అఫిడవిట్‌లో అబద్ధాలపై ఓటరూ కేసు వేయొచ్చు!  | Voters Can File Private Complaints Against Candidates For False Affidavits | Sakshi
Sakshi News home page

అఫిడవిట్‌లో అబద్ధాలపై ఓటరూ కేసు వేయొచ్చు! 

Oct 20 2026 5:45 AM | Updated on Oct 20 2026 5:45 AM

Voters Can File Private Complaints Against Candidates For False Affidavits

ఎన్నికల అఫిడవిట్లలో తప్పుడు వివరాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్‌ అఫిడవిట్లలో తప్పుడు సమాచారం ఇచ్చినా, వాస్తవాలను దాచిపెట్టినా ఇకపై సాధారణ ఓటర్లు సైతం నేరుగా కోర్టుల ద్వారా క్రిమినల్‌ కేసులు నమోదు చేయవచ్చు. ప్రజాప్రాతినిధ్య చట్టం–1951లోని సెక్షన్‌ 125ఏ కింద ప్రైవేట్‌ వ్యక్తులు దాఖలు చేసే ఫిర్యాదులను కోర్టులు స్వీకరించవచ్చని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఇలాంటి కేసుల్లో కేవలం ఎన్నికల సంఘం లేదా సంబంధిత ప్రభుత్వ అధికారులు మాత్రమే ఫిర్యాదు చేయాలనే నిబంధన ఏదీ లేదని స్పష్టం చేసింది. కర్ణాటకకు చెందిన ఓ ఎమ్మెల్యే కేసు విచారణ సందర్భంగా జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ షీల్‌ నాగులతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఇటీవల స్పష్టతనిచ్చింది. 

ఆ నిబంధన ఇక్కడ వర్తించదు..
ఎన్నికల అఫిడవిట్లలో తప్పుడు సమాచారం ఇచ్చే అభ్యర్థుల వ్యవహారం క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సీఆర్‌పీసీ)లోని సెక్షన్‌ 195(1) పరిధిలోకి రాదని ధర్మాసనం తెలిపింది. కొన్ని నిర్దిష్ట నేరాలకు సంబంధించి ప్రభుత్వ అధికారులు మాత్రమే ఫిర్యాదు చేయాలని సెక్షన్‌ 195(1) చెబుతోంది. అయితే, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 125ఏ కింద నమోదయ్యే ఉల్లంఘనలకు ఇది వర్తించదని తేల్చింది. అభ్యర్థులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇస్తే శిక్షించేందుకు ఉద్దేశించిన సెక్షన్‌ 125ఏను సీఆర్‌పీసీ సెక్షన్‌ 195 జాబితాలో చేర్చలేదని గుర్తుచేసింది. 

చట్టసభల ఉద్దేశం స్పష్టం 
ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 125ఏ నిబంధనను 2002లో తీసుకురాగా, సీఆర్‌పీసీలోని సెక్షన్‌ 195 నిబంధనను 2006లో సవరించారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు తప్పుడు సమాచారం ఇచ్చే అభ్యర్థులపై అధికారులే ఫిర్యాదు చేయాలని చట్టసభలు భావించి ఉంటే, ఆ మేరకు సీఆర్‌పీసీ సెక్షన్‌ 195లో సెక్షన్‌ 125ఏను కూడా చేర్చి ఉండేవారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. చట్టసభలు ఉద్దేశపూర్వకంగానే దాన్ని మినహాయించినట్లు పరిగణించాలని వివరించింది. అఫిడవిట్లలో తప్పుడు సమాచారం ఇస్తే ఇతర చట్టాలతో సంబంధం లేకుండా శిక్షలు అమలు అవుతాయని సెక్షన్‌ 125ఏలో ఉన్న నిబంధనను ఈ సందర్భంగా ప్రస్తావించింది. ప్రైవేట్‌ వ్యక్తులు ఈ సెక్షన్‌ కింద ఫిర్యాదు చేయకూడదని ఏ చట్టంలోనూ లేదని కుండబద్దలు కొట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement