పోరుదారి.. | Sakshi
Sakshi News home page

Published Tue, Feb 20 2018 6:21 PM

women empowerment teacher became lawyer - Sakshi

జగిత్యాలజోన్‌:  ఆమెకు పోరాట పటిమ ఎక్కువ. ఎక్కడ మహిళా హక్కులకు భంగం వాటిల్లుతుందో అక్కడ ఆమె ప్రత్యక్షమవుతారు. బాధితుల తరఫున వాదిస్తారు. మహిళలపై జరుగుతున్న దాడులు, అన్యాయాలపై పోరాడేందుకు టీచ ర్‌ నుంచి న్యాయవాదవృత్తికి వచ్చారు. ఆమెనే జగిత్యాలకు చెందిన ముదుగంటి త్రిపుర. మహిళా సాధికారత గురించి ఆమె మాటల్లోనే..

ముగ్గురు అక్కాచెల్లెళ్లు..అన్నయ్యా.. 
మేము ముగ్గురం అక్కాచెల్లెళ్లం, ఒక అన్నయ్య. మా తండ్రి రామగుండం విద్యుత్‌సంస్థలో ఇంజినీర్‌గా పనిచేసేవారు. ఆడపిల్లలు అంటేనే భారంగా భావించే ఆ రోజుల్లో మా ఇంట్లో ముగ్గురం ఆడపిల్లలం కావడంతో.. డిగ్రీ పూర్తవడంతో నాకు పెళ్లి చేశారు. 1996లో మల్యాల మండలం తక్కళ్లపల్లికి చెందిన ముదుగంటి అమరేందర్‌రెడ్డితో వివాహమైంది. జగిత్యాలలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో టీచర్‌గా జాయినయ్యాను.

ఈక్రమంలో ఎంఏ ఇంగ్లిష్‌ పూర్తి చేశాను. వెంటనే, ఓ పారామెడికల్‌ కళాశాలలో ఇంగ్లిష్‌ లెక్చరర్‌గా పనిచేశాను. అనంతరం జేఎన్టీయూ కొండగట్టులో నాలుగేళ్లపాటు ఇంగ్లిష్‌ సబ్జెక్టుకు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేశాను. అయినా ఏదో అసంతృప్తి ఉండేది. దీనికితోడు ప్రతి రోజు ఎక్కడోచోట మహిళలపై అరాచకాలు, ఆకృత్యాలు జరుగుతూనే ఉండేవి. ఇలాంటి సమయంలోనే మహిళలకు నా వంతుగా తోడ్పాటునందించాలనే కాకతీయ యూనివర్సిటీలో లాకోర్సు పూర్తి చేశాను.

ఏకైక మహిళా న్యాయవాదిగా.. 
రాష్ట్ర బార్‌కౌన్సిల్‌లో సభ్యత్వం పొందిన తర్వాత ఏడాది పాటు కరీంనగర్‌లో, తర్వాత పూర్తిస్థాయిలో జగిత్యాల కోర్టులో ప్రాక్టీస్‌ మొదలుపెట్టాను. నేను జగిత్యాలకు వచ్చిన సమయంలో ఒక్కరూ మహిళా న్యాయవాది లేరు. అయినప్పటికీ మనోనిబ్బరంతో సీనియర్‌ న్యాయవాది ముదుగంటి జనార్దన్‌రెడ్డి దిశనిర్దేశంలో కేసులు వాదించడం మొదలుపెట్టాను. దాదాపు ఎనిమిదేళ్లపాటు జగిత్యాల కోర్టులో ఏకైక మహిళా న్యాయవాదిని. అయితే నాకు విధుల్లో ఎక్కడ వివక్ష ఎదురుకాలేదు. అందరూ సహకరించారు. ఇప్పుడు మరో నలుగురైదుగురు మహిళా న్యాయవాదులు ప్రాక్టీస్‌కు రావడంతో.. కొన్ని మౌళిక వసతులు సాధించుకున్నాం.  

జడ్జీలు పిలిచి కేసులు ఇచ్చారు 
ప్రతి రోజు క్రమశిక్షణతో కోర్టుకు రావడం, కోర్టు విషయాలపై ఆసక్తి పెంచుకోవడంతో, జడ్జీలు గ్రహించి జైళ్లలో ఉన్న ఖైదీల కేసులు, ఉచిత న్యాయ సహాయం కింద వచ్చే కేసులను అప్పగిస్తుండేవారు. వారి నమ్మకాన్ని నిలబెట్టాలని రాత్రింబవళ్లు సుప్రీంకోర్టు, హైకోర్టు కేసులను పరిశీలించి, వాటిని జడ్జీల ముందు ఉంచేదానిని. దీంతో చాలా కేసుల్లో విజయం సాధించాం. మా సీనియర్‌ న్యాయవాది సైతం సివిల్‌కేసుల్లో వాదించాలని ప్రోత్సహిస్తుంటారు.

మహిళల తరఫున నిలబడాలనే..  
ఒక మహిళగా తోటి మహిళలకు అండగా నిలబడాలనే ఆలోచిస్తాను. భార్యను పోషించలేని భర్తలపై కేసులు వేసి వారికి ఆర్థికంగా సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాను. అన్నిరకాల కేసులు వాదిస్తున్నాను. ఇటీవల ఒకావిడ తన భర్త తాగి వచ్చి బాగా కొడుతున్నాడని, పిల్లలను సరిగ్గా చూడడం లేదని విలపించడంతో అతన్ని పిలిపించి కౌన్సిలింగ్‌ చేశాం. ప్రస్తుతం అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు. భర్తలను వేధించుకునేందుకు స్త్రీలు కేసులు పెడుతుంటారని చాలా మందిలో ఉన్న అభిప్రాయం తప్పు. నా దగ్గరికి వచ్చే మహిళలకు మంచిమాటలు చెప్పి కేసులు లేకుండానే వారిని కలిపేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తుంటాను.  

పోరాట పటిమ ఉండాలి 
ప్రతి మహిళకు పోరాట పటిమ ఉండాలి. వారి కాళ్లపై నిలబడే ఆర్థికశక్తి ఉండాలి. చిన్నవయస్సులోనే పెళ్లిళ్లు చేయొద్దు. ఉన్నత విద్యనభ్యసించేందుకు అవకాశాలు కల్పించాలి. సోషల్‌మీడియాలో కాలం వృథా చేయొద్దు. బంగారు భవిష్యత్‌ కోసం చదువుపై దృష్టి పెడితే ఉన్నతంగా ఎదుగుతారు. అవే మనకు గుర్తింపు తెస్తాయి. 

Advertisement
Advertisement