ఉంటుంది’’అని చెప్పారు. -
వివాదంలో మరో ఆప్ ఎమ్మెల్యే
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నారు. 2015లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లో ఈసీకి తప్పుడు సమాచారం ఇచ్చారనే కేసులో ఆప్ ఎమ్మెల్యే సోమ్ దత్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు పంపింది. ఈ కేసులో అక్టోబరు 13వ తేదీలోపు కోర్టు ఎదుట హాజరుకావాల్సిందిగా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ అభిలాష్ మల్హోత్రా.. సోమ్ దత్‌ను ఆదేశించారు. 2015లో సాదర్ బజార్ నియోజకవర్గం నుంచి ఆప్ తరఫున సోమ్ దత్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దత్ తల్లిదండ్రులు ఆయనపై ఆధారపడి జీవిస్తున్నారని, అఫిడవిట్లో ఈ విషయాన్ని దాచారని, అలాగే ఆస్తుల వివరాలను పూర్తిగా ప్రకటించలేదని ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. ఢిల్లీలో అధికార ఆప్ ఎమ్మెల్యేలు 12 మందిపై పలు కేసులు నమోదయ్యాయి. నకిలీ డిగ్రీ పొందారనే ఆరోపణలపై న్యాయ శాఖ మాజీ మంత్రి జితేందర్ తోమర్ అరెస్ట్ కాగా, మరో మాజీ మంత్రి సోమనాథ్ భారతి గృహహింస కేసును ఎదుర్కొంటున్నారు. ఇక ఆప్ ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్‌పై హత్య, అత్యాచారం కేసు నమోదైంది.


