టీచర్‌ ఎమ్మెల్సీ కైవసానికి టీఆర్‌ఎస్‌ వ్యూహం! | Sakshi
Sakshi News home page

టీచర్‌ ఎమ్మెల్సీ కైవసానికి టీఆర్‌ఎస్‌ వ్యూహం!

Published Fri, Feb 17 2017 1:20 AM

టీచర్‌ ఎమ్మెల్సీ కైవసానికి టీఆర్‌ఎస్‌ వ్యూహం!

ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యత
మంత్రి హరీశ్‌రావుకు సమన్వయ బాధ్యతలు


హైదరాబాద్‌: శాసన మండలి ఉపాధ్యా య నియోజకవర్గ (మహబూబ్‌నగర్‌–రంగా రెడ్డి– హైదరాబాద్‌) ఎన్నికలో తాము మద్దతిస్తున్న అభ్యర్థిని గెలిపించుకునేందుకు అధికార టీఆర్‌ఎస్‌ వ్యూహ రచన చేస్తోంది. పంచాయతీరాజ్‌ టీచర్స్‌ యూనియన్‌ (పీఆర్టీయూ)కు చెందిన కాటేపల్లి జనార్దన్‌రెడ్డి ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శాసన మండలి చైర్మన్‌ పదవికి ఎన్నిక జరిగిన సమయంలో టీఆర్‌ఎస్‌ వైపు వచ్చిన ఆయన పదవీకాలం వచ్చే నెల 29తో పూర్తవుతోంది. అయితే మండలి చైర్మన్‌ ఎన్నిక సందర్భంగా తమకు మద్దతిచ్చిన జనార్దన్‌రెడ్డినే ఈ సారి గెలిపించుకోవాలని టీఆర్‌ఎస్‌ అగ్రనాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని చేజారనీయవద్దని ఎన్నిక జరుగనున్న మూడు జిల్లాల నేతలను పార్టీ అధినాయకత్వం ఆదేశించినట్లు సమాచారం. జనార్దన్‌రెడ్డికి మద్దతిస్తున్న సంకేతాలను ఇప్పటికే ఇచ్చిన టీఆర్‌ఎస్‌.. పీఆర్టీయూలో పోటీదారులను బుజ్జగించే పనిలో ఉంది. తెలంగాణ పీఆర్టీయూ అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి కూడా ఎమ్మెల్సీ బరిలో నిలిచేందుకు టీఆర్‌ఎస్‌ మద్దతు కోరుకుతున్నారు. ఈ ఇద్దరూ పార్టీకి కావాల్సిన వారే కావడంతో అధినాయకత్వం ఇప్పటికే ఓ మారు హర్షవర్ధన్‌రెడ్డికి సర్దిచెప్పే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. ఈ ఎన్నిక సమన్వయ బాధ్యతను  హరీశ్‌రావుకు అప్పజెప్పింది.

మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు
3 జిల్లాల ఉపాధ్యాయ ఓట్లతో ముడిపడి ఉన్న ఎన్నిక కావడంతో  దీనిని సవాలుగా తీసుకున్నారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లోని ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న టీచర్ల బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పజెప్పారు. జిల్లా మొత్తాన్ని ఆ జిల్లా మంత్రులు సమన్వయం చేస్తారు. టీచర్‌ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న మండలి చీఫ్‌ విప్‌ పాతూరి సుధాకర్‌రెడ్డిని రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జిగా నియమించారు.   200 మంది టీచర్లకు ఒక ఇన్‌చార్జిని నియమించారు.

రేపు నామినేషన్‌ దాఖలు!
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్‌ఎస్‌ మద్దతుతో పోటీ చేస్తున్న కాటేపల్లి జనార్ధన్‌రెడ్డి ఈనెల 18న నామినేషన్‌ వేయనున్నట్లు తెలిసింది.

ముందు జాగ్రత్తగా
గతంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్‌ఎస్‌ తన అభ్యర్థిగా అప్పటిదాకా టీఎన్జీవోల నేతగా ఉన్న దేవీప్రసాద్‌ను నిలబెట్టింది. కానీ పలు కారణాల వల్ల ఆయన ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికలో ఆ ఫలితం పునరా వృతం కాకుండా టీఆర్‌ఎస్‌ నాయకత్వం చర్యలు చేపడుతోంది. ఈ ఎన్నికకు సంబంధించి 24 వేల పైచిలుకు టీచర్‌ ఓట్లు ఉండగా.. అందులో రంగారెడ్డి జిల్లాలోనే సగం ఓట్లు ఉన్నాయి. దీంతో ఆ జిల్లాపై ప్రధానంగా దృష్టి పెట్టారు. హైదరాబాద్‌లో తక్కువ సంఖ్యలోనే ఓట్లున్నా.. జీహెచ్‌ఎంసీ పరిధిలోని కార్పొరేటర్లకు ఇన్‌చార్జి బాధ్యలు అప్పజెప్పారు. మున్సిపాలిటీల పరిధిలో కౌన్సిలర్ల సేవలను వినియోగించు కోనున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement